4024* వ రోజు.....

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఎందుకు వాడాలి?

నేటిది (సోమవారం 23-11-26) 4024* వ శ్రమ పండుగ!

               అది పండగే అని అంగీకరిస్తే ఆ సమీపంలో నివసించే సుమారు రెండు మూడు వేల మందిలో పట్టుమని 10 మందైనా వచ్చి పాల్గొనాలి! లేదు - చల్లపల్లి, రామానగరం, శివరామపురం గ్రామాల నుండి దూరదూరాలు – ప్రయాణించి వచ్చిన 25 మందే ఆ 150 గజాల బెజవాడ దారిలో ఉపక్రమించారు!

               వేడుక కాలం షరామామూలే - వేకువ 4:19 – 6:12 & 6:40 కూడ! ప్రాత పాఠకులు కాక - క్రొత్త చదువరులు ఇప్పుడు నేను వ్రాస్తున్నది చదివితే – “ఇదేంటి? పండగో, వేడుకో – దాన్ని జరుపుకోవలసింది గ్రామంలో కదా? చక్కగా ప్రాతఃస్నానమొనరించి, క్రొత్త బట్టలేసుకొని, కొండొకచో వేట పోతుల్ని సైత౦ బలిచ్చి, పూజలూ – ప్రార్ధనలూ జరపాలి గదా?

* మరి ఇదేం పండగ - ఒకాయన బాట పడమటి కంపుగొట్టే మురుగు కాల్వలో నుండి దిక్కుమాలిన క్రుళ్లు పదార్థాలు బైటకు లాగుతాడు? వాటిని ఏ మాత్రం చీదరించుకోకుండా నలుగురు డిప్పల్తో మోసి, ట్రాక్టర్లో నింపుతారు?

* అటు చూస్తే ఆ చీకటి వేళ చెట్టెక్కి ఒక కాలు సన్న కొమ్మ మీద మోపి, బ్యాలెన్స్ చేసుకొంటూ మరరంపంతో సర్కస్ మనిషి లాగా ఒకాయన కరెంటు తీగల్లో చొరబడిన కొమ్మల్ని కోసేస్తున్నాడు, మరో పురచేతి పెద్దాయన సహకరిస్తున్నాడు?

* ఆ కొమ్మల్ని దూరంగా లాగుకు పోయి, ఇద్దరు వాటిని ఖండఖండాలు చేసి, షెడ్డర్ నోట్లో పట్టే సైజులు చేసి, ప్రోగులు పెడతారెందుకు?

* మరికొందరు తమ ఇళ్లకు 3-4 కిలోమీటర్ల దూరాన, గ్రామ శ్మశానవాటిక సమీపాన చీపుళ్లతో ఊడ్వకపోతే ఏమీ తోచదా?

* “ఈ 79 ఏళ్ల పెద్దలూ, 67 ఏళ్ల బృందావన్ అపార్ట్మెంట్ సుధాకరుడూ తగుదుమమ్మా అని, 4000 రోజులుగా జరుపున్న పండుగ ఇదేనా? మేమింకా ఏదో అనుకొన్నా మే”.... అని సందేహిస్తారేమో!

               ఔను! మా చల్లపల్లికి 12-13 ఏళ్ళ నుండి ఇతర పండుగ - పబ్బాలతో బాటు నిర్విరామంగా జరుగుతున్న శ్రమదాన పండుగ ఇదే మరి! ఈ క్రొత్త రకం పండగ కోసమే ఊళ్లోని 150 కి పైగా కార్యకర్తలు సిద్ధంగా ఉంటారు! ఇది లేనినాడు ఇందులో కొందరు దిగులు పడతారు కూడ!

               పాఠక మిత్రులారా! ఈ వేడుకే దేశవిదేశీయులు ప్రశంసించే చల్లపల్లిలోని ఇన్ని మంచి మార్పులకు మూలకారణం!

               6.20 నుండి తరిగోపుల ప్రాంగణంలో జరిగిన వీళ్ల సభను సజ్జా ప్రసాదు గారు నినాదాలతో ప్రారంభిస్తే,

               కంటంనేని నరహరి, చలసాని శ్రీలక్ష్మి గార్ల 60, 000/- విరాళాన్ని,

               అడపా రాంబాబు, అడపా గురవయ్య గార్ల 38,050/- విరాళాన్ని DRK గారు ప్రస్తావించారు.

               రేపటి శ్రమ వేడుక కోసం అందరూ బెజవాడ బాటలోని కాటాల వద్ద కలవాలని నిర్ణయించారు!

               పుణ్యం అనిపించిందా?

“మీ-మా కోసమె కాదా స్వచ్ఛ కార్యకర్త లెంతో

చొరవ చేసి, వీధులూడ్చి, చెట్లుపెంచుతున్నా” రను

ఇంగితం నశించిందా - ఇన్నేళ్ల శ్రమ మొత్తం

బూడిద పాల్జేయడమే పుణ్యం అనిపించిందా?

- ఒక స్వచ్ఛ కార్యకర్త

   23.11.2026