3995* వ రోజు.....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలంటారా?

ఆదివారం శ్రమదానం తడాఖా చూపించిన 3995* వ ప్రయత్నం!

               అది కూడ మళ్లీ బెజవాడ దారిలోని బృందావన గృహ సముదాయ - నారాయణరావు నగర వీధి ప్రాంతమే! ఈ పూట కూడ 4:20 కే దాని ప్రారంభోత్సవం పొదుపుగా 18 మందితోనే కాని ఒక్కో నిముషం గడిచే కొద్దీ సంఖ్య పెరిగి పెరిగి 56 దగ్గర ఆగింది. రకరకాల ఈ వీధి పరిశుభ్రతా కార్యక్రమం వెంకటాపురం నుండి వచ్చి, ఇక్కడికి కాస్త ఎడంగా పని మొదలుపెట్టిన 22 మందినీ కలుపుకొంటే - ఈ వీధిలో కష్టించిన వాళ్ళ బలం 78 అనుకోవచ్చు!

               ఇంత వేకువ సమయాన - ఊరికి ఎడంగా –

- కొందరు వృక్ష సుందరీకరణ కోసం కత్తులూ, దంతెలూ, మర రంపాలూ వాడుతుంటే,

- గృహిణులూ, నర్సులూ చీపుళ్లతో ఊడుస్తుంటే,

- డ్రైనులో పడున్న కొమ్మల్ని కొందరు గట్టి కార్యకర్తలు ఒడ్డుకు గుంజుతుంటే,

- వీధిని ఒకరిద్దరు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితం చేస్తుంటే,

- ఇందరు ఊడ్చిన ఆకులలముల్నీ, పుల్లల్నీ, తెగిపడిన కొమ్మ రెమ్మల్నీ, దంతెలతో ప్రోగులు పెట్టేవాళ్లు పెడుతుంటే –

- ఇంకొందరు కార్యకర్తలు వ్యర్ధాలన్నిటిని డిప్పలకెత్తి చెత్త ట్రాక్టరులో నింపుతుంటే,

- తూము వారూ, ప్రాతూరి వారూ ఇంతటి శ్రమ సౌందర్యాలను ఫోను కెమెరాల్లో బంధిస్తుంటే

- సమాజం పట్ల కాస్తంత కన్సర్న్ ఉన్న వాళ్లీ దృశ్యాలను చూస్తుంటే,

               ఏమనిపిస్తుంది? ఈ శ్రమదానం గురించి ఏం వ్రాయాలనిపిస్తుంది? కవి హృదయం ఉంటే - పద్యాలు వ్రాయాలనీ, గాన కోవిదుడైతే గళం విప్పాలనీ, సామాజిక పరిశీలకులైతే దీన్ని లోతుగా అధ్యయనం చేయాలనీ, ఏ కొద్దిపాటి సామాజిక స్పృహ ఉన్న గ్రామస్తులో చూస్తే రేపటి నుండి తాము సైతం ఇలా ఊరి కారక్రమంలో పాల్గొనాలనీ... ఉండదా?

               ఇక్కడి 40 బృందావన గృహాల కిటికీల్లోంచి చూసిన ఎవరైనా మనసు మార్చుకొని కాంట్రాక్టరు వేణుతో కలిసి ఎవరైనా రేపు ఉదయం వచ్చి, కార్యకర్తలుగా మారరా?

               ఈ నిత్యనూతన శ్రమ వేడుక వీధిలోనూ, డ్రైన్ లోనూ వ్యర్ధాలను విరజిమ్మడం కన్నా – రోడ్ల మార్జిన్లను పోటీపడి దురాక్రమించడం కన్నా, కార్యకర్తలు నాటి పెంచే చెట్లను నరకడం, తగలబెట్టడం కన్నా, మొక్కలు ఎత్తుకుపోవడం కన్నా పాపకార్యమా?

               నేటి శ్రమ జరుగుతుండగా, ఒక చిన్న సంగతి :

               అతనిది తాడిగడప, భవన నిర్మాణంలో సెంట్రింగు కోసం వచ్చి, మొన్నా, ఈ పూటా ఈ బెజవాడ రోడ్డులో పనుల సందడి చూసి, మన వీరశేఖరుడిని అడిగాడు – “ఏమిటిదంతా? 4000 రోజుల్నుండీ ఇలా చేసుకుపోతున్నారట....నిజమేనా? మన శేఖరుడూ, నేనూ అతనికికథంతా వివరించాం!

               నేటి రోజువారీ సమావేశం వీరసింహుడి నినాదాలతో ప్రారంభమైంది, ఒకప్పటి స్వచ్ఛ కార్యకర్తా, ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్వాహకుడూ, ఇప్పుడు ZPTC పోటీ అభ్యర్ధి ఐన యద్దనపూడి మధు ఓట్ల అభ్యర్ధనతోనూ,

               తన నివాస ప్రాంతం ఎదుట రెండు రోజుల్నుండీ బాగా శ్రమిస్తున్న కార్యకర్తల ఎడ గౌరవాభిమాన సూచకంగానూ కాంట్రాక్టరు నాదెళ్ళ వేణు కుటుంబీకులు సుష్టుగా రకరకాల అల్పాహారాలను, అందించడంతోనూ,

               రేపటి వేకువ కూడ విజయవాడ బాటలోని బృందావన గృహాల వద్దనే కలుద్దామనే నిర్ణయంతోనూ ముగిసినది!

               ఇది చరిత్ర!

ఇది చరిత్ర! ఇది తపస్సు - ఈ ఊరి మేలుకొక యజ్ఞం

ఎవరి వార్డులోన వాళ్ళు - ఎవరి ఊరి కొరకు వాళ్లు

సముచితంగా చేయగలుగు సింపుల్ శ్రమదానం

ఎందుకు ప్రతి ఊరి వాళ్లు దీనిని పాటించరు!

- ఒక స్వచ్ఛ కార్యకర్త

   25.10.2026