3992* వ రోజు.....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలంటారా?

                  39 మంది శ్రమ త్యాగ ధనులతో 3992* వీధి పారిశుద్ధ్యం!

               ఆ పారిశుద్ధ్యం విజయవాడ బాటలో 6 వ నంబరు పంట కాల్వ నుండి సుమారు 200 గజాల మేర ఉత్తరంగా విస్తరించినవి. పని వేళలైతే - వేకువ 4:19, 6:02!        

               ఊరికి దూరంగానూ కొందరి ఇళ్ల నుండైతే నాలుగైదు కిలోమీటర్ల దూరంగానూ జరిగిన నేటి సుమారు 50 పని గంటల శ్రమదానం మన సమకాలపు విచిత్రాలలో ఒకటి! ఈ కార్యకర్తల్లో ఏ ఒక్కరినీ ఏ ఒక్కరూ బ్రతిమాలో - భయపెట్టో- ప్రలోభపరచో తీసుకురాలేదు సరికదా - ఇందులో సగం మందైతే మరీ కరుడుగట్టిన ప్రతిదిన కార్యకర్తలు! “ఈ శ్రమదానమే లేకపోతే ఈ ఊరి పరిశుభ్ర – సౌందర్యాలేమి కాను? మన ఆరోగ్య ఆనందాలేమి కావాలి?” అని దిగులు మనుషులు!

               సరే – ఈ గ్రామస్తుల్లో కొందరైనా అలాంటి వాళ్ళ దిగులు పోగొట్టుతూ ఎప్పటికప్పుడు యథాశక్తిగా వీధుల్నీ, డ్రైన్లనూ, 6 వ నంబరు పంట కాల్వనీ చెడగొట్టుతూ, కార్యకర్తలకు తగినంత పని కల్పిస్తూనే ఉన్నారనుకోండి!

               ఆ విధంగా 12 ఏళ్లు పూర్తవుతున్నా అటు కార్యకర్తలూ - ఇటు కొందరు ఊరి ప్రజలూ ఎవరి అలవాట్లలో వాళ్ళు నిమగ్నులుగానే ఉన్నారు!

               ఈ 22.10.26 వ తేదీ - గురువారం వేకువ కాలాన కార్యకర్తలెంతగా శ్రమిస్తే మాత్రం ఏం లాభం? పంట కాల్వ వంతెన వద్ద దట్టంగా ప్రోగుపడిన వ్యర్ధాల గుట్టల్ని చూసి DRK మహాశయుడు “ఏమిటీ దుస్థితి? పుష్కర కాల తీవ్ర ప్రయత్నం తరువాత కూడా కార్యకర్తల శ్రమకు ఫలితమిదా?” అని నిర్వేదం చెందితే మాత్రం ప్రయోజనమేమిటి?

               ఇప్పటికీ మారని కొద్దిమంది ప్రజలు స్వచ్ఛ కార్యకర్తల కన్నా - DRK ప్రసాదు కన్నా – ఆఖరికి రాజాధి రాజుల కన్నా మొండి వాళ్లుగా - బలవంతులుగా కనిపిస్తున్నారు!

               వాలంటీర్లు మాత్రం – “రోజుకొక గంటన్నర శ్రమించినంత మాత్రాన పోయేదేమున్నది - మన అనారోగ్యాలు తప్ప! చూద్దాం - ఎప్పటికైనా 100 శాతం గ్రామస్తులు మారకపోతారా?” అనుకొంటూ - ప్రతి వేకువలాగానే గ్రామ వీధి పూజలో భాగంగా :

1) 150 గజాల బెజవాడ రోడ్డునూ ఊడ్చారు,

2) ముళ్ల పూల చెట్లనూ సుందరీకరించారు,

3) డ్రైన్లనూ వదల్లేదు.

4) సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లను ఏరారు,

5) వ్యర్ధాలన్నిటినీ ట్రాక్టర్ లో నింపారు,

6) వక్కలగడ్డ రామకృష్ణ అనే కార్యకర్త కంటికి గులకరాయి తగిలినా అతడు పని ఆపలేదు.

7) కార్యకర్త లెక్కువగా ఉన్నందున ప్రక్క పొలంలో సభ తీర్చి, మల్లంపాటి ప్రేమానందుని నినాదాలకు గట్టిగా బదులిచ్చారు.

8) DRK గారి సమీక్షా, వచనాలు విని –

9) 12:00 కు వేమూరి అర్జునుల వారి సంవత్సరీకానికి  స్వచ్ఛ దుస్తులతో వెళ్లాలని గుర్తు చేసుకొని,

10) చివరగా రేపటి వేకువ కూడ ఇదే కార్ల మరామత్తుల షెడ్ వద్ద కలవాలనుకొన్నారు!

               శ్రీకారం చుట్టుతుంటె

ఏనాడూ గడప దాటి ఇలాంటి పనులకు పూనని

గృహిణులు రోడ్లూడ్చుతుంటే - శ్రీమంతులె రొచ్చు పనుల శ్రీకారం చుట్టుతుంటె

ఆ విధముగ మారు ఊరు తీరునదే పనిగ చూసి
తెగడడమో - పొగడడమో తప్ప నాకు పని లేదా!

-నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   22.10.2026