3960* వ రోజు.....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు వాడడానికి సిగ్గు పడదాం!

బందరు వీధి ముఖ్య భాగమున – 19.09.26 న – 3960*వ  శ్రమల పండుగ!

               1) చిన్నా- చితకా, ఇంకా వివిధ వయస్సుల 46 మంది ఆ 200 గజాల రోడ్డులో – అనగా  కమ్యూనిస్టు వీధి మొదలు సంత బజారు దాక – రకరకాల శ్రమల చప్పుళ్లు వినిపిస్తుంటే,

               2)చేసేదేమో మురుగు – దుమ్ము పనులైనా, కొందరు  కూనిరాగాలతో, కొందరు చెతుర్లాడుకొంటూ, చిన్నారులు కేరింతలు కొడుతూ – ఇదేదో మహా పుణ్యకార్యమైనట్లూ, తిరునాళ్లయినట్లూ-

               ఎవరి వంతు శ్రమదానం వాళ్లు చేసుకుపోతూ ఉంటే-

               ఈ గంటా 45 నిముషాల( from 4:20 to 6:05) కష్టాన్ని “పండుగ” అని వర్ణిస్తే తప్పేమున్నది?

               ఇందులో కొందరి ముఖాల్లో అలసట కన్పించింది గాని, దక్షిణపు మురుగు కాల్వ పనుల వారి బట్టలకు బురద అంటితే అంటింది గాని, మెజారిటీ కార్యకర్తల బట్టలు చెమటలో నాని ఉంటే ఉన్నవి గాని,

               ఎవరి ముఖాల్లోనైనా అసంతృప్తి చాయలు కన్పించలేదే!

               “ఎందుకొచ్చిన తద్దినంరా ఇది - ఆ DRK డాక్టరు మనల్ని చివరికిట్లా తయారు చేశాడా”- అని ఒక్కరూ అనుకోలేదే! పైగా – ఇంకా ఊళ్లో ఎక్కడ అశుభ్రత మిగిలిఉన్నదీ, రేపు ఈ బందరు వీధి పరిశుభ్రత ఎంతవరకు చేయగలం...” లాంటి ఆలోచనలూ, మాటలే!

               అఫ్ కోర్స్ ! ఈ స్వచ్ఛ కార్యకర్తలు అలా అనుకొనే వాళ్ళే ఐతే స్వచ్ఛ సుందర చల్లపల్లి శ్రమదానోద్యమం 12 ఏళ్లు దిగ్విజయంగా సాగేదే కాదనుకోండీ!

               వేకువ 4:20 తొలి ఫోటోలో కాని, శ్రమదానంతో బాటు కబుర్లతో గాని ఈ వేకువ పద్మావతి ఆస్పత్రి సిబ్బంది హవానే ఎక్కువగా నడిచింది!

               నేనైతే ప్రత్యక్షంగా కార్యకర్తల ఉత్సాహాన్నీ, కష్టాన్నీ, పనుల నాణ్యతనూ పొగడలేదుగాని, లోలోపల ఆశ్చర్యపడుతూనే ఉన్నాను, “అసలీ పన్నెండేళ్ల గ్రామ సామాజిక సేవలెలా సాధ్యం?” అని అమాయకంగా ఆలోచిస్తూనే ఉన్నాను!

               ఒక శంకర శాస్త్రి గారు ఈ వేళ కూడా బిస్కట్లు పంపిణీ చేస్తుంటే, లక్ష్మీ సెల్వం గారు అంత గట్టిగా ఉద్యమ ప్రతిజ్ఞలు చేస్తుంటే-

               విన్న కోట వెంకేటేశ్వరరావు గారు ఆరోవిడత 50 రంగురంగుల గుడ్డ సంచులు పంచుతుంటే- అడపా గురవయ్యగారు శ్రీశైలం అడవుల సౌందర్యాన్ని వివరిస్తుంటే... ఇది మన గ్రామ శ్రమల పండుగే మరి!       

               రేపటి వేకువ వీధి పారిశుద్ధ్యం సంత వీధి వద్ద మొదలు కాగలదు!     

            ఈ పెద్దమనుషులు

“గడ్డిచెక్కుట, చెత్తలేరుట, డిప్ప నెత్తిన మోయుచుండుట

ఊరి వెలుపల బాట ప్రక్కల వృక్ష సంతతి వృద్ధి చేయుట

రోడ్ల ప్రక్క బరంతు వేసి, గుంట లెన్నో పూడ్చుచుండుట”

 దినదినము ఈ పెద్దమనుషులు చేయుచున్న సేవలివెనట!

ఇట్లు

-నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   19.09.2026