పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడుతున్నందుకు సిగ్గుపడదాం!
చిత్తగించండి - అక్టోబరు 8 – గురువారము నాటి బెజవాడ వీధి శ్రమను! @3978*
వేకువ 4:20-6.02 వేళకు చెందిన సదరు శ్రమ 29 మంది కార్యకర్తలది!
వరుసగా 3 రోజులు కష్టించినా - దండమూడి కసూరమ్మ గార్డెన్ దాటి 10-15 గజాలు మాత్రమే పూర్తైనది!
“ప్రధాన వీధియగు బెజవాడ రోడ్డును బాగుచేద్దాం - లోపలి సందుల్ని ప్రస్తుతానికి వదిలేద్దాం”- అనే తమ నిర్ణయాన్ని ప్రక్కన పెట్టి, బ్రాహ్మణ కర్మల భవనము ప్రక్కనే గాక - చెరువు అంచు దాకానూ,
అగ్రహారము తొలి వీధియగు పంచాయతి ఆఫీసు బజారునూ పట్టిపట్టి – పరిశుభ్ర సుందరీకరించిన స్వయం నియమ ఉల్లంఘనమది!
నిన్న బాగా శుభ్రపడిన శ్రీమంతు క్లబ్బు ప్రహరీ వెలుపల మళ్లీ ఈ పూట 5 గురు తమకు నచ్చినట్లు పునః సుందరీకరించిన ఘట్టమది!
“ఏమిటది? 19 మంది గంటకు పైగా ఆ 3-4 సెంట్ల జాగాలోనే ఏమేం చేస్తున్నారు? వ్యర్ధాలను ట్రాక్టర్ లోకెక్కించడంలో అంత ఆలస్యమేమిటి?...” అని వెళ్లి చూద్దును గదా – ఆ పని చోటు నుండీ, ట్రాక్టర్ నుండి దుర్గంథం గుప్పుమని ముక్కులదరగొట్టుతున్న సన్నివేశమది!
“ఏమయ్యా!! నిన్నా మొన్నా బాగుచేస్తిరి గదా – ఈపూట కూడ ఆ దుర్వాసన పీల్చాలని అంత కోరికా?” అని ప్రశ్నిస్తే –
“అదేమిటి - అలా అడుగుతారు? ఈ మురికీ, చెత్తా, కడుపులో దేవే కంపులూ మనకేమన్నా క్రొత్తా? కంపులో-ఇంపులో-చేస్తున్న పని నాపి రమ్మంటారా?” అని ఎదురు ప్రశ్నలు వినిపించిన సందర్భమది!
నిజమే – నూరు శాతం సంతృప్తి చెందనిదే – పని సగాన ఆపి బైటకు రారని తెలుసు. ముఖాలూ, బట్టలూ దుమ్ముతో చెమటతో నిండిపోతున్నా పట్టించుకోరనీ తెలుసు - అసలా కార్యకర్తల నుండి ఇలాంటి జవాబే వస్తుందని కూడా నాకు తెలుసు! అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా?
ఏదో - ఒక నిముషమైనా వాళ్ల దృష్టి మరలాలనే తప్ప!
ఇందుకేనేమో - శంకరశాస్త్రి గారు ఇష్టపడిన వాళ్లకొక్కొక్క కప్పుడు టీ త్రాగించారు!
నేటి తుది సభను తూములూరి లక్ష్మణ సోదర కార్యకర్త తన నినాదాలతో ప్రారంభించే ముందుగా - మళ్లీ శాస్త్రుల వారే తెచ్చిన బిస్కట్లను పంచుటలో కాస్త తిరకాసు వచ్చి, కొందరు అవి అందుకొనలేనందున - ఈ శాస్త్రీజీ ఐదారుగురికి బాకీ పడినట్లే మరి!
వారాలూ – వ్యర్ధాలూ చూసుకొని అంబటి శంకర - కోడూరి వెంకటేశ్వరులు చెరొక 520/- ట్రస్టు ఖర్చులకు సమర్పించుకొనిరి!
అమెరికా ప్రవాసి అయిన ఆడిటర్ మాలెంపాటి నరసయ్య గారు నిమ్మగడ్డలోని తమ తండ్రి సీతారామయ్య గారి కుటుంబం పేరిట ‘మనకోసం మనం’ ట్రస్టుకు పంపిన 10 వేల రూపాయలకు ధన్యవాదములు!
రేపటి వేకువ కూడ ఇదే శ్రీమంతుల క్లబ్బు వద్దేనే కలసుకోవాలట!
పెను ప్రమాదం దాటినట్లే
ప్రజాహ్లాదం మొదటి ఫలితం, ప్రజల స్వస్తత ద్వితీయం
దోమలీగలు తరిగిపోతూ – ప్రాణవాయువు పచ్చదనమూ
పెరిగిపోతే ప్రజారోగ్యం పెను ప్రమాదం దాటినట్లే
అందుకే ఈ స్వచ్ఛ రథమును అనుసరింపుము నేస్తమా!
-నల్లూరి రామారావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
08.10.2026