3962* వ రోజు.....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు వాడడానికి సిగ్గు పడదాం!

3962* వ వేకువ కూడ కొనసాగిన శ్రమత్యాగ సంస్కృతి!

               నిన్నటి వలెనే ఈ సోమవారము సైతం వాన స్వచ్ఛ కార్యకర్తల్ని బెదిరించాలని చూసింది.
               “శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు” అని మన పెద్దలు ఏనాడో సామెత (స+ఆమెత) చెప్పినట్లు – వాన బెదిరింపులప్పుడు తమ బాధ్యతలెలా పూర్తిచేసుకోవాలో కార్యకర్తలకు తెలియవా
? వాళ్లదేమైనా చిన్నా - చితకా అనుభవమా? 12 ఏళ్లగా రాటు తేలిన బుర్రలవి!

               అందుకే – సంత వీధి సెంటరు బదులు వాళ్లు 1 వ వార్డులో కృష్ణా కో-ఆపరేటివ్ బ్యాంకు వద్దకు 4.22 కు చేరుకొని,

1) వడ్లమర సమీప వీధిలోనూ,

2) దివంగత వా.కో. గారి ఉద్యానమందూ,

3) బైపాస్ వీధిలో మరికొంత భాగమునా

               కాలుష్యంపై కదనోత్సాహం చూపించారు! వాళ్ళకేం లోటు గనుక! కొందరి చేతుల్లో పదను కత్తులూ, కొందరివి గొర్రులూ, ఐదారుగురివి - ఆలస్యంగా వచ్చిన ఇద్దరు స్వచ్ఛ వైద్యులతో సహా -  చీపురులూ, ఇంకొందరివి డిప్పలూ!

               ఇక రైసుమిల్లు ముఖ్యద్వారం నుండి సాగర్ టాకీసు రోడ్డు దాకా, అశోక్ నగరు చివరి వీధి దాకా,

               వాసిరెడ్డి వారి బుల్లి ఉద్యానము లోపలా –

               కాలుష్యాలకు మరణశాసనం జరగక ఆగుతుందా

               కాకపోతే - పెద్ద కస్తూరి కార్యకర్త చేతికి బోగన్ విలియాముల్లు గీరుకుపోతేనూ, మరొకాయనకు బురదలో కాలు జారితేనూ, వయోధికుడైన శంకర శాస్త్రి గారి నడుం పట్టేస్తేనూ....

               అవేం పెద్ద వార్తలు కావనుకోండి! అలాంటి చిన్న సంగతుల్ని స్వచ్ఛ కార్యకర్తలేనాడు పట్టించుకొన్నారు? అందుకే - ఈ ఉదయం కూడ తొలగించిన వ్యర్ధాలతో ట్రాక్టరు నిండింది!

               ఆఫ్టరాల్ - నడుం పట్టేసిన నేనే చిన్న గోతం ప్లాస్టిక్ వస్తువుల్ని ఏరానంటే – నేటి 28 మంది స్వచ్ఛ వీరుల పారిశుద్ధ్య కృషి ఎలాంటిదో ఆలోచించండి!

               పద్మావతి మేడమ్ అంత విస్పష్టంగా మన ఉద్యమ నినాదాలను గర్జించడం సరే గాని - వారి 4 రోజుల హిమాలయ – లడక్- లేహ్ యాత్ర సరే గాని - హిమనగాల మీద అంత ఎత్తున సంచరించిన అనుభవమూ గట్టిదే గాని – “స్వర్గానికెళ్లినా చింతపులుసు జ్ఞాపకం వదలదా?” అన్నట్లు – ఆ భయంకర అనుభవంలోనూ స్వచ్ఛ చల్లపల్లి జ్ఞాపకాలు వాళ్లు వదలకపోవడమే విశేషం!

               రేపటి మన పని పాటులు రిలయన్స్ స్మార్ట్ ప్రక్క వీధిలోనే!

               నవ చరిత్రము - శ్రమ విచిత్రము

నలుబదేబది మంది యత్నము నవ చరిత్రము – శ్రమ విచిత్రము

పర్యావరణము భద్రపరిచే స్వచ్ఛ సుందరమైన యజ్ఞము

ఏకమాత్ర ప్రయోజకమగు ప్లాస్టిక్ వస్తుల పరిత్యాగము

ఎట్లు దీనిని నిర్వచించుట? ఎట్లు దీనిని నిర్వహించుట?

- నల్లూరి రామారావు

    రిటైర్డ్ ప్రిన్సిపాల్

    21.09.2026