పల్నాటి రాజబాబు....           11-Jun-2020

 2000 దినాల స్వచ్చోద్యమ చల్లపల్లి సేవా తరంగాలు -

 

కార్యకర్తల స్వానుభవ జ్ఞాపకాల పరంపర 38

 

ఆరోగ్యమే మహా భాగ్యం ఆనందమే మహాయోగం.”

అందుకే ఈ 2040 రోజుల స్వచ్చ సుందర యజ్ఞం.


              మన ప్రాచీన చరిత్రలో – సంస్కృతిలో ఇలాంటి యోగ్యమైన స్లోగన్లు చాలా ఉన్నాయి గానీ, అందులో మనం నేర్ఛుకొంటున్నవీ – పాటిస్తున్నవి చాలా తక్కువే నండి! అస్సలు మన సమాజంలో ఉండే హిపోక్రసీ 100 దేశాలకు పంచినా ఇంకా మిగిలిపోతుందేమోనండి! ఇతరులకు చెప్పేందుకైతే ప్రతి వాళ్ళం తయారైపోతామండి; ఆచరణ దగ్గర కొస్తే మాత్రం తూచ్ - తూచ్!

 

            మనమూ, మన ఇల్లు, మన వీధి, ఊరు శుభ్రంగా ఉంటే ఆరోగ్యం మెరుగుపడుతుందనీ, పరిసరాలు అందంగా ఉంటే ఆనందంగా బ్రతకొచ్చనీ – ఏ శాస్త్రవేత్తలో – పెద్ద డాక్టర్లో వచ్చి చెప్పాలా? ఆ మాత్రం జ్ఞానం ఉన్నా సరే – ఎంత మందిమి పాటిస్తున్నాం? పంచాయితీ మీదకో, ప్రభుత్వం మీదకో ఆ బాధ్యతలు తోసేసి, ఎవరెవర్నో విమర్శిస్తాం! కేవలం ఎదుటి వాళ్ళకి మాత్రం చెప్పే నీతి సూత్రాలు, విమర్శలు శబ్ద కాలుష్యం పెంచడానికే తప్ప ఎందుకు పనికి వస్తాయి?

 

            అదృష్టవశాత్తూ నా చదువు పూర్తయ్యేటప్పటికే చల్లపల్లిలో హేతుబద్ధంగా ఆలోచించే వామపక్ష భావాలు, చెప్పినదాన్ని ఆచరించడానికి ప్రయత్నిస్తున్న జనవిజ్ఞాన వేదిక ప్రభావాలు సరిపడా ఉన్నాయి. విద్యార్ధి దశలో SFI సంపర్కం ఉండేది. అన్నిటిని మించి డాక్టర్ డి. ఆర్.కె. ప్రసాదు లాంటి నిజాయతీపరుల పరిచయం కలిగింది. పాతికేళ్ళకు పైగా జనవిజ్ఞాన వేదిక తో పూర్తి సంబంధం నా ఆలోచనలను గాడిలో పెట్టింది.

 

            ఈ 49 ఏళ్ల పల్నాటి రాజబాబు 35 వ రోజు నుండి చల్లపల్లి స్వచ్చ ఉద్యమం లో అనివార్యంగా పాల్గొన్నాడంటే – దాని వెనక ఇంత కధ ఉన్నది మరి! ఉద్యోగ బాధ్యతో, ప్రయాణకారణమో- ఏదున్నా అప్పటి దాక పాల్గొనకపోవడం క్షంతవ్యం కాదు. ఈ స్వచ్చ సైనికుల గ్రామయాత్ర నా వీధి దాక నేను లేకుండానే జరిగిందంటే – దానికెంత సిగ్గు పడిపోయానో నాకే తెలుసు! ఐతే – ఇక అప్పటి నుండి మాత్రం సంవత్సరాల తరబడీ ఈ ఉద్యమానికి అతుక్కుపోయాను. మురుగు గుంటలో దిగటానికీ – ట్రాక్టర్ ఎక్కి, నానారకాల వ్యర్ధాలు సర్దడానికీ ముందే ఉన్నాను. నా కూతురు కీర్తి కూడ కొన్నాళ్లు శ్రమదానంలో పాల్గొన్నది. వేరేచోట చదువు కోసం ఉండి ఉదయాన ఫోన్ చేసినప్పుడు నేను ఎత్తితే – “ఏంటి నాన్నా! ఈరోజు స్వచ్చ సేవకు పోలేదా?” అని ప్రశ్నించేది.

 

            ఏం చేస్తాను! ఆరోగ్యశాఖలో అటూ – ఇటూ కాని ఉద్యోగిని. ఒక్కో సారి వేకువనే డ్యూటీలు! ఏదో – ఒకటి రెండు మార్లు 500/- విరాళాలు తప్ప – ఆర్ధికంగా స్వచ్చోద్యమానికి అండకాలేకపోయాను. అసలు ఈ స్వచ్చ చల్లపల్లి ఉద్యమం పట్ల ఎవరికైనా రెండో (అంటే వ్యతిరేక) అభిప్రాయం ఉంటుందా? ఉంటే ఊరి దురదృష్టం, వాళ్ళ ఖర్మ!

 

            ఐతే - మోహమాటం లేకుండా చెప్పేదేమంటే - దయచేసి, స్వచ్చ కార్యకర్తలు కరోనా సంబంధ జాగ్రత్తలనీ పాటించండి. 60 ఏళ్ళు దాటిన పెద్దలైతే మరింత మెలకువగా ఉండండి. అట్టి వాళ్ళు కొన్నాళ్ళీ పని మానేసినా మంచిదే! ఆరోగ్య శాఖలో పనిచేస్తూ రోగుల పట్ల బాధ్యతలో ముందు వరుసలో ఉండి ఈ విషయం ప్రస్తావిస్తున్నాను. నా గ్రామ మహోద్యమం సమస్త దేశానికీ ఆదర్శమైనందుకు, 30 వేల మంది కోసం బాధ్యత వహిస్తున్నందుకూ గర్విస్తున్నాను. స్వచ్చోద్యమ కీర్తి పతాకాన్ని ఎగరవేయడంలో నా వంతు కృషికి లోపముండదని ప్రకటిస్తూ....

 

- పల్నాటి రాజబాబు

  షాబుల్ వీధి, చల్లపల్లి

       11.06.2020.