3999* వ రోజు.....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలంటారా?

ఒకే ఒక్క అడుగు దూరంలో 4000* వ శ్రమదానం!

               గురువారం (29-10-26) తోనో - 4 లేక 5 వేల రోజులతోనే ముగిసిపోయే - మూతబడే శ్రమదాన పరిశ్రమ కాదిది, ఈ చల్లపల్లి గ్రామ స్వచ్ఛ - శుభ్ర - హరిత – సౌందర్యాలు పరిపూర్ణమయ్యే దాకా - అదొక నిరంతర శ్రమ వేడుక! ఊరుకీ, ఊరి ప్రజలకూ ఎక్కడ - ఎప్పుడు - ఏ ఇబ్బంది కలిగినా ఆదుకోవాలని చూసే ఒక ప్రణాళిక!

               నిన్నటి ఈ భారీ తుఫాను వర్షం తర్వాత - ఆ గాలి - చలీ, వానలోనే కొన్ని రోడ్ల ట్రాఫిక్ సమస్యల్ని పరిష్కరించిన కొందరు స్వచ్ఛ కార్యకర్తలు ఈ వేకువ 4:30 కో – 5:00 కో కాక – 4:16 కే నాగాయలంక రోడ్డులోనే  పబ్లిక్ టాయిలెట్ల వద్ద నేలకొరిగిన భారీ వృక్షాన్నీ, రోడ్డంతా పరుచుకున్న ఆకులు – కొమ్మలు - రెమ్మల్నీ తొలగించాలని పూనుకున్నారు.

               అందుకుగాను 2 మర రంపాలూ, గొడ్డళ్లూ, కత్తులూ, గునపాలూ ముందే సిద్ధపరుచుకొని - నేటి 27 మంది కార్యకర్తల్లో డజను మంది 6.05 కు విజిల్ మ్రోగినా సరే పట్టించుకోక పనిచేస్తూనే ఉన్నారు.

               ఆ 100 గజాల వీధిని ఊడ్చే కార్యకర్తలు ఊడుస్తూనే ఉన్నారు! ఇప్పటికిప్పుడైతే - మాంసం దుకాణాల్లోనైతే, మినీ కోళ్ళ షెడ్డు దగ్గరి, ప్రక్కన గోడౌను ఆవరణలోని వ్యర్థాల్ని తొలగించ బూనుకోలేదు!

               కోస్తున్న భారీ వృక్ష కాండం ముక్కల్ని మోసుకుపోయి, ట్రాక్టరు కందించడమూ జరుగుతూనే ఉన్నది! అన్ని పెద్ద వ్యర్థాల గుట్టల్ని అంత చాకచక్యంగా ట్రాక్టర్ లో ఒకాయన సర్దుతూనే ఉన్నప్పుడు -

               “2 ట్రాక్టర్ల తుక్కును ఒక్క ట్రాక్టర్ లోనే అంజయ్య గారు సర్దేశాడె” అని నేనంటే - కస్తూరి విజయుడు  “2 కాదు బాబూ అది 3 ట్రాక్టర్ల తుక్కు!” అని సరిదిద్దాడు!       

               మొత్తానికి పాతిక మంది కార్యకర్తల్లో 6:00 దాటినా ఉత్సాహం తగ్గలేదు, ఎవరైనా పురమాయించారో లేదో గాని - టాయిలెట్ల నిర్వాహకుడు కూడ స్వచ్ఛ కార్యకర్తగా మారిపోయాడు!

               ఇక DRK గారి ఆలోచన వేఱుగా ఉన్నది - “నిరుడు అక్టోబరు తుఫానుకు పడిన చెట్లతో మంచి బెంచీలు చేసి, పంచాయతికి బహుకరించాం! ఈ అక్టోబరు తుఫాను సమూలంగా పెళ్లగించిన ఇంత పెద్ద చెట్లతో ఏమేం చేసి, ఎవరికి ఇద్దాం?” అని! (అంతేగాని - “మంచి ఫర్నిచరు చేయించుకొని, ఇళ్లలో పెట్టుకొందాం” అని మాత్రం ఏ ఒక్కరికీ తట్టలేదు!)

               నేటి నినాదాలు గట్టిగా వినిపించే వంతు గంధం బృందావనుడిది! “ఇన్ని కష్ట సాధ్యాలను సుసాధ్యం చేయడంలో చల్లపల్లి స్వచ్ఛ కార్యకర్తలకు కాక ఇంకెవరికి సాధ్యపడుతుంది” అనే ప్రశంస డి.ఆర్.కె. గారిది!             

               రేపటి మన 4000* శ్రమదానం గంగులవారిపాలెం వీధిలోని పద్మాభిరామం వద్ద అనేది సమష్టి నిర్ణయం!

               విచక్షణలు మరచి

ఇల్లు మాత్రమే తమదీ, వీధి తమది కానట్లుగ

విచక్షణలు మరచి చెత్త వీధిలోకి విసరుటా?

డ్రైను తమది కానట్లుగ డంపింగుగ మార్చేయుట

పన్నెండేళ్ల పిదప చల్లపల్లిలోన కూడనా?

- ఒక స్వచ్ఛ కార్యకర్త

   29.10.2026