స్వచ్ఛ చల్లపల్లి రూపకల్పనలో శ్రీను షష్ఠకం!
- సురేష్ నాదెళ్ళ (USA), 10.01.2026
“Rome was not built in a day ”(రోమ్ నగర నిర్మాణం రాత్రికి రాత్రే జరిగిపోలేదు) అంటారు. అలాగే స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం కూడా ! పన్నెండేళ్లుగా నిర్విఘ్నంగా విజయవంతంగా ప్రదర్శితమౌతున్న ఈ నాటకంలో వందలాది పాత్ర ధారుల్లో 6 గురు శ్రీనుల నిర్వహణను పరిశీలిద్దాం!
1) కస్తూరి శ్రీను:
గారిది కీలక పాత్ర - క్షేత్ర స్థాయిలో పాతిక మంది ట్రస్టు ఉద్యోగుల దైనందిన పర్యవేక్షణ ఇతనిదే! కావాలంటే రెస్క్యూ టీములో దూరి ఎంతటి పని బరువైనా మోస్తాడు, ఆ తరువాత ట్రస్టు కార్మిక వ్యవస్థని నడిపిస్తాడు; ఊరి వీధుల్లో గాని, శ్మశానాల్లో గాని, చుట్టూ రహదార్లలోగాని - ఎక్కడ, ఎప్పుడే పని ఏ షిప్ట్ లో, ఎవరిచేత రాబట్టాలో నియంత్రిస్తాడు. ఒడుపూ- లౌక్యమూ - టైమ్ సెన్సూ ఉంటే తప్ప ఈ బాధ్యతలు నెరవేరుతాయా? ఏతా-వాతా ఈ శ్రీనుడు ట్రస్టు కార్మిక రధానికి ఇరుసు అన్నమాట!
2) నందేటి శ్రీను:
నందేటి శ్రీను, ఘంటశాల శ్రీను, పాటల శ్రీను అనే మూడు పేర్లూ ఒక్కరివే! అలాగే ఈ శ్రమదాన జగన్నాటకంలో ఇతనిది త్రిపాత్రాభినయం! ఆస్పత్రి ఉద్యోగుల పర్యవేక్షక పాత్ర, కూని రాగాలు తీస్తూనే అలవోకగా స్వచ్ఛ సైనిక పాత్ర, ఠంచనుగా కాఫీ పంపిణీ పాత్ర అన్నమాట! ఒకప్పుడైతే ఈయన కంఠం ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష ఉద్యమాలలో వినిపించేది గాని - ఇప్పుడు మాత్రం కృష్ణాజిల్లా లో సగం చోట్ల మ్రోగుతుంటుంది!
DRK గారి సమీక్షా సమావేశంలో ఈయన గీతాలాపన లేకపోతే కార్యకర్తలు ఊరుకోరు. వట్టి గాయకుడు కాదు – గట్టి వాగ్గేయకారుడు!
3) మెండు శ్రీను :
పోస్టల్ శ్రీను అనబడే మెండు శ్రీను దైతే ఆర్భాటం లేని నిశ్శబ్ధ శ్రమదానం! ఎక్కడ ఏ పనిలో దిగినా తదేక దీక్షతో పూర్తి చేయడమే తన నైజం ! “చెడు వినకు - చెడుకనకు – చెడుచేయకు” అనేతత్త్వం! ‘వచ్చామా – శక్తి వంచన లేకుండ శ్రమించామా-నిశ్శబ్దంగా వెళ్ళి, పెందలకడ ఉద్యోగ విధి నిర్వహించామా’- అన్నట్లుగా అతని ప్రవర్తన! దైనందిన శ్రమానంతర సభలో స్వచ్ఛ చల్లపల్లి బ్యానర్ ఇతడు పట్టుకుంటేనే నిండుగా ఉంటుంది!
అన్నట్టు – 2016 లో శివరాంపురం దగ్గర నాకు ఈ శ్రమదాన కార్యక్రమాన్ని పరిచయం చేసింది ఈ శ్రీనివాసుడే!
4) వేముల శ్రీను:
స్థానిక విజయా కళాశాల పౌర శాస్త్రోపన్యాసకుడు. కత్తి పట్టి, రహదార్ల చెత్తా- గడ్డీ- పిచ్చి- ముళ్ళ మొక్కల్ని చెండాడుటలో గాని - చెత్త లోడింగులో గాని- చీపురు పనికి గాని- సంసిద్ధుడే ఐనా - దంతెతో చెత్త లాగడంలో సిద్ధహస్తుడు. కాస్త నిండైన విగ్రహం! తన కళాశాల నుండి యాజమాన్యం పనుపున విద్యార్ధుల్ని స్వచ్ఛ సేవకు తీసుకుని వస్తుంటాడు.
5) నల్లూరి శ్రీను:
ప్రతి వేకువా కాక- వంతుల వారీగా స్వచ్ఛ సేవకు వస్తుంటాడు గాని, గ్రామ సేవలలో తక్కువ వాడేంకాదు. లాబ్ టెక్నిషియన్ గా చిరపరిచితుడు, వైద్య శిబిర బాధ్యతా భార వాహకుడు, గట్టి స్వచ్ఛ సైనికుడు!
పద్మావతి ఆసుపత్రి -సిబ్బందికుండే అణకువా - పని నిపుణతా ఈయనకూ ఉన్నాయి!
6) ఆఖరుగా షణ్ముఖ శ్రీను:
ఇతని కార్యాచరణను చూస్తుంటే స్వచ్ఛ సుందరోద్యమ ఆంతర్యానికి అతికినట్లు సరిపోతున్నది! మన ఉద్యమ సారథి ఎప్పుడే క్రొత్త సూచన చేసినా అది ఈయన తక్షణం అమలు చేసి చూపుతాడు! ట్రస్టుకూ, ఇతరత్రా వీరి వితరణలు కూడా గమ్మత్తుగానే ఉంటాయి! అటు ఆధ్యాత్మికతా, ఇటు వాస్తవ జీవికతా మన షణ్ముఖుని ప్రత్యేకత! వేకువ సేవలు సరే - ఇతర సమయాల్లో కూడా ప్రజలకు ఉపయోగపడే రకరకాల సేవలు ఈయన బుర్రలో తళుక్కున మెరవడమూ – ఇద్దరు ముగ్గురితో చర్చించి అమలుపరచడమూ ఈయనకలవాటు!