ప్లాస్టిక్ నీళ్ల సీసాలను కొనడం మానేద్దాం.....           15-Jul-2019

ప్లాస్టిక్ నీళ్ల సీసాలను కొనడం మానేద్దాం.

 

          ఈ రోజు ఉదయం 4.30 కు మన స్వచ్చ కార్యక్రమం మొదలు పెట్టడానికి సెంటర్ కు వెళ్లాము. వర్షపు నీటితో సెంటర్ అంతా నిండిపోయిఉంది. డ్రైన్లపై ఉన్న బండలను తీసి డ్రైన్లను చూడగా అవి ప్లాస్టిక్ సీసాలు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ కారీ బ్యాగులు, టీ కప్పులు, కొబ్బరి బోండాలతో నిండిపోయి ఉన్నాయి. వాటన్నిటిని బయటకు తీయగానే డ్రైన్లలోని మురుగు పారి రోడ్ల మీద ఉన్న నీరు డ్రైన్లలోకి వెళ్లిపోయినాయి.

 

          కొన్ని సంవత్సరాల క్రితం విజయవాడ వన్ టౌన్ మొత్తం మురుగు నీటితో నిండిపోయింది. దానికి కారణం క్యారీ బాగులు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ సీసాలతో డ్రైన్ గొట్టాలు(6 అడుగుల తూములు అయినప్పటికీ) నిండి పోవడం.

 

          ప్రతి రోజూ ప్రపంచంలో కొన్ని కోట్ల ప్లాస్టిక్ నీళ్ళ సీసాలను వాడుతున్నాము. వీటిలో రీసైకిల్ కోసం వెళ్ళేవి చాలాచాలా తక్కువ. రోడ్ల ప్రక్కన, డ్రైన్ల లోనూ, కాలువలలోనూ, ఊరి బయట పారవెయ్యడం మనకున్న అలవాటు. ప్లాస్టిక్ నీళ్ళ సీసాలు భూమిలో కరగడానికి 400 సంవత్సరాలు పడుతుంది.  

         

          కనుక మనమందరం మంచినీళ్ళ కోసం సీసాలు కొనడం మానేద్దాం. స్టీలు సీసాలు గాని, రాగి సీసాలు గాని, గాజు సీసాలు గాని వాడదాం. ఇవైతే మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు రీసైకిల్ చెయ్యవచ్చు. ఇప్పటికే మనదగ్గర కొన్ని Pet బాటిల్స్ ఉంటే అవి పాడయ్యే వరకు వాడి ఆ తరువాత కొత్తవి కొనవద్దు. ఫ్రిజ్ లో పెట్టుకోడానికి గాజు సీసాలు, స్టీలు సీసాలు, రాగి సీసాలు  వాడుకోవచ్చు. ప్రయాణాలలో స్టీలు, రాగి సీసాలను మనతోపాటు తీసుకెళ్లవచ్చు.  

 

- డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

చల్లపల్లి,

15.07.2019.