4000* వ రోజు.....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలంటారా?

శ్రమదానమునకు మంచి అర్ధాన్ని తెలియజెప్పిన 4000* వ రోజు!

               శుక్రవారం - అనగా 30.10.26 వ తేదీన సదరు నాల్గు వేలవ శ్రమ జరిగింది. స్థలం గంగులవారిపాలెం వీధిలోని సన్ ఫ్లవర్ మార్గం వద్ద! ఇంకా 4.15 అయిందో లేదో - 3 ఊళ్ళ నుండి డజనుకు పైగా కార్యకర్తలక్కడ హాజరు!

               సాధారణ సమయాల్లోని శ్రమానందమూ, సందడీ వేఱు - పన్నెండేళ్ళు పూర్తి కావస్తున్న సందర్భం వేఱు కదా! రాన్రానూ శ్రమదానం కోసం వచ్చేవాళ్ళు పెరిగి - పెరిగి, చివరికి 6.05 కు చూస్తే 74 కు చేరింది. పాపం అటుగా వెళ్లే – వచ్చే వేకువ నడకల వారికి ఒకింత ఇబ్బందై ఉంటుంది.

               పని జరుగుతున్న వీధి నుండి కూడ మహిళలతో సహా కార్యకర్తలే కాదు – ఎవరెవరో క్రొత్త వాళ్లను తెచ్చి, కార్యకర్తలుగా మార్చే విన్నకోట వెంకటేశ్వరావు వలన మరో నలుగురు కూడ వచ్చేశారు. అసలింత మంది - ఎవరి సొంతానికో కాక - గ్రామమంతటి సంక్షేమాన్ని కోరుకుంటూ - ఒక వీధిని ఊడుస్తున్న, పేడ - పెంటలెత్తుతున్న, పిచ్చి మొక్కలో గడ్డో పీకుతున్న, పీకిన వ్యర్ధాల్ని ప్రోగులు చేస్తున్న, ఆ ప్రోగుల్ని డిప్పలకెత్తి, మోసి చెత్త బండిలోకి చేరుస్తున్న, ముఖ్యంగా మహిళామతల్లుల్ని చూస్తుంటే....”

               అది నిజంగా ఎంతటి సామాజిక ప్రగతి సూచకం? ఏ కాస్తన్నా కవిత్వం జబ్బు ఉన్న వాళ్లకది ఎంత ప్రేరకం? సామాజిక పరిశీలకులకెంతెంత నయన మనోహరం?

               నా వరకు నేను - మురుగు కాల్వ ఒడ్డున పనిచేసే దృశ్యాన్ని చూడాలో,

-పెద్ద డాక్టరమ్మల - డాక్టరయ్యల, పంతులమ్మల - పంతులయ్యల వీధి ఊడ్పుల్నే చూడాలో,

- నా ఇంటి ఎదుట – ఇంకా 3-4 ఇళ్ల ముంగిట జరుగుతున్న బాధ్యతల్ని గమనించాలో,

- కూని రాగాల మధ్య కొందరు గడ్డి చెక్కే పనుల్నే చూడాలో,

- ఇంకా ఏం చేస్తే ఈ సుమసుందర వీధి అందాలు పెరుగుతాయని తపనపడే సుందరీకర్తలనే పరిశీలించాలో,

- ఈ సన్నివేశాల్ని ఫొటోలు తీసుకొంటున్న ముగ్గురు ఛాయాగ్రాహక నిపుణుల అవస్థలే చూడాలో,

- ఇందరు కార్యకర్తల – ఇన్ని రకాల వీధి బాధ్యతల్ని చూసి ఆనందిస్తున్న DRK గారి నొక కంట కనిపెట్టాలో తేల్చుకోలేక పోయానే!

               అసలా కనువిందు సంఘటనలన్నిటినీ ఎలా సమర్థవంతంగా వ్రాయాలో తికమక పడుతున్నానే!

               ఇంత శ్రమ సందడిని ప్రత్యక్షంగా చూడలేని కనెక్టికట్ సురేశ్ గాని, గురవారెడ్డి - గోపాళం డాక్టర్లు గానీ, పల్నాటి దంపతులు గాని ఏమనుకొంటున్నారో అని తలచుకొంటున్నానే!

               అసలా చివరి 20 నిముషాల సభ మాత్రం? ఏదో ఒక వీధి శుభ్రంగా – అందంగా మారిందని ఆ 74 మంది సంతోషమేమిటో- చాల రోజుల తర్వాత DRK గారి నినాదాలెలా ఉన్నవో –

               పన్నెండేళ్ల శ్రమదాన చరిత్ర పూర్వాపరాల వివరణ ఎట్లున్నదో –

               ఆ నందేటి శ్రీనివాసుని స్వీయరచనల గాన విన్యాసమూ – అందుకు మ్రోగిన చప్పట్లేమిటో –

               ఈ సందడిలో కడియాల భారతి గారి 1000/-,  తగిరిశ సాంబశివరావు గారి 500/- విరాళమూ,

               రేపటి శ్రమదానం బెజవాడ రోడ్డులోని కార్ల షెడ్డు వద్దకు తరలిపోతుందని తెలిసింది!

             జోహార్లర్పించుట నా బాధ్యత!

ఎవ్వరు మార్చేశారో ఈ శ్రమదానము నుద్యమముగ

మురుగు లెత్తు - పేడలూడ్చు అలవాటుగ సదరు పనుల

ఎవ్వరు ప్రాంతీకరించారో – అట్టివారి ముందుచూపు

నకు జోహార్లర్పించుట నా బాధ్యత కదా మరి!

- ఒక స్వచ్ఛ కార్యకర్త

  30.10.2026