3961* వ రోజు.....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు వాడడానికి సిగ్గు పడదాం!

వాన తమాషాలు – శ్రమదాన స్ధల మార్పులు-@3961* (20-09-26)

                    గస్తీ గది వీధిలో నేమో వర్షం నిల్, సంత వీధి దగ్గరేమో ఫుల్! అందువలన అసలు పని వేళకు పావుగంట ముందే ఆ    జంక్షన్ కు చేరుకొన్న 15 మందీ చప్పున పని చోటును మార్చి, మళ్లీ స్మార్ట్ రిలయెన్స్ వద్దకు తిరిగి వచ్చి, భారత లక్ష్మి లేక మెహర్ వడ్ల మర వీధిలో నిర్వహించిన పారిశుద్ధ్య కార్యకలాపములిట్లున్నవి:

               -నేటి వాలంటీర్ల సంఖ్య 35.

               -పనుల ప్రారంభ, ముగింపులు 4:22- 6:03 AM.

               -డజను మంది- ఇద్దరు మహిళలతో సహా కత్తులు ఘుళిపించి , రిలయన్స్ ప్రక్కన గడ్డినీ, పిచ్చి మొక్కల్ని లొంగదీశారు. వాళ్లు వీధి పడమర ప్రక్కన బాట అందాలకు భంగకరంగా ఉన్న కొన్ని పెద్ద చెట్ల కొమ్మల పని పట్టారు కూడ- ఐతే దివంగత వాసిరెడ్డి వారు ఒంటి చేత్తో నిర్మించి, గ్రామస్తుల కు సమర్పించి వెళ్లిపోయిన ఉద్యానం  లోపలికి మాత్రం ఏ ఒక్క స్వచ్చ కార్యకర్త వెళ్ళలేదు! అక్కడ బహుశా రిలయెన్స్ దుకాణ ఉద్యోగులు విసిరిన ప్లాస్టిక్ ఛండాలాలు కనిపిస్తూనే ఉన్నవి!

               -నేటి శ్రమదాన యాత్ర భారత లక్ష్మి వడ్లమర ద్వారం వద్ద ఆగిపోయింది. అక్కడి నుండి పడమర వీధిలోని రకరకాల పిచ్చిచెట్ల మీదకు వారి దృష్టి మరలింది. మెండుశ్రీను, జాస్తి ప్రసాద, లక్ష్మణ , లక్ష్మణాది కార్యకర్తలా పనిలో నిమగ్నమయ్యారు గాని, అక్కడ నిలబెట్టి కడుగుతున్న చేపల బండి దుర్వాసన బెడత తప్పలేదు !

               -ఆకుల దుర్గాప్రసాదుని మర యంత్రం ఈ పూట మ్రోగలేదు.

               -5:40 కి కాబోలు – చెత్త లోగిండు  సదండి మొదలయింది. ప్రస్తుతానికి సగం ట్రాక్టరు నిండింది.

               -6:02 నిముషాల శ్రమ విరమణ సూచక విజిల్ మ్రోగింది. కొందరందుకు అభ్యంతరం చెప్పారు –“ఆదివారమే కదా! అందరం మరో 10 నిముషాలు శ్రమిస్తే –బంధన్ బ్యాంకు, అపార్ట్ మెంట్ల వరకూ శుభ్ర పడిపోయేది గదా!” అని!

               రిలయెన్స్ స్మార్ట్ ఎదుట జరిగిన తుది అంకంలో – రాయపాటి రాధా కృష్ణుల వారు కసిగా ఉద్యమ నినాదాలు ప్రకటించారు,

               లడక్ లో పర్యటిస్తున్న DRK గారు అక్కడి పరిశుభ్రతను గూర్చి చెప్పారు;

                4000* రోజుల  శ్రమ గురించిన మిగిలిన వారి అభిప్రాయ సేకరణకు నేను మరొక మారు విజ్ఞప్తి చేశాను!

               “ఈ వీధి శుభ్రతను సగాన ఎలా వదిలేస్తాం? సంత బజారు వద్ద కాక రేపటి వేకువ ఈ వడ్ల మర – బైపాసు వీధుల వద్దే మన శ్రమదానం” అనెడి సజ్జా ప్రసాదు గారి ఆలోచనను అందరు  సమర్ధించారు!

            మెంటల్ ఆస్పత్రిలోన

ఎందుకైన మంచిది - ఈ స్వచ్ఛ కార్యకర్తలను

మెంటల్ ఆస్పత్రిలోన చేర్చడమే మంచిదేమొ

అప్పుడైన ఊరి కొరకు త్యాగాలను కొంత మాని

అపనిందలు భరించడం అప్పుడు కాస్త తగ్గునేమొ!

ఇట్లు

-నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   20.09.2026