నా గ్రామ స్వచ్ఛ శుభ్రతలకు హామీగా వెంకటేశ్వర చతుష్టయం!....           23-Jan-2026

 నా గ్రామ స్వచ్ఛ శుభ్రతలకు హామీగా వెంకటేశ్వర చతుష్టయం!

                                                            - నాదెళ్ళ సురేష్, 11.01.2026

               ఒకప్పటి మాయాబజార్ చిత్రంలోని ‘దుషట చతుషటయం కాదిది. పాతిక వేల జనాహ్లాదానికై చిత్తశుద్ధితో ప్రతి బ్రహ్మకాలంలోనూ పాటుబడే స్ఫూర్తిదాయక సాహసిక శ్రామిక చతుష్టయం! వాళ్ల నేపధ్యాలూ, సమయానుగుణ సత్ పరివర్తనలూ గమనిస్తే :

1. గంధం వెంకటేశ్వరుడు:

               నిర్జీవ వృక్షకాండాలను మనం నిత్య జీవితంలో వాడుకునే సజీవ – నయన మనోహర గృహోపకరణాలుగా మలిచే సృజనశీలి. తన వృత్తిలో గాని, స్వచ్ఛ సైనిక ప్రవృత్తిలో గాని సంపూర్ణుడు. ఐతే ఈయన వేకువ స్వచ్ఛ సేవల హజరు మరికొంత పెంచుకోవాలని మాలాంటి వారి విన్నపం.

               ఎప్పుడు శ్రమదానంలోకి దిగేదీ - మానేదీ చెప్పలేం గాని, వచ్చాడంటే మాత్రం ఆ పట్టుదలా, అంకితభావం చూసి తీరవలసిందే!

2. రామా యాక్స్ వెంకటేశ్వరులు:

               ఊళ్లో పేరెన్నికగన్న దర్జీ కళాకారుడు, ఈయన గ్రామసేవల వయసు ఒక సంవత్సరమే గాని, తన పట్టుదలతో సుదీర్ఘ సేవామూర్తులతో సమంగా ఎదిగాడు. కార్యకర్తలకు మంచి డిజైన్లతో చక్కని గుడ్డ సంచులు పంచడం ద్వారా పర్యావరణ ప్రగతికారకుడు! మంచి క్రొత్త కార్యకర్తల్ని కనిపెట్టి, శ్రమదానం ముగ్గులోకి లాగుతుంటాడు!

               సొంత పెను సమస్యల్ని ఖాతరు చేయక గ్రామ సమాజం కోసం ఎలా పాటుబడాలో ఈయన్ని చూసి నేర్చుకోవచ్చు!

3. తూము వెంకటేశ్వర సుప్రభాతం:

               రెవిన్యూ విభాగంలో మెట్లెక్కుతూ ఉద్యోగరీత్యా గ్రామాంతరం

బాటపట్టినా, చల్లపల్లి ప్రాభాత ప్రాంగణ శ్రమదానగుణం ఈయనను వదలదు గాక వదలదు; పొరుగూరు యార్లగడ్డలో ఉద్యోగిస్తూ ఆ గుణాన్ని అక్కడి మంచి మనుషుల కంటించి, వేయి రోజుల పాటు స్వచ్ఛ పతాకం రెపరెపలాడించిన ఘనుడు!

               బందరు కలెక్టరేటులో నైనా ఈయనది శ్రమదాన అభ్యాసమే! మరికొంతకాలం, యార్లగడ్డలో ఉంటే ఆ ఊరు మరో స్వచ్ఛ - సుందర చల్లపల్లై ఉండేదే! గ్రామ సౌందర్యారాధనమనే జబ్బు ఎవరి నుండి ఎవరికంటుకొన్నదో గాని, ఇందిరా వెంకటేశ్వరులిద్దరూ ఒకరికొకరు తీసిపోని స్వచ్ఛ సుందర కార్యకర్తలే!

4. కోడూరు/ చెక్ పోస్టు వెంకటేశ్వరుని సేవల సందడి:

               70 ఏళ్ళు దాటినా ఈయన సామాజిక బాధ్యతా వ్యసనం పెరుగుతున్నదే గాని తగ్గడం లేదు! ఎక్కడ అదలింపులూ, పనికేకలూ చెలరేగునో - అక్కడ ఈ కోడూరు కత్తి - దంతె సేవలుండును! నిశ్శబ్దంగా వీధి కాలుష్య సమరం చేయడం ఇతనికి గిట్టదు! ఈ మధ్య కార్యకర్తల శ్రమదానం మీద ఆశువుగా పాటలూ, సోకాల్డ్ పద్యాలు విసరడం గమనించాను! స్వచ్ఛ సేవల సుదూర స్థలానికి వెళ్లేందుకు కాళ్లనో సైకిలునో నమ్ముకుంటాడు!

మన స్వచ్ఛసారథి ఈ చల్లపల్లికి వరం! ఈ పదేళ్ళ శ్రమదానమే లేకపోతే ఎప్పుడో టపాకట్టే వాడిని..” అనేది ఈయన ఉవాచ! టంచనుగా నెలనెలా ఊరి మేలు కోసం ఇతని చందా అందుతుంటుంది. మైకు పని చేయనపుడు ఈ కంఠమే నినాదాలను గర్జిస్తుంటుంది!

(కొసరుగా) మరో వక్కలగడ్డ వెంకటేశ్వరరావు:

               ఈ నడుమ కొంత రెగ్యులారిటీ తగ్గింది గాని, మరో వక్కలగడ్డ వెంకటేశ్వరుడు స్థానిక RMP ఆస్పత్రి కాంపౌండరు. మోకాలి నొప్పి పెరిగీ, ఇతర కొన్ని కారణాలతో తన స్వచ్ఛంద శ్రమదానానికి పరిమితులు విధించుకొన్నాడు. వచ్చినప్పుడు మాత్రం నిశ్శబ్దంగా గుట్టల కొద్దీ గడ్డినీ, పిచ్చి మొక్కల్నీ నరికి ప్రోగులు పెడతాడు! మళ్లీ త్వరలో చురుకైన క్రియాశీలక కార్యకర్తగా ఈయన్ను చూడగలమనే నా నమ్మకం!