పొనమాల చిన్నబ్బాయి....           10-Jun-2020

 2000 దినాల స్వచ్చోద్యమ చల్లపల్లి సేవా తరంగాలు -

కార్యకర్తల స్వానుభవ జ్ఞాపకాల పరంపర 37

2038  దినాల స్వచ్చోద్యమ దీక్షకు ఈ పొనమాల ప్రణామాలు!

అయ్యా! నేను పొనమాల చిన్నబ్బాయిని. 58 ఏళ్ల వయసు, 30 ఏళ్ల సర్వీసు, మోపిదేవి మండలం కోసూరివారిపాలెం ప్రాధమిక ఏకోపాధ్యాయ పాఠశాలకు నేనే రాజును - నేనే మంత్రిని. మోపిదేవి నివాసిని. చాలా కాలంగా చల్లపల్లితో - అక్కడి జనవిజ్ఞానవేదికతో - అది నిర్వహించిన అవగాహనా సమావేశాలతో - 216 మాసాలుగా దాని ఆధ్వర్యంలో సాగుతున్న వైద్య శిబిరాలతో - గత ఐదారేళ్లుగా వందలాది కార్యకర్తల స్వచ్చ - సుందర ఉద్యమంతో అవినాభావ సంబంధం కలవాడిని. ఏ నాలుగు వందల రోజులో చల్లపల్లికి స్వచ్చోద్యమంతో కలిసి నడిచిన వ్యక్తిని. ఈ మధ్య కొన్నాళ్లుగా చల్లపల్లి కి నా శ్రమదాన బాంధవ్యం కొంత తగ్గినా - నాకు సైతం స్వచ్చ ఉద్యమ ప్రమేయం కలదనుచు చెప్పే హక్కు కలదని నమ్మేవాడిని!

 

            ఈ స్వచ్చంద శ్రమదాన వైచిత్రి ఎలాంటి దంటే – నా చేత ఇది రోడ్లు ఊడ్పించింది, డ్రైన్లు వెల్ల వేయించింది. శ్మశానాలు బాగుచేయించింది. వందలాది చెట్లు నాటించింది. సోదర స్వచ్చ కార్యకర్తలతో కలిసి 25 వేల జనం, 5 వేల నివాస గృహాలు కల చల్లపల్లిని స్వచ్చ – శుభ్ర – హరిత సౌందర్యాలపరంగా సమూలంగా మార్పు చేయించింది! నాలో ఎంత ప్రేరణ కలిగించకపోతే – ఉత్సాహం నింపకపోతే ఆరేడు కిలోమీటర్ల దూరంలోని మోపిదేవి నుండి వేకువ జామునే చల్లపల్లి చేరుకొని, శ్రమదాన రీతుల్లో క్రొత్త పోకడలు పోయాను?

 

            అప్పటి కింకా చల్లపల్లి స్వచ్చ కార్యకర్తలు సాధారణ కత్తులు, సాదాసీదా దంతెలే వాడుతుంటే – ఎత్తైన గడ కర్ర కత్తుల్ని, పెద్ద సైజు నాలుగు పళ్ల దంతెలనీ రూపొందించింది నేనే! దూరంనించి చూసిన స్వచ్చ మిత్రులు నన్నేదో కల్లు గీత కార్మికుడని ఆట పట్టించే వారు. వేకువనే ప్రతి దినమూ ఇందరు రకరకాల నేపధ్యాల అనుంగు మిత్రుల్ని కలవడం, నిస్వార్ధంగా ఊరి కోసం సమష్టి శ్రమదానం సుదీర్ఘకాలంగా నిర్వహించడం ఆలోచిస్తే దీనికిదే ఒక అద్భుతం! అందుమూలంగా చల్లపల్లి గ్రామంలోను, జనంలోను వచ్చిన సానుకూల మార్పులకు ఈ ఊరిలో ప్రతి అంగుళమూ సాక్ష్యం!

 

            ప్రతి రోజూ వేడుకగా జరిగే ఈ ఉషోదయ సందడిలో అసలు లేనిదేమున్నది? వీరిలో కత్తి వీరులున్నారు, వేల కొద్దీ పూల మొక్కల పెంపకం దారులున్నారు, కవులున్నారు, గాయకులున్నారు, డాక్టర్లు, మేధావి వర్గం వాళ్ళు, గృహిణులు, వృత్తి నిపుణులు, కుల మత వర్గ భేదాల మతి మరుపు మనుషులున్నారు. ఏ అవలక్షణాలు లేని, యధాశక్తిగా ఊరి కోసం పాటుబడుదామనుకొనే అరుదైన విలక్షణ బృందం ఇదే. కనుక నా అభిలాష ఏమంటే - వీరి ఐక మత్యం ఎప్పటికీ కొనసాగాలి! చల్లపల్లి, దాని ఉదాహరణతో వందలాది గ్రామాలు అర్ధవంతమైన శ్రమదానానికి దిగాలి! ఎవర్నో దేబిరించక ఊళ్ళన్నీ ఆ శ్రమదానంతో స్వయం సమృద్ధాలు కావాలి! ఈ స్వచ్చోద్యమం అసలైన స్ఫూర్తి దేశమంతా సంచరించాలి! అసలివన్నీ నా అత్యాశలుగా మిగిలిపోక అనతి కాలంలోనే రుజువు కావాలి! అప్పుడిక మన పూజ్య జాతిపిత ఆత్మ సంతృప్తి చెందాలి!

 

            కొల్లి చక్రపాణి వంటి స్ఫూర్తి దాతల పునరుత్తేజంతో గతంలో మేము 102 రోజులు మోపిదేవిని సంస్కరించడం మరొక మారు పునరావృతం కావాలని కూడ నా కోరిక! చల్లపల్లి స్వచ్చోద్యమానికి అర్ధరూపేణా నేను కొంత బాకీ పడిన మాట నిజం. అంతకు ముందు ప్రతి నెల 500/- చొప్పున చెల్లించేవాడిని. గత ఆరేడు నెలలుగా ఋణపడ్డాను. అరియర్స్ తో సహ త్వరలో తీరుస్తాననీ, మన ప్రియతమ స్వచ్చోద్యమ పతాకం ఎగురుతూనే ఉంటుందనీ ఆశిస్తూ ...

- పొనమాల (58 ఏళ్ల) చిన్నబ్బాయి,

   ఏకోపాధ్యాయుడు, కోసూరివారిపాలెం పాఠశాల

   10/06/2020.