పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలంటారా?
3993* వ పారిశుద్ధ్య ప్రయత్నం కూడ బెజవాడ రోడ్డులోనే!
శుక్రవారం - 23.10.26 న ఆ ప్రయత్నం 4:18 కే ప్రారంభమైనా కారణాంతరం చేత 6.00 కు కాక ఆలస్యంగా ముగిసింది. ఒక్క పైసా ప్రతిఫలమూ ఆశించకుండా మళ్లీ కార్ల షెడ్ ప్రాంతమందే 50 కి పైగా పని గంటలు కష్టించిన వాళ్ళు 37 మంది మాత్రమే! వీరిలో చాలమంది వేకువ 3 ½ కు లేచి, ఇళ్లకు సుమారు 6.45 కు ఇళ్ళకు చేరుకొన్నారు! అంటే తలా 3.15 నిముషాలు సమయదానమన్నమాట.
కార్యకర్తల్లో మూడొంతుల మంది యొక్క నేటి శ్రమ 150 గజాల బారునా విజయవాడ రోడ్డు తూర్పు ప్రక్క డ్రైను ఒడ్డునే!
మళ్లీ అందులో కూడా అత్యధికుల కష్టం 10-12 చెట్ల సుందరీకరణమే! కార్యకర్తలు దశాబ్దం నుండీ అందంగా పెంచుతున్న ఆ వృక్షాలలో కొన్ని అవసరమైనమేర కాక - వారికి తోచినట్లు విద్యుత్ శాఖ ఉద్యోగులు నరికేయడం చూసి, కార్యకర్తల మనసు చివుక్కుమన్న మాట నిజం. వాళ్ళు వేలకొద్దీ చెట్లు పెంచుతున్నది ఊరి రహదార్ల అందం కోసమూ, హరిత సంపద కోసమూ, జనాహ్లాదం కోసమూ ఐనప్పుడు ఇలా అడ్డంగా నరికేస్తే ఆ ఉద్దేశ్యాలు నెరవేరడం లేదు కదా!
చిందర వందరగా - గుట్టలు గుట్టలుగా రోడ్ల మార్జిన్ల బారునా పడి ఉన్న ఆ వ్యర్థాలను నరికేసిన వాళ్ళు కాదు, పంచాయతి వారూ కాదు, ట్రాక్టర్ల కొద్దీ తొలగించినది కార్యకర్తలే! ఏడెనిమిది మంది వాలంటీర్లకు ఈ పూట చెత్త లోడింగు పనే సరిపోయె! ఇతరులు నరికినవి కాక మర రంపాలతో, కత్తులతో ఈ వేకువ ఐదారుగురు కార్యకర్తలు నరికినవీ, మిగిలినవారు పీకిన పిచ్చి మొక్కలూ, తొలగించిన గడ్డీ, ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా ఆ కొమ్మలకు, రెమ్మలకు తోడైనవి!
ఇంకా - నేటి గంటన్నరకుపైగా జరిగిన వీధి పరిశుభ్రత, నాణ్యతల మీదా - రోడ్డు పల్లాలు పూడ్చిన పనుల గూర్చీ, మహిళల ఊడ్పుల విషయము వ్రాయకుండా వదిలేస్తున్నాను.
ఇప్పటికే 2 వారాల పాటు కార్యకర్తలు శ్రద్ధ వహించకపోతేనూ, వెంకటాపురం కూలీలు కొన్ని పనులు చేయకపోతేనూ ఈ 2 కిలోమీటర్ల బెజవాడ రోడ్డు మాత్రం అందంగా ఉండేది కాదని చెప్పగలను. ఇంకో 2 వారాలు ప్రయత్నిస్తే గాని తరిగోపుల ప్రాంగణం వరకు మొత్తం వీధి అందంగా మారవచ్చు.
ఈ గ్రామంలో దాని బాధ్యతలు వహించడానికి రకరకాల ప్రభుత్వ విభాగాలున్నవి గాని అందులో కొన్ని సహాయం కోసం స్వచ్చ కార్యకర్తల మీద ఆశలు పెట్టుకోవడం ఆశ్చర్యకరంగానే ఉన్నది!
తన నినాదాలతో నేటి సభను ప్రారంభించి, నాలుగు మంచి మాటలు కూడ చెప్పిన వారు సూర్యదేవర నాగేశ్వరరావు గారు; కార్యకర్తల శ్రమనూ, తత్ఫలితంగా చక్కగా కనిపిస్తున్న బెజవాడ రోడ్డునూ వివరించిన వారు DRK డాక్టరు గారు!
రేపటి వేకువ శ్రమదాతలు కలుసుకోవలసినది మళ్లీ VJA బాటలోని చిన్న కార్ల షెడ్డు వద్దనే!
హార్దిక సౌజన్యముతో
ఇంకా ఎందరో దాతలు నెల వారిగ చందాలను
హార్దిక సౌజన్యముతో అందిస్తూ శ్రమదాతల
కండగ నిలుస్తున్నారని గ్రామస్తులు గ్రహించాలి
ఇకనైనా ప్రతి పౌరుడు ఈ పనులలొ పాల్గొనాలి!
- ఒక స్వచ్ఛ కార్యకర్త
23.10.2026