సాగిపో ముందుకే స్వచ్చ సైనికుడా!
మడమ త్రిప్పని దీక్ష / మరికొంత సహనంతొ సాగుమునుముందుకే స్వచ్చ సైనికుడా!
స్వచ్చ స్ఫూర్తిని నింప పంచ వర్షాలుగా/ స్వచ్చ సైనికుడవై పాటుబడుతున్నావు.
ప్రతికూల పవనాల ప్రస్తావనలు లేని / స్వచ్చోద్యమం నేడు సాధ్యపడుచున్నాది.
జనంలో మరి కొంత స్వచ్చ స్పృహ రగిలితే / ప్రజలు ఉమ్మడి బాధ్యతకు నడుం కట్టితే
మనకోసమికమనం మహిత కృషి జరిపితే / మన సమాజానికది సందేశమిస్తాది.
మడమ త్రిప్పని దీక్ష - మరికొంత సహనంతొ
సాగుమునుముందుకే స్వచ్చ సైనికుడా!
నీ ఉద్యమం వృధా కాదు స్నేహితుడా!
ఇటు ఘంటశాలలో - నాగాయలంకలో/ కోడూరులో - యార్లగడ్డ వంటి చోట్ల
నీ స్వచ్చ బావుటా నింగిలో ఎగిరింది / నేడొ రేపో మాపో నిఖిల జగమంతటా /
స్వచ్చ శుభ్రతఏలు సమయమొకటొస్తాది - ప్రజల స్వస్తత గెల్చు బాట కనుపిస్తాది
సౌందర్యమయ రసాస్వాదనకు ప్రజలెల్ల / ఎదురు తెన్నులు చూచు తరివచ్చునందాక
మడమ త్రిప్పని దీక్ష - మరికొంత సహనంతొ
సాగుమునుముందుకే స్వచ్చ సైనికుడా!
నీ ఉద్యమం వృధా కాదు స్నేహితుడా!
బహిరంగ మల విసర్జనలు మాన్పించావు / మరుభూములను పూల తోటలుగ మార్చావు
మురుగు కాల్వల రొచ్చు చేతితో ఎత్తావు / రహదారి వనములతొ బస్టాండు మిసిమితో
స్వచ్చ సుందర భావనలు వ్యాప్తి చేశావు / ఊరునే నందనంగా మార్చుతున్నావు
నీ అడుగు జాడలే నేటి మేలిమి బాట / నీ శ్రమకు జోహారు నిత్య శ్రామికుడా
మడమ త్రిప్పని దీక్ష - మరికొంత సహనంతొ
సాగుమునుముందుకే స్వచ్చ సైనికుడా!
నీ ఉద్యమం వృధా కాదు స్నేహితుడా!
ప్లాస్టిక్ రహితమైన పర్యావరణమునకు / పచ్చ పచ్చని చెట్ల ప్రాణవాయువులకు
అన్ని దారుల్లోన ఆహ్లాదకరమైన / రంగు రంగుల పూల బాలికల పెంపునకు
వేల మొక్కలు నాటి-పూల తోటలు సాకి / నీ గ్రామ సౌభాగ్య సౌజన్య సాధనకు
మడమ త్రిప్పని దీక్ష / మరికొంత సహనంతొ
సాగుమునుముందుకే స్వచ్చ సైనికుడా!
నీ ఉద్యమం వృధా కాదు స్నేహితుడా! “మడమ త్రిప్పని దీక్ష”
- నల్లూరి రామారావు
స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త,
చల్లపల్లి – 05.12.2019