3949* వ రోజు.......

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు!

3949* వ శ్రమదానం - (మంగళవారం – 8.9.26)

               శ్రమ స్థలం గంగులవారిపాలెం బాట నుండి కొంచెం ప్రక్కకు జరిగి, బందరు రోడ్డులోని 6 వ నంబరు కాలువ వంతెన నుండి మొదలయింది.

               ఉత్తరంగా గత కాలపు వడ్లమర వైపూ, పడమరగా శ్రీమంతుల కళాశాల దాకా, వివిధ బాధ్యతలు చేపట్టిన కార్యకర్తలు 27 మంది.

               వాళ్లలో సగం మంది 4.19 కే SBI వద్ద కాచుక్కూర్చుండగా, మిగిలిన వారి రాకతో శ్రమదాన దృశ్యాలు ఆకట్టుకొన్నాయి. వాటిని స్థూలంగా పేర్కొ నాలంటే ఇట్లున్నవి:

A) 60-70 గజాల బందరు రహదారిని శుభ్రపరచుట. ఇది ఎక్కువగా మహిళా కార్యకర్తల పని - వచ్చీ రాగానే వాళ్ళ చేతులకు తొడుగులూ, చీపురులూ అప్రయత్నంగానే వచ్చేస్తాయి. అరె! ఈ వీధి మరీ విశాలంగా ఉన్నదే  నిన్నటి సుడిగాలులకు ఆకులూ, దుమ్మూ, మొన్నటి భారీ వర్షానికి స్పీడు బ్రేకర్ల గుంటల్లో నీరు చేరిందే - ఎలా ఊడవాలి?” అని అలోచించని ఆ కర్మ వీరవనితలు ఈ ఊరికి దక్కిన అదృష్టాలు!

B) వయసు మళ్లుతున్నా – తమ పొలం పనులు తొందరిస్తున్నా – ఆ ముగ్గురు రైతుల కాయకష్టాన్నీ, తోటి కార్యకర్తల్లో నింపుతున్న స్ఫూర్తినీ ఎలా తూకం వెయ్యాలి?

C) ప్రస్తుత, విశ్రాంత ఉపాధ్యాయుల వీధి మెరుగుదల ప్రయత్నం మాత్రం సామాన్యమైనదా?

D) ఇంకా వైద్యనారాయణులు, మెకానిక్కులు, పౌరబాధ్యత లెరిగిన గ్రామస్తులు ప్రతిరోజూ నిర్వహించే వీధి పారిశుద్ధ్యం, ఈ మురికి పనులతో బాగుపడిన వీధిని చూసుకొని వారి ఆనందం ఇలా చప్పిడి మాటలతో వర్ణించడం కాదు - ఒక శ్రామిక మహాకావ్యంగా వ్రాయాలి!

E) ఉడత్తు వారి గేటు ఎదుటి రాళ్ల - మట్టి - తుక్కుగుట్టను త్రవ్వి, తట్టల కెత్తి, మోసి, ట్రాక్టరులో నింపాలని నడుము లెత్తకుండా చెమటలు క్రక్కే 7 గురి శ్రమత్యాగాన్ని ఎన్ని పద్యాలలో వర్ణించాలి?

               అలా గంటన్నరకు పైగా – పాతిక మందికి పైగా శ్రమించి,

               6.20 కి S.R.Y.S.P. పాఠశాల గేటు ముందు కొలువు తీరిన సభను BSNL మహాశయుని నినాదాలతో ప్రారంభించి,

               సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లు  వీధిలో కనబడనందుకు DRK గారు సంతోషం వెలిబుచ్చి, పల్నాటి అన్నపూర్ణ గారి కష్టార్జిత 500/- విరాళమును వారే స్వీకరించి,

               కీ శే ఉడత్తు రామారావు కుమారుని హార్లిక్స్ బిస్కట్లు అందరికీ అందించి,

               SRYSP. పాఠశాల గేటు వద్ద రేపటి వేకువ కలవాలని నిశ్చయించి, ప్రస్తుత శ్రమను వాయిదా వేశారు!

               పీకేయుట- కాల్చేయుట

ఘాటెక్కిన స్వార్ధానికి - పోటెత్తిన నిర్లక్ష్యానికి

అవగాహన లేమికి - ఒక హద్దెరుగని మౌఢ్యానికి

జనం గోడు పట్టనపుడు - పర్యావరణ స్పృహే లేక

మొక్కలెన్నొ పీకేయుట- కాల్చేయుట పెద్ద పనా? 

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   08.09.2026