3983 వ రోజు.....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడే వాళ్ళందరం సిగ్గుపడదాం!

3983* వ శ్రమదానం “ఎక్కడ - ఎందుకు - ఎలా...” అనేవి తెలుసుకుందాం! రండి

               ఈ వేకువ (మంగళవారం – 13 వ అక్టోబరు - 26)- అది శ్రమ‘దానమే’ ఐతే – దానం చేసిన వాళ్ళూ, గ్రామం పట్ల బాధ్యతే ఐతే - చక్కగా నెరవేర్చుకొన్న వాళ్ళూ గ్రామం నుండి కేవలం 29+2 మందే!

               ఇక - అది తమ వార్డూ, ఊరూ కాదు - కొందరికి 4-5 కిలోమీటర్ల దూరాన - చిల్లలవాగు ఒడ్డున -ఊరి పొలిమేర దగ్గరి శ్మశానం - ఎప్పుడు నిద్ర లేచారో గాని – 4:19 వేళకే హాజరైన మొదటి బ్యాచ్చి 15 మంది!

               పనిచోటు కూడ మండల అభివృద్ధి రెవిన్యూ కార్యాలయం బదులు హఠాత్తుగా మారింది. అందుక్కారణం ఈ సాయంత్రం 3.00 కు 'స్వచ్చాంధ్ర' సంబంధీకులైన “కొణిదల నాగేంద్ర బాబు" అనే అధికారి గ్రామ సందర్శనకు రావడమూ, ఆ సందర్భంగా శ్మశానంలో కొన్ని పనులు మిగిలిపోవడమూ!

               అసలు కారణం కూడా ఒకటున్నదట - ఈ DRK డాక్టరుకూ, కొందరు కార్యకర్తలకూ ఒక అత్యాశ కలిగిందట - భవిష్యత్తులో ఈ చల్లపల్లి జనాభా 50 వేలకు పెరిగి, చుట్టూ గ్రామాలతో కలుపుకొని లక్షల్లోకి మారితే - ఎవరైనా స్వర్గం దారి పట్టి, అమెరికా - ఆస్ట్రేలియాల నుండి వాళ్ల పిల్లలు వచ్చేందుకు 2-3 రోజులు పట్టితే - కళేబరాలు చెడకుండా భద్రపరచగల ఒక శవాగారం (మార్చురీ) ఉండాలి కదా! అది నిర్మించే చోటును మధ్యాహ్నం వచ్చే అధికారికి చూపి, సుమారు 40 లక్షల ఖర్చుతో దాతలు ముందుకొస్తే - నిర్మించే సుదూరాలోచన!

               మరి శ్రమదానమెలా జరిగింది? అంటే - అది సగం పూటకే 500/- లేక 1000/- తీసుకొన్న కూలీల మ్రొక్కుబడిగా జరగదు - మనసుపెట్టి, శ్రద్ధ చూపి, ప్రజల కోసం చేసే పూజలాగా - యజ్ఞం లాగానే జరిగింది! అందుకొక ఋజువు కావాలంటే:

               పార పలుగు – నక్కు - పంజాలతో చెమట క్రక్కుతూ పని చేసేవాళ్లు గాని –

               ముళ్ళు గీరుకుపోయినా పట్టిచుకోక ముళ్ళ మండల్ని ట్రాక్టర్ లోకి లోడు చేసిన వాళ్లు గాని – అటూ ఇటూ కాళ్లు బెసుకుతున్న గడ్డల్లో గంటకు పైగా చదును చేసిన వాళ్లు గాని కత్తులతో పిచ్చి మొక్కల్ని సమూలంగా పెకలించిన 7-8 మంది గాని –

               అలసిపోతే పోయారేమో గాని, పని ముగిసినప్పుడెవరైనా –

               “ఛ - నడుం నొప్పి పెట్టింది – చొక్కా దుమ్ముకొట్టుకుపొయింది - రేపటి నుండి ఈ శ్రమదానం మానేస్తాను...” అని ఆలోచించకపోగా – “రేపెక్కడ పనిచేద్దాం” అని చర్చించుకోవడమే!

               కర్షక కార్యకర్త సజ్జా ప్రసాదు గారి నినాదాలతో మొదలైన సభలో మాత్రం? ఆ డి.ఆర్.కె. డాక్టరు గారు ఆలోచించేది – “నా జ్వరం, వళ్ళు నొప్పులు ఎప్పుడు తగ్గుతాయో అని కాదు – మార్చురీ నిర్మాణ 40 లక్షలు ఎప్పటికి సమకూరుతాయో గదా” అనే!

               రేపటి వేకువ మాత్రం MDO ఆఫీసు దగ్గర మనం కలుద్దాం.

               అంకితం తెలుసుకో నేస్తం!

“స్వామి కార్యం - స్వకార్యం” అను సామెతే గుర్తుకొస్తున్నది

జనహితంగా స్వచ్ఛ సేవలు - స్వ స్వస్తతకై దైహిక శ్రమ

ఉభయ తారకమైన మార్గం స్వచ్ఛ సేవలకు పరమార్థం

స్వచ్ఛ సుందర రథం దానికి అంకితం తెలుసుకో నేస్తం!

-నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   13.10.2026