పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలంటారా?
మంగళవారం (27.10.26) నాటి మహనీయ శ్రమదానం - @3997*
ఈ వేకువ 4.20-6.07 నడుమ బెజవాడ దారిలో జరిగిన శ్రమ వేడుక కాస్త వెనకడుగు వేసిందనే చెప్పాలి! అంటే దీనర్థం కార్యకర్తలు తగ్గిపోయారని కాదు, అలసి - విసిగి పనులు మానేశారనీ కాదు! తరిగోపుల ప్రాంగణం వైపు చేయవలసిన ప్రయత్నం బృందావన గృహాల దగ్గర నుండి ½ కిలోమీటరు వెనకకు జరిగిందనే!
కార్యకర్తలకేం - 35+2 + 1 మంది హాజరయ్యారు. మొన్నటి దాక ఎల్ నినో వేడి బదులు - చలిగాలి వీస్తుంటే వాళ్లేమీ ఇళ్లలో దాక్కోలేదు! ఊరికి 2 ½ కి.మీ దూరమైనా; మధ్యలో కరెంటు లేని గతుకుల రోడ్డు వద్ద కొంచెం ఇబ్బందైనా, నేనే సైకిలు త్రొక్కుకుంటూ వెళితే - వెంకటాపురం నుండి 4 ½ కి.మీ. దాటుకొని విద్యార్థులే వస్తే - 50 అపార్ట్ మెంట్ల వారు గాని, ప్రక్కనున్న నారాయణరావు నగరస్దులే గాని రాలేకపోయారు!
[షరా! పై సంఖ్యలలో 35 నికర కార్యకర్తలనూ, +2 అనేది CPM పార్టీ నాయకులనూ + 1 ప్రస్తుత ఎన్నికలలో ZPTC అభ్యర్థియగు యద్దనపూడి మధు గారినీ సూచిస్తుంది]
మరి “నేటి వీధి శ్రామికుల బృహత్ప్రయత్నమేమి? ఎందుకది మహనీయమైంది? అని ప్రశ్నిస్తే:
1) చిన్న కార్ల షెడ్డు ప్రక్క “వినాయక” దుకాణం వరండాతో బాటు ఆ నాలుగైదు సెంట్లలోని తడీ పాడి చెత్తంతా మాయమై గంట సేపటికే శుభ్రపడినందునా,
2) రహదారికి తూర్పు, పడమర అంచుల అన్ని రకాల గలీజులూ మరొకమారు ఊడ్చి, శుభ్రపరచినందు చేతా,
3) ముఖ్యంగా తూర్పు లోతు డ్రైన్లో ఎందుకు పడి ఉన్నవో గాని - చచ్చి, అడ్డంగా పడి ఎండిన చిందరవందర చెట్ల కొమ్మల్ని ఆ చీకటి సమయమున 7-8 మంది రంపంతో కోసి, అడ్డాలు తొలగించి, ఒడ్డుకు చేర్చిన సాహసిక శ్రమదానమును ½ గంటపాటు ఒళ్లు గగురుపొడిచేట్లు నేను చూసినందువల్లా –
4) అసలీ వీధి పారిశుద్ధ్య/ సుందరీకరణ కృషి ఏ ఒక్క కార్యకర్త సొంత పని కాక - ఊరంతటి ప్రయోజనార్థమైన కారణమునా...
ఇది ఆదర్శమనీ, ప్రస్తుత కాలపు అవసరమనీ, మహనీయమనీ చెప్పగలుగుతున్నాను!
ఇవి గాక
5) బృందావన గృహాల సమీపమున గురవయ్య గురువూ, నాదెళ్ల వేణు ల మట్టి త్రవ్వకమూ, ప్లాస్టిక్ ల విభజనమూ చూడదగిన సన్నివేశమే!
6) అక్కడికి పడమరగా రోడ్డు మార్జిన్ ను చూడచక్కగా తయారు చేసిన బృందావన - కస్తూరి – తూములూరి - BSNL వంటి వారి కాలుష్య సంహారమూ గుర్తుంచుకోదగినవే!
చివరికి 6.25 వేళ భోగాది వాసు మాస్టారి నినాదాలు, DRK గారి పని ముగింపు మాటలూ, ఆ తరువాత ZPTC గా పోటీచేస్తున్న యద్దనపూడి మధు గారి ఓట్ల అభ్యర్ధనా మరొక విశేషము.
రేపటి వేకువ తుఫాను వర్షం లేకున్నచో విజయవాడ బాటలోనూ, ఉన్నచో బైపాసు రోడ్డు KDCC బ్యాంకు వద్దనూ మన శ్రమదానముండును!
ఏమిటి నాకర్తవ్యమ్?
ఒకరు విజయవాడ శాస్త్రి! ఇంకొకరు భాగ్యనగర వాసి
విరమిత ఉద్యోగి ఇతడు - మోకాలిచిప్ప వైద్యుడతడు
ఏమాశించి ఈ ఊరికి ఇంతగ తోడ్పడుతారని?
పొగడడమా - తెగడడమా? ఏమిటి నాకర్తవ్యమ్?
- ఒక స్వచ్ఛ కార్యకర్త
27.10.2026