ఇకపై కూడా ఇటువంటి ఫోటోలను చూడాలా!....

 ఇకపై కూడా ఇటువంటి ఫోటోలను చూడాలా!

               నేటి హిందూ దినపత్రిక మొదటి పేజీలోని చిత్రం ఇది. ఒక సరస్సులోని ప్లాస్టిక్ వ్యర్థాల మధ్యలో ఉన్న పెలికాన్ పక్షి! ఎంత హృదయవిదారకంగా ఉన్నదో  కదా!

                జులై 1, 2022 వ తేదీన భారత ప్రభుత్వం ఈ క్రింది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను నిషేధించింది. తయారీదార్ల, అమ్మకందార్ల దగ్గర మరిన్ని నిబంధనలు (restrictions) విధించి, జులై 2025 న ఇంకా కొన్ని దృఢ నిర్ణయాలు తీసుకొన్నది.

వాటిలో :

- 120 మైక్రాన్ల మందం కంటే ఎక్కువ ఉన్న ప్లాస్టిక్ సంచులు (క్యారీ బ్యాగులు) మాత్రమే తయారు చేయాలి.

- ప్లాస్టిక్ కప్పులు, గ్లాసులు ప్లేట్లు, స్ట్రాలు, ధర్మోకోల్ అలంకరణలు,

- ప్లాస్టిక్ ఇయర్ బడ్స్,

- ప్లాస్టిక్ బెలూన్లు,

- ప్లాస్టిక్ జెండాలు,

- ప్లాస్టిక్ ఐస్ క్రీం పుల్లలు,

- ప్లాస్టిక్ ఫోర్కులు, చెంచాలు, కంచాలు, చాకులు, స్టర్రర్స్,

- 100 GSM లోపు ఉన్న ప్లాస్టిక్ బ్యానర్లు

               వీటన్నిటినీ 2022 లో నిషేధించి 2025 జులైలో మరింత కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చింది.

               సదరు ఆదేశాలను సిక్కిం రాష్ట్రం ఆదర్శవంతంగా అమలు చేస్తోంది. ఊటీ, మున్నార్ లాంటి హిల్ స్టేషన్స్ లో ఎప్పట్నుంచో అమలు చేస్తున్నారు.

               పర్యావరణ ప్రమాదకరమైన ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను బ్యాన్ చేయాలని అందరు కలెక్టర్లకూ, ముఖ్యమంత్రులకూ గత 12 సంవత్సరాల నుండీ మా “స్వచ్ఛ చల్లపల్లి” ఉద్యమం విజ్ఞప్తి చేస్తూనే ఉంది.

               చల్లపల్లిలో 6 వ నంబరు కాలువ, చిల్లలవాగు, ప్రభుత్వ వైద్యశాల వెనుక ప్రాంతాల వంటివి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులతో దుర్గంధ భూయిష్టంగా, భీభత్సంగా ఉంటున్నాయి కదా! వైరల్ జ్వరాలకు స్థావరాలుగా మారుతున్నాయి గదా!

               మరి మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు మంచి గాలి, నీరు, భూమి అందివ్వడం మన బాధ్యత కదా! మన తాత్కాలిక సౌకర్యం కోసం ఇలా వాడి అలా పారేసే ఈ ప్లాస్టిక్ వస్తువులను వాడి భావితరాలను ఇబ్బంది పెట్టడం ఏం న్యాయం!

               చల్లపల్లిలో గత పుష్కరకాలంగా స్వచ్ఛ కార్యకర్తలం ఎన్ని ట్రాక్టర్ల ఏకమాత్ర ప్రయోజనకర ప్లాస్టిక్ లను ఏరామో గుర్తున్నది. సుప్రీంకోర్టు తీర్పును గౌరవించడమూ, ప్రజాహితం కోసం పనిచేసే ప్రభుత్వ కార్యక్రమాన్ని పాటించడమూ, ప్రజలందరి కర్తవ్యమని భావించి అందరం సామాజిక బాధ్యత వహించే సమయమిది!

- స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలు  

    05.09.2026

ఇది మన 6 వ నెంబరు కాలువ