3947* వ రోజు.......

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు!

ఈ పనిదినం 3947* వది! (ఆదివారం - 6.9.26)

               ఏ జీతభత్యాలూ ఆశించక తమ ఊరి కోసం అరవ చాకిరి చేసిన కార్యకర్తలు 36 మంది, పని వేళ ఆర్చుకొని, తీర్చుకొని ఏ 7 - 8 గంటలకో కాక వేకువ 4:20 - 6:06 AM ల మధ్య,

               ఇక వాళ్ళ పనుల గురించీ, అలసట తెలియకుండా పాటల గురించీ చెప్పేదేముంది? వాళ్ళ గ్రామ  పారిశుద్ధ్య పరిశుభ్రతా సంబంధిత చతురోక్తుల గురించి ఎవరైనా ½  గంటపాటు అక్కడుండి చూడాలి తప్ప ఎన్నని వ్రాసేది?

               “ఏదో వచ్చాం, బట్ట నలగకుండా పనిచేశాం, వెళ్లాం” అని కాక - మనసు పెట్టి, గ్రామ సౌకర్యాల కోసం చర్చించుకొంటూ - అందరూ ఏకాభిప్రాయంతో కలిసికట్టుగా - పన్నెండేళ్లుగా శ్రమిస్తున్న వాళ్ళ పనులెంత చక్కగా ఉండాలో అలానే ఉన్నవి!

               “నిన్న శుభ్రపరచిన బండ్రేవు కోడు వంతెన ప్రాంతమే కదా - మళ్లీ ఈ వేకువ ఇందరు ఇంత శ్రద్ధగా - అందులో నలుగురైతే చెమటతో పూర్తిగా తడిసి, మట్టి కొట్టుకొనేంతగా శ్రమించాలా? దీనికి బదులు NH 216 ప్రక్కనే ఉన్నది గదా!” అంటే –

               “మనమేమన్నా డబ్బుల కోసమో - పేరు ప్రఖ్యాతుల కోసమో చేస్తున్నామా? ఇది మన బాధ్యత అనుకొనే గదా చేసుకుపోతున్నది? ఆ చేసే పనులేవో సంపూర్ణ తృప్తికరంగా చేద్దాం...” అని వాళ్ళ సమాధానం!

               బాటను ఈ ఉదయం 2 మార్లు ఉడ్చిన వాళ్లనీ,

               కత్తులతో గడ్డినీ, చక్కదనం కోసం చెట్ల సుందరీకణనీ, మురుగు కాల్వ గట్టును అద్దంలా బాగుచేసిన నిపుణుల్నీ,

               ప్రయాణికుల సౌకర్యం కోసం స్వాగతద్వారం వద్ద ముళ్ల పూలచెట్లను కత్తిరించే ఐదారుగుర్ని, ఆ పుట్టుకొచ్చిన తాజా వ్యర్థాల్ని డిప్పలకెత్తి అవసరమైన చోటికి చేరుస్తున్న కార్యకర్తల్ని,

               ఈ శ్రామిక దృశ్యాల్ని ఫొటోలు తీస్తున్న ఫోటో గ్రాఫర్ల ద్వయాన్నీ, పర్యవేక్షిస్తూ పరమ సంతోషిస్తున్న DRK వైద్యుడినీ......... అడగండి – ఇలాంటి జవాబులే వస్తాయి!

               చల్లపల్లి స్వచ్చోద్యమ ప్రప్రథమ దిన కార్యకర్త తూములూరి లక్ష్మణ మహాశయుడు నినాదాలతో ప్రారంభించిన 6.20 తరువాతి సభలో:

               “అసలందరూ ప్రశంసిస్తుంటే, బొత్తిగా విమర్శలే లేకపోతే ఏదో వెలితిగా ఉండేది - ఇప్పుడా కొరత తీరింది” అని వింతగా సంతోషించే DRK గారినీ, 520/-, 550/- విరాళాలను ఉద్యమ ఖర్చులకు సమర్పించిన కోడూరు, అంబటి కార్యకర్తల్నీ,

               రేపటి మన వేకువ కలయిక NH216 వద్ద అనే సమష్టి నిర్ణయాన్నీ గమనించాను!

               “మనకోసంమన” మనుకొని!

ఎన్ని చెట్లు పెంచగలరు ఈ 30 - నలభై మందే

ఎన్ని  డ్రైన్లు బాగు చేస్తిరీ నాల్గుడజన్ల మంది

రుద్ర భూమి, గ్రామ వీధి, రహదారుల పనులన్నీ,

తమ బాధ్యతలనుకొని - “మనకోసంమన” మనుకొని!

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   05.09.2026