భళిర స్వచ్చ సైనికా!....           10-Mar-2020

భళిర స్వచ్చ సైనికా! చల్లపల్లి సేవకా!

మాతృభూమి ఉన్నతికై – మహోదాత్త పుత్త్రకా!

                                         11 భళిర స్వచ్చ సైనికా 11

కాలుష్యం ఊరి పైన కాలు దువ్వుతున్నప్పుడు

గ్రామంలో శుభ్రత అడుగంటి – జబ్బులెన్నొ ముసిరి

నీ సోదర గ్రామస్తులు నీరసించి పోవునపుడు

ఎవరెవరోరావాలని – మనలనుద్ధరించాలని

ఎదురు చూడలేదు నీవు – నీ శ్రమనే నమ్మినావు - నీ శ్రమనే నమ్మినావు

                                         11 భళిర! స్వచ్చ సైనికా – చల్లపల్లి సేవకా!

                                         మాతృ భూమి మెరుగుదలకు మహోదాత్త పుత్త్రకా11

ఇంత పెద్ద గ్రామంలో – ఇన్ని రొచ్చు గుంటలలో

వందలాది వీధులలో – అంతులేని చెత్తలతో

రోడ్ల మురుగు గుంటలతో – మలమూత్ర విసర్జనతో

అస్తవ్యస్తమైన గ్రామ మంతటినీ చక్కదిద్ది

లోక మెల్ల మెచ్చదగిన కృషి కొనసాగిస్తుంటివి

                                         11 భళిర! స్వచ్చ సైనికా – చల్లపల్లి పుత్త్రకా!

                                         మాతృగ్రామ మేలిమికై - మహోదాత్త సేవకా 11

జీతభత్యములు నీవసలేనాడూ ఆశించవు

నీ నిస్వార్ధ కృషిలో ఎవరి మెప్పు కోరబోవు

అసలు నాది సేవ కాదు – బాధ్యత” అని ప్రకటిస్తవు

ఊరుమ్మడి ఆరోగ్యం ఆనందం సాధిస్తవు

ఇదెగద నిష్కామ కర్మ – ఇదెనీ ఆత్మానందం

                                         11 భళా! స్వచ్చ సైనికా – మాతృగ్రామ సేవకా!

                                         చల్లపల్లి మెరుగుదలకు మహోదాత్త పుత్త్రకా11

శ్మశానాలు – బస్టాండులు – రహదారులు – ఆఫీసులు

కర్మకాండ భవనములు – ఖాళీ మట్టి దిబ్బలు

ఒకటొకటిగ తీర్చిదిద్ది – పుష్ప – హరిత మయం చేసి

పందొమ్మిది వందల డెబ్బది రోజులు పైగా నీ

ఊరి కొరకు పాటు బడి ఉన్నతికై తపించావు

                                                                        11 భళిర స్వచ్చ సైనికా – చల్లపల్లి సేవకా!

                                         ఉన్నఊరు శుభ్రతకై - మహోదాత్త పుత్త్రకా11

ఆదివారములు వస్తే – ఆనందంతో బాటుగ (ఆలాపనా)

పిన్నలు – పెద్దల మదిలో – విద్యార్ధులుపాధ్యాయులు

గృహిణులందు స్వచ్చ స్పృహ రగిలించగ పాటు బడుచు

స్వచ్చోద్యమ భావనలిక శాశ్వతమై నిలుచునట్లు

ఆహరహమూ శ్రమించావు – అద్భుతముగ నటించావు - అద్భుతముగ జయించావు

                                                                        11 భళా! స్వచ్చ సైనికా – మాతృ గ్రామ రక్షకా

                                         చల్లపల్లి సేవలలో – సాహసించు పుత్త్రకా11

నీ సహనం – నీ దీక్ష – పట్టుదల – ప్రగతి బాట

సృజన శీల గ్రామసేవ చరితార్ధములై నేటికి

పాతిక గ్రామాలలోనస్వచ్చ కేతనం ఎగిరెను

గ్రామాలకు సమయ – శ్రమ దానాలై వెలుగొందెను

మాన్యుడవై – ధన్యుడవై – మహనీయుడవై పోతివి

                                         11 భళా! స్వచ్చ సైనికా – స్వస్తత పరిరక్షకా!

                                         మాతృభూమి మెరుగుదలకు – మహోదాత్త పుత్త్రకా! 11

నీ కృషితో ఈగ – దోమ నీరసించి పోతున్నవి –

కాలుష్యపు అనకొండలు – కరిగి పారిపోతున్నవి –

పచ్చదనం నిండి ఊరు పరవశించి పోతున్నది –

పర్యావరణం తృప్తిగ – బ్రతికి బట్ట కడుతున్నది

మాన్యుడివై – ధన్యుడివై – మహనీయుడివై బ్రతికిన

                                         11 భళా! స్వచ్చ సైనికా – చల్లపల్లి రక్షకా

                                         ఉన్నఊరు స్వస్తతకై – మహోదాత్త పుత్త్రకా! 11

ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు వదిలేస్తివి

ఫ్లెక్సీలను మాన్పి హరిత వేడుకలను జరిపిస్తివి

సంతలలో ప్లాస్టిక్కులు చాల వరకు తగ్గిస్తివి

ముందు తరాలకు గొప్ప ప్రబోధాత్మక కృషి చేసిన

ఓ మాన్యుడ! ఓ ధన్యుడ! మహనీయుడ! ఆదర్శుడ!

                                                                        11 భళిరా! స్వచ్చ సైనికా – చల్లపల్లి సేవకా

                                         సొంతఊరు రక్షణలో– మహోదాత్త పుత్త్రకా! 11

 

నల్లూరి రామారావు, చల్లపల్లి

ఏప్రియల్ – 2020.