పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలంటారా?
ఊరి పనిమంతుల సంఖ్యలో పొదుపు పాటింపబడిన సోమవారం! 3989*
అందుకు కారణం దుర్గా నవమి వేళా విశేషం కావచ్చు, ప్రాతూరి శాస్త్రీజీ లాగా ఊరి ప్రయాణాలూ కావచ్చు. ఈ 19.10.26 న వాళ్ల సంఖ్య బక్క చిక్కి 25 కు పరిమితమయింది.
ఐతే - ఈ ఉచిత శ్రామికుల సంఖ్యలూ, జరిగిన పని పరిమాణాలూ, అంచనాలూ, గణనలూ నావి మాత్రమే! నిత్య గ్రామ సేవా దురంధరులైన - వీధి సేవాపరాయణులకివేం పట్టవు - ఇంత పెద్ద గ్రామంలో ఇన్ని సువిశాల వీధులుండగా - రోడ్ల సమస్యలుండగా - ఈ లెక్కలూ డొక్కలూ వాళ్లు పట్టించుకోరు!
రోజుటి వలెనే 4.20 కే నేమో - కొందరు బెజవాడ దారి ప్రక్కన గల చండ్ర వారి వికాస కేంద్రం వద్దకు వచ్చారు, మరికాస్త సమయం తీసుకొని మిగిలిన వాళ్ళు రావడమూ, అవసరాన్ని బట్టి ఆయుధాలు ధరించడమూ, ఆ ప్రధాన వీధి అవకతవకలు సరిదిద్దే చర్యలు చేపట్టడమూ!
ఇండియన్ ఆయిల్ బంకు ఆవరణను తీర్చిదిద్దే పనులను ఆ ఆరేడుగురు ఈ పూట కూడ వదలి పెట్టలేదు.
ఊడ్పుల కార్యకర్తలూ అంతే - ఈ మార్గం తమకు నచ్చినంత శుభ్రంగా ఉందా - లేదా అని తప్ప – “అయ్యో! ఇప్పటికే నిన్న ఊడ్చిన దానితో సహా ఇంత దూరం ఊడ్చామే! చేతులు నొప్పిపెటుతున్నాయే! నిత్యం తాము వాడుకొనే ఈ వీధిలో ఇన్ని వ్యర్ధాలు వేసేందుకు ఈ చుట్టుపట్ల ఇళ్ల వారికి చేతులెలా వచ్చాయో... అని ఆలోచించలేదు!
“ఇప్పుడు కాకపోతే - మరో 2 ఏళ్లకైనా వాళ్లు తప్పక మారుతారు, మన శ్రమదానమేదో మనం చేసుకుపోదాం” అనేదే వాళ్ళ ధోరణి!
“ఈ డ్రైన్ల మురుగు మనం కూడ పట్టించుకొనకపోతే – ఈగలూ, దోమలూ మరింతగా రెచ్చిపోతాయమో! మన సోషల్ డ్యూటీ మనం చేసేస్తే పోలా!” అని మరికొందరి ఆలోచన!
“అరె! గ్రామ మెయిన్ సెంటరు నుండి తరిగోపుల ప్రాంగణం దాక ఇంత రద్దీ – రోడ్డు మీద ఇన్ని గుంటలు పడి, ఎవరూ పట్టించుకోకుంటే - వాహనాలు చెడిపోవా - ప్రమాదాలు జరగవా - మనం కూడ చూస్తూ ఊరుకొంటే ఎలా?” అని కొందరి దిగులు!
మరి ఈ స్వచ్ఛ కార్యకర్తలు వీధి దుమ్ములూడ్చక - గడ్డిని తరగక – పిచ్చి చెట్లను నరకక – అదుపు తప్పుతున్న చెట్లను సుందరీకరింపక – వ్యర్ధాల్నీ- ఇసుకను అవసరమైన చోట్లకు తీసుకుపోయి ఉపయోగించక - ఇళ్లలో చేతులు ముడుచుక్కూర్చొంటారా?”
వికాస కేంద్రం ఆవరణలో 6.20 వేళ - విన్నకోట వెంకటేశ్వరరావు ననుసరించి, అందరూ చేసిన ప్రతిజ్ఞల కర్ధం అదే గదా!
రేపు వేకువ ఇదే చండ్ర వారి కేంద్రం వద్దనే కలిసి, మిగిలిన వీధి పనుల్ని చేసుకోవాలని వాళ్ల సంకల్పం!
అబ్బే - కీర్తి కండూతి
“మహాత్కృష్ట సేవ” లనుచు మేధావులు కీర్తిస్తే
“అబ్బే - కీర్తి కండూతని” కొద్ది మంది చప్పరిస్తె
పుష్కర కాలము నుండీ పూర్తిగ చూస్తున్న నేను
పొగడడమా - తెగడడమా? ఏమిటి నా కర్తవ్యమ్?
-నల్లూరి రామారావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
19.10.2026