4011* వ రోజు.....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలంటారా?

మంగళవారపు (10.11.26) శ్రమ విశేషాలు! @4011*

               నిన్నటి కన్న కార్యకర్తల సంఖ్య కొంచెం పెరిగి, నేటి వేకువ సమయంలో అది 15+18=33 గా తేలింది. మొదటి 15 అంకె నిర్ణీత సమయానికి 10 నిముషాలు ముందుగా వచ్చిన వారిది. పని చోటు 90% నిన్నటిదే! అంటే బెజవాడ దారిలోని బృందావన భవన విభాగాల ప్రాంతమే!

               నిన్న పని విరమణ విజిల్స్ ను పట్టించుకోక 6.12 దాక శ్రమించినది ఇద్దరు ప్రసాదులైతే, నేడు ఆరేడుగురు రెస్క్యూటీము వారు! వాళ్ళని తప్పుపట్టేందుకూ కుదరదు - రోడ్డు మార్జిన్ల చెత్త కుప్పల లోడింగు పూర్తి కాకపోతే - అవి గాలికో కుక్కల వలననో మళ్లీ డ్రైన్ లోకి చేరుతాయి మరి!

               అలాగని - రకరకాల చెత్తలు ప్లాస్టిక్ సంచుల్లో నింపి, సరదాగా రోడ్డు ప్రక్కనో-  మురుగు నీటిలోనో విసరే గ్రామస్తుల్ని తప్పుపట్టే ధైర్యమూ మనకు లేదాయె!

               మరొకందుకు సంతోషంగా ఉన్నది. 6.07 సమయంలో రోడ్డు పడమర పెద్ద చెట్టు కొమ్మలు కరెంటు తీగల్లో చొరబడడం చూసి, ముగ్గురు కార్యకర్తల ఆ పనిని రేపటికి వాయిదా వేయించగలిగాను!

               నిన్నటంతగా కాకున్నా ఈ వేకువ కూడ ఐదారుగురు మురుగు కాల్వలోని ప్లాస్టిక్ చెత్త నిధులను బైటకు లాగారు; ఏమాట కామాటే చెప్పుకోవాలి - ఆ డ్రైను మురుగు లోతు నిన్నటి కన్నా కాస్త తగ్గింది, ఘాటు కంపు కూడ తగ్గినట్లే అనిపించింది!

               చీపుళ్ళ వారిలో సగం మందికి గుంటలు పూడ్చిన కంకర వాహన వేగాలకు రోడ్డంతా పరచుకొంటే - సరిజేయడంతోనే కాలం గడిచింది!

               వీధి మార్జిన్ శుభ్రతలూ, చదునులూ ఈ వేకువ కూడ కొనసాగాయి, ప్లాస్టిక్ సింగిల్ వస్తు సేకర్త శేఖరుల వారు రానందున ఆ పని మాత్రం జరగలేదు,

               క్రొత్తగా బృందావన అపార్ట్మెంటు ప్రహరీ వెలుపల గడ్డి తొలగించే పనిలో 7-8 మంది నిమగ్నులయ్యారు.

               మంగళాపుర గ్రామస్తుడైన డొక్కు నాగే శ్వరరావు గారు బెజవాడ వీధి పనులకు పూనుకొని శ్రమిస్తుంటే - ఆ ప్రక్కన చిన్న గుడిలోని బుల్లి విగ్రహం పూజలకు 8 మంది గ్రామస్తులు వచ్చినా, వాళ్లెవరూ తమ ఊరి బాగు కోసం అక్కడే జరుగుతున్న శ్రమదానమును పట్టించుకోలేదు.

               ఈ ఉదయం 6.25 కు స్వచ్చోద్యమ సంబంధిత నినాదాలను ప్రకటించిన క్రొత్త కార్యకర్త డొక్కు నాగేశ్వరరావు గారు,

               ఈ వేకువ ఎవరెవరి శ్రమ ఎట్లున్నదో సమీక్షించిన వారు డాక్టర్ DRK గారు, 11-11-26 వ తేదీ ఉదయం VJA రోడ్డులోనే బృందావన భవన సమీపాననే ఆగి ఉత్తరంగా పురోగమించాలని అందరి అంగీకారం!

               గ్రామస్తులతో ముఖాముఖీ!

క్రీడలలో నమ్మలేని నైపుణ్యాన్ని గ్రహించాం

సరిహద్దులలో సైన్యం సాహసాలు చూశాంగద!

 అంతకన్న అధికంగా గ్రామానికి  స్వచ్ఛ కార్య

కర్తలు చేస్తున్న కాయ కష్టం గుర్తించొద్దా?

- ఒక స్వచ్ఛ కార్యకర్త

    10.11.2026