3971* వ రోజు.....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు వాడుతున్నందుకు సిగ్గు పడదాం!

ఫస్టోబరు - గురువారం - 2026 నాటి వీధి శ్రమ సంఖ్య 3971* వది!

               చాల మంది దుకాణదారులూ, ప్రజలూ చాతనైనంత సహకరిస్తున్నా, ఇంకా కొద్ది మందికి ఇప్పటికీ దయరాకున్నా - ముసురులు వచ్చినా – ఎల్ నినోలు దెబ్బకొట్టినా ..... ఈ సహన శీల కార్యకర్తల శ్రమ ఆగనిదే!

               అది ఆగాలంటే ఉన్న ఒకే ఒక మార్గం – ప్రతి వార్డులోని ప్రజలూ అలవోకగా, స్టైల్ గా వీధుల్ని, మురుగు కాల్వల్నీ చెత్తలు విరజిమ్మే - సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లు విసరే - ఫ్లెక్సీలతో బజార్లను నింపే చర్యలు నిలిచిపోవలసిందే!

               మొన్న ఒక సందర్భంలో శంకర శాస్త్రి గారిని నేను జగమొండిఘటం అని నిందా స్తుతి చేసినట్లే – ఈ శ్రమదానోద్యమ శ్రేయోభిలాషులు కొందరు ఐదు లక్షల పనిగంటల శ్రమవీరులైన స్వచ్ఛ కార్యకర్తలను

               “ఎంత మొండి వాళ్లు కాకపోతే – 3970* రోజుల్నుండీ వీళ్ళు రహదార్ల ఉచ్చ మడుగుల్నీ, ఉమ్ముల్నీ, డ్రైన్ల ఛండాలాన్నీ బాగుచేస్తారు?” అని ఓ రకంగా - వాళ్లకు తోచినట్లు మెచ్చుకొన్నారు!

               ఐతే ఇప్పుడు తేలవలసిన లేక్కేమిటంటే – “12 ఏళ్ల స్వచ్ఛ సుందరోద్యమం తర్వాత కూడ అస్సలు మారని వాళ్ళా, సగం మారిన గ్రామస్తులా - లేక అలుపూ సొలుపూ లేక ఏదో ఒక ఊరి భాగాన్ని ప్రతి రోజూ శుభ్రపరచడం మానని స్వచ్ఛ వాలంటీర్లా - ఎవరిది అసలైన మొండితనం?” అనేదే!

               ఈ వేకువ 4.21 నుండి 6.05 దాక అటు మళ్లీ పెట్రోలు బంకు మొదలూ ఇటు మరొక వాహన ఇంధన నిలయం దాక

- నికరంగా 31 మంది రకరకాల బజారు కాలుష్యాల పనిపట్టుతూ

- దుమ్ములో మునిగి తేలుతూ

- ఆడా/ మగా భేదాలు మరచి

- డిప్పలు మోస్తూ

- ఇసుకా+దుమ్మూ ట్రాక్టర్లోకి ఎగుమతి చేస్తూ - దానిని కాసానగర గ్రామం తటాకపు గట్టుగా మలుస్తూ

- చెమటలు క్రక్కే సమయాన – నేను కూడ ఏదోలా నా నడుముకు నచ్చ చెప్పి, బ్రతిమాలి వంచి పావు గంటపాటు పని చేసి, కాస్తంత చెమట కారుస్తున్న (షరా! కార్యకర్తలది నిజమైన చెమటైతే - నాది నకిలీ -కల్తీ చెమట. అంటే “ఎల్ నినో చెమట అని గ్రహించమనవి!) సమయాన జరిగిందొక చిత్ర సంఘటన!

               అతనిది నారాయణరావు నగరట! నా పూర్వా శ్రమంలో శిష్యుడట! కాని - అమాయకత్వంలో నన్ను  మించిపోయి నాకు గురువుగా కనిపించాడు –

               “సార్! తక్కిన 30-40 మంది కార్యకర్తలకి సంపాదన అవసరమేమో కాని, మీకు అంత పెన్షన్ వస్తుండగా - ఈ వయసులో ఇలాంటి పనులెందుకు చెప్పండి!” అనేశాడు!

               నేను కాస్త స్తిమిత ప్రజ్ఞుడిని కాబట్టి గాని - లేకపోతే అదెందటి దిమ్మ తిరిగే ప్రశ్నో గమనించండి! (అతని పేరెందుకులే - వెల్లడించడం భావ్యం కాదు!)

               సరే! నేను నిన్న ఛాలెంజి చేశాను గుర్తుందా? ఆ 79 ఏళ్ల పెద్దమనిషి వచ్చి - ఫొటోలు తీసి - నన్ను గెలిపించాడు సుమా! బస్ హారన్ అంత చక్కగా తోట నాగేశ్వరుల వారు నినాదాలు పలకగా, DRK గారి సరస సమీక్ష ముగియగా,

               రేపటి శ్రమదానం కూడ ఈ నాగాయలంక రోడ్డులోనే అనే నిర్ణయంతో –

               నేటి గ్రామ వీధుల పారిశుద్ధ్య కృషి ముగిసింది!

               అశోక చక్రవర్తి మొదలు

అశోక చక్రవర్తి మొదలు స్వచ్ఛ కార్యకర్త దాక

ప్రజలకు సౌకర్యముగా పచ్చని చెట్లను పెంచుట

చూస్తున్నాం – ఇపుడు క్రొత్తగ చల్లపల్లిలో మాత్రమె

పండ్ల – పూల మొక్కలను ధ్వంసించుట చూస్తున్నాం!

- నల్లూరి రామారావు

    రిటైర్డ్ ప్రిన్సిపాల్

    01.10.2026