3986 వ రోజు.....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలంటారా?

3986* వ విడత సేవలు సైతంNTR పార్క్ & బంకు ప్రాంతానికి సమర్పితం! (16.10.2026 – శుక్రవారం)

               ఆ బాధ్యతలనేవి 15+11+1 = 27 మందివి! (15 గురు @4.19, 11 గురు @around 4:30 సమయాల్లో మొదలైనవి! చివరి ఒక్కరూ NTR పార్కు ద్వార పాలకుడు)

               పనుల ముగింపులో మాత్రం సమయోల్లంఘనం జరిగిపోయింది!

               6.05 కు శ్రమదాన ముగింపు సూచక విజిల్ ధ్వని వినిన తక్కిన 20 మంది మాత్రం బుద్ధిగా పనుల్ని రేపటికి వాయిదా వేసి, చేతులూ ముఖాలూ శుభ్రపరచుకొన్నారు గాని – 7 గురు మాత్రం 6.19 దాక బంకు వద్ద అడవిలాగా పెరిగిన బోగన్ విలియా, తదితర వృక్షాల ఖండన, అచటి టాన్స్ఫార్మర్ మూలంగా ఆలస్యమై, ఏమైనా సరే పనిని ఈ పూటే ముగించాలనే పంతం పట్టారు!

               అప్పుడప్పుడూ రైతులూ, గృహిణులూ వాళ్ళ సొంత పనుల పూర్తిలో ఇలా ఆకలిదప్పుల్ని కూడ అశ్రద్ధ చేయడం జరుగుతుంది. ఐతే - అది సొంతానికీ ఇది ఊరి ప్రయోజనం కోసమూ!

               అసలిదంతా సామూహిక శ్రమ పద్ధతి వల్ల వచ్చింది లెండి! గుంపుగా కాక – విడివిడిగా ఇలాంటి గ్రామ సేవల్ని చేయమనండి చూద్దాం!

               “ఇంతాజేసి ఆయిల్ బంకు ఆవరణలోని ఆ కాలుష్యకాసారం ఒకటిన్నర సెంట్లన్నా ఉండదు! గంటన్నరపాటు అక్కడ ఇందరేం చేసినట్లు?” అనే సందేహానికి సమాధానంగా –

1) గోతామున్నర్ర సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లు,

2) ట్రాక్టర్ లో పట్టక మిగిలిపోయేంత ముళ్ల కొమ్మల వ్యర్థాలు,

3) గాజు పెంకులు, రకరకాల మద్యం బాటిళ్లు, పుల్లలూ నిలుస్తాయి!

4) దానికి కాస్త ఎడంగా బంకు ఆవరణలోనే - అక్కడ పేవర్ టైల్సు ఉన్నాయని గుర్తుపట్టనంతగా 2 అంగుళాల మందాన పేరుకుపోయిన మట్టి!

               పారలు, రైల్వే పారలు, గోకుడుపారలు, చీపుళ్లూ ధరించిన డజను మంది సీసాల కొద్దీ నీళ్లు త్రాగుతూ - చెమటలు క్రక్కుతూ చేస్తున్న శ్రమా, వాళ్ళ శ్రమతో గాని ‘మేమున్నాం’ అని ఉనికి చాటుకొన్న రంగు రాళ్లూ....

- ఇవన్నీ చూస్తూనే ఉన్నాను! బంకులో కాక –

               మిగిలిన 7-8 మందో? వాళ్లు సైలెంటుగా బెజవాడ రోడ్డుకు రెండు ప్రక్కలా డ్రైన్లలో, గడ్డీ పిచ్చి కంపల అంతు చూస్తున్నారు! వచ్చే వ్యర్ధాలను మహిళామణులు ఊడ్చి ప్రోగులు పెట్టుతున్నారు!

               2 గంటల శ్రమదానం ముగిసినా లోడింగు మాత్రం పూర్తికాలేదు!

               ఆ విధంగా - పై కారణాల వల్ల - జాస్తి ప్రసాదు గారి నినాదాలతో మొదలు కావలసిన తుది సభ ఆలస్యమయింది! అంజయ్య, బృందావన, కస్తూరి శ్రీనయ్యలు కార్చిన చెమట పరిమాణాన్ని DRK గారు అంచనా కట్టే ప్రయత్నం చేశారు! (ఈ చివరాయన - శ్రీనయ్య కుడి చేతికి ముళ్ళు గీరుకుని నెత్తురొస్తుంటే నేను చూసి అడిగితే “అదేముంది లే సార్! అప్పుడప్పుడు ఇలాంటి చిన్న గాయాలు కావడమూ మర్నాటికి అవే తగ్గిపోవడమూ! అంతేగా” అన్నాడు)

               రేపటి శ్రమదానం NTR PARK – బంకు ప్రాంతమందేనని కూడ వారే సెలవిచ్చారు!

               అర్ధము – పరమార్థమేమిటో

ఎవరి మంచికి సుదీర్ఘంగా ఇంత కష్టం జరుగు తున్నదొ

ఐదు లక్షల గంటల శ్రమకర్ధమూ – పరమార్థమేమిటొ

చర్చచేయుము ఇప్పుడైనా, శ్రమోద్యమమున చేరి చూడుము

స్వచ్ఛ సుందర రథం యాత్రకు సహకరించుము నేస్తమా!

-నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   16.10.2026