4013* వ రోజు.....

 సరిగ్గా 12 సంవత్సరాల క్రితం ఇదే రోజు స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమాన్ని మొదలు పెట్టాం.

నేటి వీధి శ్రమ గురువారం-12-11-26 న 4013* వది!

               పైగా బెజవాడ బాటలోనే ఇది ఏ 25 వ నాటిదో కావచ్చు! పనుల సమయంలో పెద్ద మార్పేమీ లేదు – 4:20-6:09 మధ్యస్తమే! కార్యకర్తల సంఖ్య కాస్త చాలీ చాలనట్లున్నది - ఇన్ని విశాల వీధులున్న, పాతిక ముప్పై వేల మనుషులు బ్రతుకుతున్న, అందులో కనీసం ¼  వ వంతు ప్రజలకు పర్యావరణ స్పృహ లోపించిన చల్లపల్లి పారిశుద్ధ్య – శుభ్ర - సుందరీకరణకు ఈ 32 మందేనా? మన DRK స్వచ్ఛ వైద్యుల వారు కోరుకున్నట్లు 100 మందైనా లేకుంటే ఎలా?

               ఊరి సంగతట్లా ఉంచి, చుట్టూ ఏడెనిమిది రహదార్ల పరిశుభ్ర – హరిత – ఆహ్లాద సాధన బరువు బాధ్యతల్ని ఈ కాస్త మంది కార్యకర్తలే మోయగలరా? స్వల్ప సంఖ్యాకులు

               ఊరి డ్రైన్లే చూసుకొంటారా? గుంటలు పడిన రోడ్లనే కాపాడుతారా? హిందూ ముస్లిమ్, కామన్ శ్మశానాల అత్యద్భుత నిర్వహణణే చేస్తారా? 32 వేల పూల - నీడ - పండ్ల చెట్లనే నాటి పెంచి - కాపాడతారా?

               అక్కడికీ 12-13 ఏళ్లపాటు అన్ని బరువు బాధ్యతలు వహించారు గదా! ఇప్పుడైనా ఇందరు సహృదయ గ్రామస్తుల్లో ఈ 32 మందికి తోడు మరో 50 మంది - అంటే వార్డుకు ఇద్దరేసి మనుషులు వచ్చి రోజుకు గంటన్నరపాటు సహకరిస్తే ఈ గ్రామ స్వచ్ఛ - శుభ్ర - హరిత - ఆహ్లాద స్థాయి ఎలా ఉంటుందో ఆలోచించండి!

               ............ఇలా ఉంటాయి 5 లక్షల పని గంటల శ్రమదానం చేసిన – ఇంకా చేస్తున్న స్వచ్ఛ కార్యకర్తల మనోభావాలు! ఈ జగమొండి కార్యకర్తల శ్రమతో ఊళ్ళో ఇన్నిన్ని మార్పులు వచ్చాయే - క్రొత్త కార్యకర్తల సంఖ్యాపరమైన వారి కోరిక కూడ తీరుతుందేమోచూద్దాం!

               నా దృష్టిలో ఈనాటి శ్రమరీతులే కాదు – ఏ నాటి ఏ ప్రయత్నాలైనా అసాధారణాలే! కరెంటు తీగల మధ్య దూరిన ఎత్తైన కొమ్మల తొలగింపు, అందరికీ దూరంగా – నారాయణరావు నగర్ వీధి వద్ద ఆస్పత్రి ల్యాబ్ ఉద్యోగి రవి నిర్వికారంగా చేసుకుపోతున్న డ్రైన్ పనీ, రహదారి ఊడ్పులూ, రోడ్డు మార్జిన్ల చదునులూ, ఏవి తక్కువ శ్రమలని?

               ఇక్కడి కార్యకర్తలం సరే – ఏదో తలా గంటన్నర మొత్తం 50 పని గంటలు పారిశుద్ధ్యం చేశాం – ఇళ్ళకెళ్ళాం, నిద్రలో కూడ స్వచ్ఛ చల్లపల్లిని మరవని ఒక అమెరికా ప్రవాసుడు – నాదెళ్ళ సురేష్ నేటి తుది సభా సమయంలో “డ్రైన్ల మీద వలల ఏర్పాటు గురించి సూచన చేయడమూ,

               మాలెంపాటి అంజయ్య గారు ప్రశాంతంగా నినదించడమూ,

               రేపటి వేకువ కూడ ఈ బెజవాడ బాట పనులే చేయాలనే అందరి నిర్ణయమూ,

               ఇవి తుది సభా విశేషాలు!

            బ్రతిమాలాం – ప్రాధేయపడ్డాం

కాలికి బలపాలు కట్టి కార్యకర్త లింటింటికి

తిరిగి, నార సంచులిచ్చి, “జరుగుచున్న శ్రమదానం

 ఊరంతటి మేలుకనీ, ఉద్యమించుదాం రమ్మని...”

ఎన్ని మార్లు బ్రతిమాలాం - ఎంతగ ప్రాధేయపడ్డాం?

- ఒక స్వచ్ఛ కార్యకర్త

    12.11.2026