పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడుతున్నందుకు సిగ్గుపడదాం!
ఇవిగో - శుక్రవారం(9-10-26) నాటి శ్రమ విధానములు!- @3979*
ఆ 28 మంది (అనగా 28 వేల మంది జనాభాలో సరిగ్గా వెయ్యికొకరు చొప్పున!) శ్రమలకేం భాగ్యంలెండి - వేకువ 4.20 కే శ్రీమంతులక్లబ్బు వద్ద మొదలయ్యాయి! 6.05 నిముషాల దాక కొనసాగాయి! సుమారు ఈ 200 గజాల బెజవాడ వీధిలోనే గత 3 రోజుల శ్రమలు జాలువారుతూనే ఉన్నాయి!
చూడగా - చూడగా ఇదొక అనారోగ్యమైన తమాషా పోటీయేమో అనిపిస్తున్నది! ఈ టగ్గఫ్ వార్ లో ఒక ప్రక్కన అత్యల్ప సంఖ్యాకులైన – ఒకరకంగా అమాయక చక్రవర్తులైన స్వచ్ఛ సుందర కార్యకర్తలు, మరొక ప్రక్క వీధి శుభ్ర- సౌందర్య వినాశకులైన – గడుసు వాళ్లైన గ్రామస్తులు! ప్రస్తుతానికైతే - విజేతలెవ్వరో తేలడం లేదు గాని....
ఒక్క విషయం ఆలోచించండి! ఈ మురుగు పనులకు - బురద దుమ్ము వీధి సేవలకు పూనుకొన్నారంటేనే ఈ స్వచ్ఛ కార్యకర్తలు తమ హోదాలను వదలుకొని - ఆవేశకావేశాలను తగ్గించుకొని ఊరి పనులకు దిగారని అర్ధం! అలాంటిది - ఒక శాంత స్వభావుడైన - తొలినాళ్ల తూములూరి కార్యకర్త - వరుసగా 3 వ నాడు కూడా తాము శుభ్రపరుస్తూనే ఉన్న గాయత్రి కర్మల భవనం ప్రక్కన మళ్ళీ మళ్ళీ కంపు వ్యర్థాలను చిమ్మిన దృశ్యం చూసి - థూ! అని ఉమ్మేసి -
“ఇకఈ ఊరిని బాగుచేయడం ఎవరివల్లా కాదు” అని విరక్తి చెందడం ఆశ్చర్యమనిపించింది!
“అలుగుటయే ఎరుంగని మహామహితాత్ము డజాత శత్రుడే
అలిగిననాడు సాగరములన్నియు ఏకము కాకపోవునే.....” అని కృష్ణ పరమాత్మ చేత తిరుపతి వెంకట కవులు (పాండవ ఉద్యోగ విజయం నాటకంలో) పలికించిన పద్యం గుర్తుకొచ్చింది! సరే - ఇటువంటివి దైనందిన శ్రమదానంలో క్షణికాలేననుకోండి!
మళ్లీ అదే తూములూరితో సహా కస్తూరి సోదరులూ +7 గురూ అరబండి దుమ్మూ ఇసుకల్ని ఊడ్చి, ట్రాక్టర్లోకెత్తడం చూశాను;
అంబటి శంకర, వెంకటేశ్వర, సజ్జా, నందేటి వాళ్లు - మైకు పాటలు కాక - విడిగా సరదా పాటలు పాడుతూ, దుర్గంధాన్ని ఆస్వాదిస్తూ బండెడు వ్యర్ధాల్ని ప్రోగేయడమూ చూశాను.
5:50 సమయంలో గాని పంచాయతి ట్రాక్టర్ లోకి ఆ కార్మికులు ఆ చెత్తనెత్తడమూ కనిపించింది!
ఆ చోటికి దూరంగా – నీళ్ల మడుగు దగ్గర్లో మల్లంపాటి, జాస్తి, అడపా, వేముల తదితరులు శ్రమించడమా కనిపెట్టాను!
అగ్రహారం 3 వ లైనులోకి వద్దని వారిస్తున్నా వినక మెండు శ్రీను వెళ్ళి గడ్డీ, పిచ్చి చెట్లను సంహరిస్తుండగా అడిగాను! చివరగా
1) నేను ములగ కాయలనూ,
2) శాస్త్రి గారు బిస్కెట్లనూ,
3) వీరసింహుల వారు పొట్టి పొట్లకాయల్నీ పంచాక - దుస్తుల తయారీ నిపుణుడు వెంకటేశ్వరరావు నినాదాలు పలికాక-
రేపటి శ్రమదానం కూడ బెజవాడ వీధిలోనే అని అందరం నిర్ణయించాం.
సహకరించుము నేస్తమా!
గతంలో ఈ స్వచ్ఛ - సుందర ఉద్యమం ఏ నాడు జరగని
సంగతిని గుర్తుంచుకొని, మన సమస్యలనూ తెలుసుకొని ఈ
శ్రమోద్యమముతో చల్లపల్లిని సంస్కరించుట అవశ్వంబని
శుభ్ర సుందర రథం యాత్రకు సహకరించుము నేస్తమా!
-నల్లూరి రామారావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
09.10.2026