3963* వ రోజు.....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు వాడడానికి సిగ్గు పడదాం!

సార్ధక శ్రమ వైభవానికి చిహ్నంగా 3963* వ (మంగళవారం) వీధి సేవలు!

               22.9.26 వేకువ సమయపు తలా 111 నిముషాల సదరు సేవకులు 28+2 మందైతే - ఇద్దరు వడ్లమర యజమాని, ఆ మిల్లు కార్మికుడున్నూ!

               రెక్కలు ముక్కలుగా వేల కొద్దీ రోజులు – లక్షల కొద్దీ గంటలు జన్మ స్థలమో లేక నివాస గ్రామం కోసమో పనిచేసుకుపోయే వాళ్ళదేముంది – 6 ఋతువులూ చేస్తూనే ఉన్నారు! సదరు శ్రమ ఫలితాన్ని అనుభవించే 28 వేల మందీ అనుభవిస్తూనే ఉన్నారు.

               ఐతే - అంతగా కష్టించే కార్యకర్తలకు తెలియదు - తమ చెమటధారల విలువ ఎంతటిదో; అనుభవించే వాళ్లకు మాత్రం గుర్తుంటున్నదా చల్లపల్లిలో ఇన్ని ఆహ్లాదాలు, ఇన్ని సౌకర్యాలు ఎంత శ్రమిస్తే, ఎంత వ్వయిస్తే దక్కుతున్నవో? అలాంటి స్పృహ ఏమాత్రం ఉన్నా ఇక్కడి అపార్ట్మెంట్ల వారు, గృహస్తులు కనీసం మాట వరసకైనా ఈ శ్రమదానంలో పాల్గొనకున్నా వచ్చి చూడనైనా చూసేవారు!

               అలాంటి అవకాశమో - అదృష్టమోగాని నాకు దక్కుతూనే ఉన్నది ప్రతి వేకువా! ఎలాగంటే - నేనక్కడ చేస్తున్న కష్టం తక్కువా, అన్ని చోట్లా పరిశీలన ఎక్కువా!

               ఈ నాటి బ్రహ్మకాలంలో ఐతే - అలాంటి 3 రకాల అదృష్టం పట్టింది నాకు!

1. కామినేని అపార్ట్మెంటు ఎదుటి 20 గజాల డ్రైనునూ, అందులో ఆ గృహస్తులు నింపిన డంపునూ 15 మంది కార్యకర్తలు గిలకల్లోతు మురుగు నీటిలో నిలిచి, ముళ్ల చెట్లు నరికి, డైపర్లతో సహా చేతులతో లాగి, ఎత్తి, ట్రాక్టర్ లో నింపటం కళ్లారా చూశాను! ఆ 15 మందితో బాటు ఆ దుర్గంధాన్ని నేనూ పీల్చాను!

2. వడ్లమర గేటు ఎదుటా, పడమటి వైపునా చెట్ల కొమ్మలు నరికి, డ్రైను వ్యర్థ్యాల్ని తొలగించిన ఆరేడుగురిదీ ఆ రకమైన శ్రమే!

3. రిలయన్స్ దుకాణానికీ, చెరువుకూ నడుమ ఇలాంటి ఒక పిచ్చి పంతులు గారే - (అంటే వాసిరెడ్డి మాస్టారే) నెల రోజులు శ్రమించి, పెంచిన ఉద్యాన సౌందర్య పునరుద్ధరణకు దిగిన 5 గురి కష్టమైతే చెప్పనలవి కాదు.

               వాళ్ళు పని మొదలుపెట్టినపుడిది అరణ్య సౌందర్యం; 6.00 తర్వాత అక్కడ కనిపించినదొక ఉద్యాన సౌందర్యం!

               పనిలో లీనమైపోయిన ఈ వ్యసనపరులు మిగిలిన కార్యకర్తలం పిలవగా పిలవగా 6.10 కి గాని పని విరమించలేదు!

               ఇలాంటి దృశ్యాలు నాకు సినిమాల్లో కనిపిస్తాయా? అబ్బే – అవి కేవలం కల్పితాలు! T.V. సీరియళ్లైనా అంతే!

               వడ్లమర ఆవరణలో 6.20 కి సమీక్షా సభను నినాదాలతో ప్రారంభించినదీ, అందరికీ స్వహస్తాలతో బిస్కట్లూ, కేకులూ పంచినదీ, ఉద్యమ ఖర్చులకు 1000/- సమర్పించినదీ కాకరపర్తి సురేశ్ గారు;

               నేటి శ్రమానందాన్ని అనుభవించి, పలవరించినది DRK గారు కాక మరెవరు?

               రేపు కూడ మన సత్కర్మ భూమి ఈ భారతలక్షి వడ్లమిల్లు ప్రాంతమే!

                ప్రతి బాధ్యత విశిష్టమే!

వీధి ఊడ్పు కావచ్చును-డ్రైను పనులె కావచ్చును

ఊరైనా- వెలుపలి రహదారైనా - స్వచ్ఛ కార్య

 కర్తల బ్రహ్మముహూర్తపు కష్టమందు వైవిధ్యమె -

 ప్రతి దినమూ ప్రత్యేకమె- ప్రతి బాధ్యత విశిష్టమే!

- నల్లూరి రామారావు

    రిటైర్డ్ ప్రిన్సిపాల్

    22.09.2026