పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలంటారా?
4015* వ విడత వీధిశ్రమల సందడి! (14-11-26 )
శనివారం కారణంగా శ్రమదాతల బలగం 42కు పెరిగింది! ఈ వేకువ బెజవాడ మార్గంలోని బాలాజి గృహాల ఎదుట మున్ముందుగా హాజరీ 22! రకరకాల సేవలు సదరు అపార్ట్ మెంట్లకు దక్షిణంగా, ఉత్తరంగా 70-80 గజాల మేర విస్తరించాయి. సేవల లేదా బాధ్యతల కాలమానం 4:19- 6:10 ల నడుమ!
ఈ 40+ మందిని ఏదో ఇప్పుడే చూస్తున్నట్లు, ఆ ఊడ్పుల్నీ- చెట్ల సుందరీకరణనీ- వీధి ప్రక్క గుంటల పూడికనీ- చెత్తలోడింగునీ- మురుగు కాల్వ పనుల్నీ - సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ల సేకరణనీ - మహిళా కార్యశీలుర ఉత్సాహాన్నీ-
అప్పుడప్పుడు కోడూరు వారి కేకల్ని - రోడ్డుకు ఎడంగా పొలంలో జరుగుతున్న పరిశుభ్రతా ప్రయత్నాలనీ- ఉభయ ప్రసాదుల వృక్ష సుందరీకరణ నుండి తయారైన బండెడు కొమ్మల, రెమ్మల, ముళ్ల మండల్ని ఆరేడుగురు లాగుకుపోతున్న విధానాన్నీ-
నారాయణరావు నగర వీధిలోని పాక్షిక మెరుగుదలనీ- ఆస్పత్రి నర్సమ్మల, కంపౌండర్ల పనుల హడావిడినీ-
హైడరాబాదు వాస్తవ్యులైన స్నేహ- కుమార్ ల చెమటలు చిందే కొన్ని చర్యల్నీ - మరికొందరి మట్టి పనుల్నీ,
అపార్ట్ మెంట్ల వరండాల్లో, సమీప గృహాల్లో నుండి చూసి కూడ సరిగా స్పందించని స్థానికుల్నీ,
ఇంకా బస్ ల కోసం, ఆటోల కోసం వేచి ఉన్న చాలమందినీ... నేను చూస్తూనే ఉన్నాను గంటకుపైగా! ఐనా సరే-
తమ ఇళ్ల ఎదుట ఎవరెవరో వచ్చి, ఇన్నిన్ని పనులు చేస్తుంటే చూసి కూడ రేపటి నుండీ వీరిలో ఎందరు శ్రమదానంలో చేతులు కలుపగలరో చెప్పలేకున్నాను!
వాళ్ల ఆశ్చర్యంతో ఊరికేం ఒరుగుతుంది? వాళ్ళు మెచ్చుకొని, ఊరుకొంటే దానర్థమేమిటి? 4015 రోజుల- 5 లక్షల పని గంటలగ్రామ సామాజిక శ్రమదానోద్యమానికిదేనా ప్రతి ఫలం? ఈ మాత్రమేనా స్పందన?
ఇటు నారాయణరావు నగర, అటు ఉభయ అపార్ట్ మెంట్ల నివాసులు సైతం గ్రామ శ్రమ వేడుకలో పాల్గొనరా?
భాగ్యనగరం నివాసి వల్లభనేని వీరేంద్రకుమారుని స్వచ్ఛ సుందర ప్రతిజ్ఞలు అక్కడి ప్రజలు విని, అవగాహన చేసుకొందురా లేదా?
DRK గారి సమీక్షా హిత వచనాలనూ వినే ఉంటారు కదా!
రేపటి మన కార్యక్రమం మళ్లీ బాలాజీ భవన విభాగాల నుండే మొదలగునని తెలుసుకొనే ఉంటారు!
ఎన్ని పాటలను పాడాం?
“పచ్చదనం పెరుగుతుంటె పరిశుభ్రత వెలుగొందితె
శ్మశానాలు, బడులు, గుడులు, పబ్లిక్ స్థలములు, వీధులు
కన్నుల విందొన గూర్చుచున్న ఊరె స్వర్గం” అని
ఎన్నెన్ని కవిత్వాలు వ్రాసి-ఎన్ని పాటలను పాడాం?
- ఒక స్వచ్ఛ కార్యకర్త
14.11.2026