4014* వ రోజు.....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలంటారా?

ఇది నవంబరు 13 వ తేదీ, అది 4014* వ శ్రమదానం!

               కాలం పరుగూ ఎక్కడా ఆగదు, ఈ స్వచ్ఛ కార్యకర్తల గ్రామ నవీకరణ ప్రయత్నం 12 ఏళ్ళ తరువాత కూడ విశ్రమించదు! నిన్నటితో 12 ఏళ్ళు నిండిన - వీధి సేవలకు ఈ వేకువ 13 వ ఏడు ప్రారంభమయింది! మరో విధమైన లెక్క ప్రకారం వచ్చే నెల 20 తో ఈ ఊరి పరిశుభ్ర – సుందరీకరణం వయస్సు 13 ఏళ్ళు నిండుతుంది!

               నేనేదో ఇలా లెక్కలూ, తారీఖులూ, అంచనాలూ కడుతుంటాను గాని, చల్లపల్లి ప్రజల ఆహ్లాద - ఆరోగ్యాల కోసం కంకణబద్ధులైన, ఈ ఉదయం 4:19 - 6.08 మధ్య మరొకమారు బెజవాడ బాటలోనే తమ ప్రతిజ్ఞలు నెరవేర్చుకొన్న 32 మంది కార్యకర్తలకు ఇవేమీ అంతగా పట్టవు!

               “మనం నాటి, పెంచిన మొక్కలు వృక్షాలై, వాటి కొమ్మలు రోడ్డు ప్రయాణికులకు అడ్డు తగులుతున్నాయే,

               కొన్ని చెట్ల శాఖలు కరెంటు తీగల్లో దూరిపోతున్నాయే,

               ఈ రోడ్డు మీద గుంటలు వాహనాల నడకను ఆటంకపరుస్తున్నవే,

               ఆ మురుగు గుంటల్నుండి దుర్వాసన వస్తున్నదే,

               వందలాది ప్రజలకు ఫలానా NTR పార్కులో పిచ్చి మొక్కలూ, గడ్డీ అలా పెరిగితే ఇది స్వచ్ఛ - సుందర చల్లపల్లి అనిపించుకోగలదా?”

               అనే ఆలోచనల్లో ఉండి, ఆచరణకు దిగే కార్యకర్తలు పైన చెప్పిన పని దినాల లెక్కల్నీ, తాము నిర్మిస్తున్న గ్రామ చరిత్రనూ పెద్దగా పట్టించుకొంటారా?

దీనికి ఉదాహరణలు కావాలంటే –

- ఈ శుక్రవారం వేకువ పడమటి డ్రైన్ లో గడ్డినీ, పిచ్చి చెట్లనూ తొలగించి,

               చిక్కుపడిన ముళ్ల పూల చెట్లను చీకటి రిస్కుతో సుందరీకరించిన, గంటపాటు మర రంపం ప్రయోగించి చెట్లను తీర్చిదిద్దిన ముగ్గుర్ని చూడండి!

- నారాయణరావునగర్ ప్రవేశంలో, మురుగు కంపు మధ్య పనిచేస్తున్న నలుగుర్ని పరిశీలించండి!

- జెండా స్తంభాలు 2-3 సెంట్ల స్థలాన్ని అందంగా మార్చిన కష్టాన్ని గుర్తించండి!

- డజను మంది సందడి - సందడిగా శుభ్రపరచిన పొలమో, స్థలమో గాని - ఇప్పుడైనా వెళ్లి గమనించండి!

               6.20 సమయాన బృందావన గృహసముదాయాల దగ్గర జరిగిన తుది సభలో ఆనందంగా నేటి కార్యకర్తల శ్రమతో ఈ వీధి ఎంతగా బాగుపడినదో అని ఆశ్చర్యపడుతున్న Dr. DRK గారి మాటలు వినండి!

               “రేపటి వేకువ మనం కలుసుకొనేది బాలాజీ అపార్ట్మెంట్ల దగ్గర” అని ఈ పూట రాని కార్యకర్తలు తెలుసుకొనండి!

               ఎన్నాళ్లీ మొద్దునిద్ర?

పరోక్షముగ మనుషులేమొ ప్లాస్టిక్ భక్షిస్తుంటే

గొడ్డుగోద కనిపించిన ప్లాస్టిక్ లే తింటున్నవి

 సముద్రాలు కలుషితమై జీవ కోటి నశిస్తోంది

 ఎన్నాళ్లీ మొద్దునిద్ర? ఇంకెంత వినాశనం?

- ఒక స్వచ్ఛ కార్యకర్త

    13.11.2026