4012* వ రోజు.....

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలంటారా?

బుధవారం (11-11-26) నాటి వీధి బాధ్యత సంఖ్య - 4012*

               28000 జనాభా కల చల్లపల్లిలో సదరు బాధ్యతలు కేవలం 28 మందివి! అవి నెరవేరిన స్థలం మరొకమారు విజయవాడ రోడ్డులోని వినాయక వ్యాపార సంస్థ మొదలు నారాయణరావునగర్ వీధి దాక! సమయం వేకువ 4.20 మొదలు 6.08 నడుమ.

               చల్లపల్లి ప్రధాన కేంద్రం నుండి నేటి పని స్థలం వరకు 1 ½ కిలోమీటర్ల వీధంతా ఈ ఉదయం 6.40 కి గమనిస్తే –

               పరిశుభ్రంగా ఉన్న మాట నిజం,

               పద్మావతి డాక్టరమ్మ గారి సొంత డబ్బుతో చాల వరకు గుంటలు పూడి, ప్రయాణికులకు సౌకర్యంగా ఉన్నది యదార్థం,

               6 వ నంబరు పంట కాల్వ కూడ ప్రస్తుతానికి చెత్త మూటలు, ప్రాత గుడ్డలు లేక చక్కగా ప్రవహిస్తున్న కారణం ట్రస్టు తరపున ఒక ఉద్యోగి కాపలా ఉన్నందున అనేదీ సత్యమే,

               ఈ బాట “స్వచ్ఛ సుందర చల్లపల్లి” పేరుకు తగ్గట్లు సౌకర్యంగా – ఆహ్లాదంగా ఉన్నదని ఎవరైనా ఒప్పుకొంటారు,

               ఐతే - ఈ వైభోగం - తాత్కాలికమా - శాశ్వతమా?

               గ్రామంలోని 28 వేల మందీ స్వచ్ఛ కార్యకర్తలుగా మారనవసరం లేదు – 2 పూటలా ఈ చెత్త సేకరణకు తిరుగుతున్న చెత్త బళ్లకు ఎవరింటి వ్యర్ధాల్ని వారు అందిస్తే చాలు! బాధ్యతారహితంగా వీధుల్లోనో - డ్రైన్లలోనో నానా రకాల చెత్త మూటల్ని విసిరేయకుంటే చాలు! ఈ స్వచ్ఛ కార్యకర్తల బాధ్యతల్ని సగం పంచుకొన్నట్లే!

               వీధి మార్జిన్లను ఆక్రమించకుంటే చాలు – పౌర బాధ్యత నెరవేర్చుకొన్నట్లే! విచక్షణారహితంగా పచ్చని చెట్లను నరకకున్నా - కార్యకర్తల ఖర్చుతో, శ్రమతో పెరుగుతున్న పూల మొక్కల్ని కాజేయకుంటేనూ, పూలు త్రెంపకుంటేనూ వాళ్లు ఉత్తమ చల్లపల్లి పౌరులనిపించుకోగలరు!

               నేటి స్వచ్ఛ కార్యకర్తల పనులదేముంది - ప్రజల దృష్టిలో ఏమాత్రం గౌరవప్రదం కాని చెత్త - బురద – మురుగు - కంపు పనులకేనాడో వాళ్లు అంకితమైపోయారు! సంపూర్ణ స్వచ్ఛ - శుభ్ర- సౌందర్యమయమయేదాక ఆ పనులాపడం వాళ్ల చేతుల్లో కూడ లేదు.

               కాకపోతే - 2 విశేషాలను ప్రస్తావించాలి :

1) చచ్చిన పిల్లిని మూటకట్టి ఏ పుణ్యాత్ముడో డ్రైనులో వేస్తే నాని, ఉబ్బిన ఆ మూటను పసుపులేటి సత్యం చెత్త బండిలోకి విసిరితే అంజయ్య వంటి రాటు తేలిన కార్యకర్తే అ గబ్బుకు వాంతులు చేసుకోవడం,

2) T. పద్మావతమ్మ గారి అస్వస్తత కారణాన 5:50 కే DRK డాక్టరు గారు వెళ్లిపోవడం!

               ఇదే VJA రోడ్డులోని ఇదే బృందావన భవనాల వద్దనే రేపటి వేకువ కలుసుకోవాలని కార్యకర్తల నిర్ణయం!

               ఇంకెంత దేబిరించగలం?

ఇది మన పుట్టిన ఊరని - దీని స్వచ్ఛ పరిశుభ్రత,

 తద్ద్వారా సుస్వస్తత తప్పక మన బాధ్యత అని

 కేవలమొక గంటన్నా కేటాయిస్తే చాలని...

 ఎన్నిమార్లు చెప్పుంటాం- ఇంకెంత దేబిరించగలం?

- ఒక స్వచ్ఛ కార్యకర్త

11.11.2026