3952* వ రోజు.......

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు!

4000* -  48 రోజుల దిశగా చల్లపల్లి శ్రమ సంచలనం!

               ఆ 4000 రోజుల దగ్గర సదరు గ్రామ శ్రమదానం అగుతుందని కాదు, ఈ స్వచ్ఛ కర్మవీరులు అలసి, ఆగిపోతారనీ కాదు! అది కేవలం గ్రామస్తులకు లెక్కకోసమే!

               స్వచ్ఛ కార్యకర్తలు గనుక ప్రతిఫలమాసించే వాళ్ళైతే ఆ ఉద్యమం ఏనాడో అటకేక్కేది. ఊరి స్వస్తత పట్ల అంకితభావం ఏ కాస్త తగ్గినా – సక్రమ తాత్త్వికత ఏ కొంచెం లోపించినా – ఈ ఉద్యమం 12 ఏళ్లు నడిచేదే కాదు. ఊరిలో పెనుమార్పులు జరిగేవే కావు!

               ఉదాహరణకు ఈ 11-9-26 - శుక్రవారపు ముప్పై ఇద్దరి బందరు వీధి పారిశుద్ధ్యమే చూడండి! వాళ్ళని 4:00 కన్న ముందే ఎవరు మేల్కొలిపారు? ఈ మురుగు - దుమ్ము వీధి పనుల కోసం ఎవరు వాళ్లని కాళ్లూ గడ్డాలు పట్టుకొని బ్రతిమాలి, రిజిస్ట్రారు కార్యాలయపు గేటు వద్దకు రప్పించారు? ఇవి గ్రామ శ్రేయస్సు కోరి చేసే మురుగ్గుంటల పనులు వేఱు!

               మరి ఈ శుక్రవార శుభోదయాత్పూర్వము ఈ 32 మంది స్వచ్ఛ - సుందరీకరణ ప్రయత్నములెట్టివో చూద్దాం!

               వాళ్లు బాగు చేసిన వీధి 150 గజాల పైగా. ఐతే - నలుగురు మాత్రం నిన్న శుభ్రపడిన పానీపూరీ బండి ప్రాంతంలోనే శ్రమించారు. పండ్ల దుకాణం ప్రక్కన డ్రైనులోనూ, దానికి 2 ప్రక్కలా 10 మందికి పైగా  కష్టపడితేనే ఆ భాగం అంత చూడముచ్చటగా మారింది.

               గ్రామ మాజీ సర్పంచి గారితో సహా ఏడెనిమిది మంది చీపుళ్లందుకొని, దాదాపు కర్మల భవనం దాక రోడ్డు దుమ్ము దులిపారు.

               నలుగురు మాత్రం మూల్పూరి గార్డెన్ లో చొరబడి, నిన్న మిగిలిన పనుల్ని చక్కదిద్దారు.

               చివరకు కాంట్రాక్టరు వేణు గారు వచ్చి,

               లాబొరేటరీ రవీంద్ర కసి తీరా ఎలుగెత్తి చాటిన స్వచ్ఛ – సుందరోద్యమ నినాదాలను పొల్లుబోకుండ చాటగా –

               హిందూ శ్మశాన బజారును మొదట అనుకొన్నట్లు 135 మీటర్లుగా కాక - 170 మీటర్లు - అనగా బైపాసు వీధి దాక పొడిగిస్తున్నట్లూ, ఈరోజు గ్రావెల్ తెప్పిస్తున్నట్లూ ప్రకటించగా –

               రేపటి వేకువ పనుల కోసం అందరం మునసబు వీధి వద్ద కలవాలని నిర్ణయించగా....

               నేటి శ్రమదాన కథనం ముగిసింది!

               ప్రగతి  శీల తీర్ధయాత్ర!

ఒకటా – రెండా – మూడా? పన్నెండేళ్ల  శ్రమ జాతర

ముప్పై- నలభై –యాభై మంది శ్రమల కలబోతగ

కాలుష్యం పెనురక్కసి కోరలపై దండయాత్ర

పర్యావరణాను కుల ప్రగతి  శీల తీర్ధయాత్ర!

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   11.09.2026