3944* వ రోజు.......

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు!

చల్లపల్లి శ్రమదాన పరంపరలో మరొక సంఖ్య - 3944*

               గురువారం - 3.9.26 వేకువ కూడ శ్రమదాన స్థలం పెద్దగా మారలేదు - అదే గంగులవారిపాలెం మూల  మలుపు; కార్యకర్తలు 31 గా లెక్కించడమైనది, అందులో డజను మందిది 4.19AM. సమయానికి హాజరి!

               మరి – గ్రామస్తుల లెక్కతో పోలిస్తే ఈ కొద్దిమంది కార్యకర్తల కార్యకలాపములేవి? 100-150 గజాల రోడ్డులోనే ఇందరు గంటన్నరకు పైగా ఏమి సాధించారు?.... వంటి కొన్ని విషయాలు చూద్దాం!

- మొదట ప్రస్తావించదగినది - ఈ శ్రమదానోద్యమం  తొలి నాళ్ళలో కొందరి తేలిక మాటల్లాగా – స్వచ్ఛ కార్యకర్తలు పనీపాటూ లేక ఇలా వీధి పనులకు పూనుకోలేదు - ప్రజల సౌకర్యాల, ఆహ్లాదాల స్పష్టమైన అలోచన చేసి మాత్రమే ప్రయత్నిస్తున్నారు! పాక్షికంగానైనా విజయం సాధిస్తున్నారు.

- రెండోది – “ఫలానా వీధిని మాత్రమే బాగుచేసి, చేతులు దులుపుకొనే రకాలు కాదు. శ్మశానాలను పునరుద్ధరించి, దట్టంగా చెట్లు పెంచి, ప్రతి రోజు ప్లాస్టిక్ దరిద్రాలను పరిహరించి, పర్యావరణ స్పృహను పెంచాలనే ఆశయం వాళ్లది!

- అందుకే ఊళ్లో ఏ మూల మురుగుకాల్వ నిలిచిపోయినా,

               ఏ రోడ్డుకు గుంటలు పడినా, ఏ వీధిలో క్రొత్తగా ఫ్లెక్సీలు వెలసినా, వాళ్ల మనసులు చివుక్కుమంటాయి!

               తమ పరిధిలో శక్తివంచన లేకుండ చక్కదిద్దుతారు!

               ఈ 3944 వ శ్రమదానమూ అంతే! లేకపోతే - ఇద్దరు పెద్ద వైద్యులు ఊరంతా తమ సొంతమైనట్లు - వేకువ సమయాన - వీధుల్లో తిరుగుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లు ఏ దుకాణాల వద్దా కనిపించలేదని సంబరపడడమేమిటి?

               ఈ యువతులు ఈ 100 గజాల రోడ్డూ తమదే అనుకొని - 3 రోజుల్నుండీ ఊడ్చి - ఊడ్చి, సంతోషిస్తారెందుకు? పని వేళ ఈగలు - పురుగుల బెడదలో ఈ 30 మంది కత్తుల పనులేల? గడ్డి చెక్కె మరరంపపు మ్రోతలేల?

               మరొకాయన 2 గోతాలేసుకొని గాజు - ప్లాస్టిక్ సీసాలు ఏరుతాడెందుకు? చివరికి 6.02 కు పని విరమణ విజిల్ చప్పుడుకు ఐదారుగురు అయిష్టంగా పనులాపి, దుమ్ము కొట్టుకున్న బట్టలతో వాళ్ళ వేషాలేమిటి?

               రైతు కార్యకర్త ప్రేమానందుల వారు అంత దృఢంగా నినాదాలతో ప్రతిజ్ఞలు చేయడం వట్టిలాంచనమేనా?

               చిరకాలంగా చిక్కులెదుర్కొని, ఎట్టకేలకు హిందూ శ్మశానవాటిక 235 మీటర్ల అనుసంధాన రహదారికి 20 లక్షలు మంజూరైతే ఆ DRK గారి ఆనందమెందుకు?

               రేపటి కార్యక్రమం గంగులవారిపాలెం రోడ్డులోనే – బండ్రేవు కోడు కాల్వ వంతెన వద్ద ప్రారంభం కావలెనని నిర్ణయం!

               కార్యకర్త నిర్వాకము!

వందో - వెయ్యో కాదది - లక్షలు దాటిన త్యాగము!

ఊరి జనుల సుఖములకై పుష్కరకాలపు కష్టము!

ఐదో - ఆరో లక్షల పని గంటల బాధ్యతలు!

ఔనౌనది చల్లపల్లి కార్యకర్త నిర్వాకము!

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   03.09.2026