పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలంటారా?
సోమవారం (26.10.26) వేకువ 27 గురి శ్రమదానం చిత్తగించండి! - @3996
వారి 40 పనిగంటల కష్టం కూడ బెజవాడ బాటకే అంకితమయింది! కాకపోతే నిన్నటి కన్న కాస్త ముందుకు - అంటే బాలాజీ భవన విభాగాల వరకూ పోయినట్లున్నది! బృందావన గృహ సముదాయ సమీపంలోనే ఆగి, 4:20 కే 10 మంది ఫొటో దిగినా, కొందరు కార్ల షెడ్ దగ్గర కూడ పనులు చేశారు.
కార్యకర్తలు 27 గురే కాని - నేటి వీధి శ్రమలో చాల విశేషాలున్నవి. 12 ఏళ్ల నిస్వార్ద ప్రయత్నాలనూ, వాటి గురించి ఏపూటకాపూట కొందరు పాఠకులను విసిగిస్తూ నా వ్రాతలనూ చదివే వాళ్లలో కొందరికి మాత్రం ఈ పూట పని విశేషాలు ఆసక్తికరంగా ఉంటే ఉండవచ్చును! మచ్చుకు వాటిలో కొన్ని:
- అప్పటిదాక మర రంపం బరువు మోస్తూ, కేబుల్ వైర్లలో ఇరుక్కున్న చెట్ల కొమ్మల్ని చాకచక్యంగా కోస్తున్న ఆకుల దుర్గాప్రసాదు కత్తితో కొమ్మల్ని సైజులుగా నరుకుతుండగా నేనేదో తమాషాకి “ఏదీ - ఆ లావుపాటి కొమ్మను ఒక్క వ్రేటుతో నరుకు చూద్దాం” అనేసరికి ఆ మానవుడు నిజంగానే ఒకే ఒక కత్తి వ్రేటుతో తెగనరకడం!
- అక్కడికి దూరంగా - నారాయణరావునగర్ బాట దగ్గర పారతో గడ్డి చెక్కుతూ చెమట కారుస్తున్న అడపా గురవయ్య దగ్గరకుపోయిన మన ఊరి మనిషే “ఏమండీ! రేపటి నుండి నేను కూడ మీతోబాటు పనిచేయదలచుకొన్నాను, రమ్మంటారా?” అనే సరికి అమాయకపు గురవయ్య సంతోషిస్తుండగానే - “ఇంతకీ పూటకు తలా 5 లేక 7 వందలన్నా ఇస్తున్నారా మీకు?” అని ఆ వ్యక్తి దిమ్మ తిరిగే ప్రశ్న అడగడమూ!
- విరిగిన చేయి మానకుండానే నాయుడు మోహన్రావు తూర్పు డ్రైను బురద నుండి పంతం పట్టి అదే చేత్తో బండెడు దిక్కుమాలిన వ్యర్ధాల్ని బైటకు లాగుతుంటే చూసి, నేను 7 వ తరగతి (1961 లో) తెలుగు పాఠ్య గ్రంథంలో జంధ్యాల పాపయ్య శాస్త్రి బమ్మెర పోతన మీద వ్రాసిన
కాయలు కాసి పోయినవి నీ అరచేతులు వ్రాతఘంటపున్
రాపిడి చేతనా? మొరటు నాగలి మేడి ధరించి సేద్యమున్
చేయుట చేతనా? కవి కృషీవల! నీ వ్యవసాయ దీక్షకా
హా! యని అంతలేసి కనులార్పక చూసిరిలేదివౌకసుల్”
అనే పద్యాన్ని గుర్తుతెచ్చుకొని చెప్పటం
- కార్యకర్తల నేటి కృషిని టూకీగా, సమీక్షించిన డి. ఆర్.కె. డాక్టరు గారు నిన్నా – మొన్నటి తమ కాకినాడ యాత్రా సమయపు - ముఖ్యంగా రెడ్ క్రాస్ అధ్యక్షుడు Y.D. రామారావు గారి అద్భుత సేవలను చాల సేపు వివరిస్తుంటే కార్యకర్తలు చాల ఆసక్తిగా వినడమూ Etc. అన్నమాట!
రోజూ 500-700/- కాదు - ఒక్క పైసా కూడ ఆశించని వీధి సేవల కోసం మనం రేపటి వేకువ కూడ ఈ విజయవాడ బాటలోని బృందావనం వద్దనే కలుసుకోవాలట!
సందిగ్దపు జంక్షన్లో
ముమ్మరముగ కష్టించే మొండి ఘటాలొక ప్రక్కన
కన్నులెదుటి ఆ కష్టము గమనించని జనులొక ప్రక్కన
ఇందెవరిని పొగడాలో - ఎవరిని కీర్తించాలో
సందిగ్దపు జంక్షన్లో చతికిల బడి నేనిక్కడ!
- ఒక స్వచ్ఛ కార్యకర్త
26.10.2026