3991* వ రోజు.....

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలంటారా?

4000 కు 9 రోజుల చేరువగా బుధవారం (21-10-26) నాటి శ్రమదానం !

               అదైతే 6 వ నంబరు కాల్వ ప్రాంతంలో వేకువ 4.19 కే -  12 మందితో మొదలయింది గాని - ఎప్పటిలా 6:00 కు మ్రోగాలిసిన DRK గారి విజిలు మ్రోగలేదు. 6:06కు విజిలు శబ్దమూ, 6.14 కు సగం మంది పని విరమణమూ జరిగినవి! ఈ ఆలస్యాలకు ప్రధాన కారణం లోడింగు బృందమట! చూడండి - ఇంతోటి చెత్త - బురద – ముళ్ల – డ్రైనుల ఉచిత గ్రామ సేవలకు విజిలు ఆలస్యంగా వేయాలనే అభ్యర్ధనమొకటి!

               ఈ నాటి నికర వీధి శ్రామికులు 30 మందే గాని - చివరి సమావేశం వద్ద మాత్రం ఇద్దరు NTR పార్కు నడక వారూ, ఇద్దరు ట్రస్టు కార్మికులూ తోడై మొత్తం 34 గా కానిపించింది!

               జరిగిన పనుల వివరాల్లోకి వెళితే:

A. మౌన వ్రతధారి గాంధీజీ స్మృతి వనంలో ఒక పోస్టల్ ఉద్యోగి కూడ మౌనంగానే పేవర్ టైల్స్ మధ్య పెరిగిన వందలాది కలుపు మొక్కల్ని తొలగించడం గమనించండి! గేటు బైటా, లోపలా దుమ్మూ - ఆకుల్ని ఊడ్చేసిన వారు DRK డాక్టరు గారి సతీమణి!

B. బెజవాడ రోడ్డులో 200 గజాల పడమర అంచున నిష్టగా పనిచేసిన 20 మందిని కూడ పరిశీలించాలి. కూర్చొని కత్తులతో గడ్డిని తొలగిస్తూ కదులుతున్న కార్యకర్తలూ, డ్రైన్ లో దిగి వ్యర్ధాలను ఒడ్డుకు చేరుస్తున్న వారూ, జాగ్రత్తగా వాహన వేగాల మధ్య వీధి మార్జిన్ ను పదేపదే ఊడుస్తున్న నర్సమ్మలూ కనిపిస్తున్నారా?

C. కొన్ని బోగన్ విలియా పూల చెట్ల కొమ్మలు బాటపైకి వస్తున్నందున నచ్చక – పనిచేయనని మొరాయిస్తున్న యంత్రాన్ని 10 నిముషాలు బ్రతిమాలి, శాఖల్ని ఖండించిన సుందరీకర్తల కష్టాలు కూడా పేర్కొనదగినవి!

D. 2 గోతాల సింగిల్ యాజ్ ప్లాస్టిక్ లనూ, గాజు బుడ్లనూ సేకరిస్తున్న శేఖర కార్యకర్తనూ -

E. అక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో - రిజిస్ట్రారు ఆఫీసు వద్ద ట్రాక్టరు నిండా వ్యర్ధాల్ని నింపుకొని వచ్చిన రెస్క్యూ బృందమునూ నేను గమనించాను!

F. నేటి శ్రమదానంలో హైలెటు మాత్రం  ముళ్ల కొమ్మల వ్యర్ధాల్నీ డ్రైను మురుగు కంపు చెత్తల్నీ డిప్పలకెత్తి - మోసి – ట్రాక్టరులోనికి బట్వాడా చేయడమే!

               గంధం వెంకటేశ్వరుల వారూ, పడమటి బజారు మోతుకూరి వెంకటేశ్వరులూ ఈ పనిలో రాటు తేలారు!

               వాతాపరణం మాత్రం చల్లగా వీధి పారిశుద్ధ్య కృషికి అనుకూలంగానే ఉన్నది!

               ఒకింత ఆలస్యంగా - జాతిపిత విగ్రహం సాక్షిగా జరిగిన తుది సమావేశాన్ని దాసరి ఆర్య – ఆరవ్ వంతులేసుకొని నినాదాలతో ప్రారంభించడమే కాదు – తమ వయసులో సగభాగం శ్రమదానం చేసిన అనుభవాల్నీ వివరించారు!

               స్వచ్ఛంద శ్రమదానం మీద పాఠశాలలో వ్యాసరచన పోటీలో గెలుచుకొన్న బహుమతినీ గుర్తుచేసుకొన్నారు!

               బెజవాడ రోడ్డులోని కార్ల రిపేరు షెడ్డు వద్ద రేపటి వేకువ కలుసుకొందామని నిర్ణయమూ జరిగింది!

               పూనవలెన నేనిప్పుడు?

చరిత్రలో ఏ నాడు ఇట్టి శ్రమ వేడుక చూళ్లేదని

ఈ సామూహిక శ్రమవీరులు చరిత్ర సృష్టిస్తున్నారని

రూపురేకలన్ని మార్చి ఊరినుద్ధరిస్తారని

పొగడుటుకో - తెగడుటకో పూనవలెన నేనిప్పుడు?

-నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   21.10.2026