3950* వ రోజు.......

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు!

బుధవారం (9-9-26) శ్రమదానానిది మరొక ల్యాండ్ మార్క్ - @3950*

               ఆ మైలురాయి చేరుకొన్న నేటి 36 మంది స్వచ్ఛ కర్మవీరులకు అభినందన మందార మాలలు! వేకువ 4.20 కు కాక 4.10 కు పని స్థలానికి హజరవడమూ, 6.00 దాటాక కూడా కొసరి కొసరి వీధి పారిశుద్ధ్యాన్ని కొనసాగించడమూ (అసలు పని వేళ 4:30-6:00 !) ఈ శ్రమదానోద్యమ క్రమశిక్షణా భంగకరములు కావని నా అభిప్రాయం!

               మరొక ప్రస్తుత విశేషమేమంటే –

               ఐదారు రోజుల్నుండి నేను 4000 రోజుల స్వచ్ఛ సుందరోద్యమము గురించి కార్యకర్తలు వ్రాసిన అభిప్రాయాలనూ, కార్టూన్లనూ పరిశీలిస్తుండగా...

               “కొందరనుకొన్నట్లు ఈ శుభ్ర సుందరోద్యమం ఆషామాషీ వ్యవహారం కాదనీ, గ్రామీణ సమాజానికి ఇది చికిత్సగా పనికొస్తుందనీ” వాళ్ళు భావిస్తున్నట్లు తెలిసింది! చూద్దాం - ఇప్పటికే కాల పరీక్షకు నిలిచిన చల్లపల్లి శ్రమదానం ఇక ముందెన్ని మలుపులు తిరుగుతుందో!

               అసలు కొన్ని ప్రక్క ఊళ్ళ నుండీ, చల్లపల్లి నలుమూలల్నుండీ ఇలా 36 మంది వేకువ 4:20 కే రావడమూ,

- బందరు రోడ్డులో వంతెన నుండి రిజిస్ట్రార్ ఆఫీసు దాక ఊడవడమూ,

- వందేళ్ల విద్యా సంస్థ - SRYSP ఎదుట గతంలో 10 ఏళ్లనాడు లక్షకు పైగా ఖర్చు చేసి, ఉద్యానాలు పెంచడమూ,

- ఈ వేకువ ముగ్గురు పనిలో మునిగిపోయి, 30-40 గజాల డ్రైన్ నుండి బండెడు సిల్టూ, చెత్తా లాగడమూ,

- అందమైన రహదారిలో సౌందర్యభంగకరంగా ఉన్న ఉడత్తు వారి షాపుల ఎదుటి వ్యర్ధాల గుట్టను ట్రాక్టర్ కెత్తి తరలించడమూ,

- “మేము సైతం” అంటూ ఇందరు మహిళలు చెమటలు కార్చడమూ,

- పైడిపాముల రాజేంద్ర స్వచ్ఛోద్యమ నినాదాలు చేయడమూ,

               మెడికల్ షాపు వెంకటేశ్వరరావు కార్యకర్తలకు బిస్కెట్లు పంచడమా 1 వ వార్డు ప్రక్కన శ్మశానం రోడ్డు పనులు ప్రారంభమైనందుకు డి.ఆర్.కె. గారూ, మాజీ సర్పంచి గారూ పరమానంద భరితులైపోవడమూ,

               చివరగా రేపటి శ్రమదానానికి SRYSP వద్దనే ఆగి రిజిస్ట్రార్ కార్యాలయం నుండి పనులు చేయాలనే నిర్ణయమూ......

               - ఇవన్నీ నాకైతే కనుల పండుగగానే ఉన్నవని మనవి!

               పిలుస్తోంది శ్రమ సంస్కృతి

సాగుతోంది స్వచ్ఛరధం చల్లపల్లి వీధులందు

చూపట్టెను హరితవనం చుట్టూ రహదారులందు

పిలుస్తోంది శ్రమ సంస్కృతి సమాజ స్పృహ కలవారిని

స్పందిస్తే గ్రామస్తులు చల్లపల్లి నందన మని!

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   09.09.2026