అడపా గురవయ్య ....           18-Jun-2020

 2000 దినాల స్వచ్చోద్యమ చల్లపల్లి సేవా తరంగాలు -  

కార్యకర్తల స్వానుభవ జ్ఞాపకాల పరంపర – 42

 

2046 దినాల స్వచ్చోద్యమం గురించి చెప్పాలంటే.....

 

            ఈ చల్లపల్లి స్వచ్చంద శ్రమదానం ఇవ్వాళ అనామకం కాదు, అజ్ఞాతం కాదు పాత్రికేయమిత్రుల సకాల జోక్యంతోను, స్వచ్చ భారత – స్వచ్చాంధ్ర రాయబారుల పలుకబడితోను, సహృదయ వదాన్యుల ఔదార్యంతోను, ఈ అన్నిటిని సమీకరించి, సమతులంగా సుదీర్ఘ ఉద్యమాన్ని నిర్వహిస్తున్న డాక్టర్ దంపతులతోను, 30 కి పైగా గ్రామాల సముచిత అనుకరణలతోను ఇప్పుడు ఇది విశ్వవ్యాప్తమై, ఆలోచనా పరులెందర్నో ఆకర్షిస్తున్నది.

 

            ఏ గొప్ప – మంచి సామాజిక ప్రయోజనకర ఉద్యమమైనా – కొత్తది కావడంతో చప్పున అర్ధం కాక, అనాలోచితుల హేళనలకు గురికావచ్చు. కందుకూరి వీరేశలింగం గారి స్త్రీ విద్య, విధవా పునర్వివాహాలను అప్పట్లో తొలుత మహిళలు కూడ అడ్డుకొన్నారట! కాని, ఒక్కసారి కాలం నిజాలనిగ్గు తేల్చాక – కాస్త వెనకా ముందుగా ఆ నిరోధకులే మంచి ఉద్యమ కారులౌతారు కూడ!

 

            మన చల్లపల్లి స్వచ్చ సుందరీకరణంలో ఎక్కడెక్కడి – ఎందరెందరో తలొక చెయ్యి వేసింది యధార్ధమే గాని, ఈ ఉద్యమ కీర్తి పతాకం దేదీప్యమానంగా వెలుగుతున్నదంటే – ఆ వెలుగులో ఎన్నెన్నో ఊళ్ళు స్వచ్చంద శ్రమదానంతో బాగుపడుతున్నాయంటే – “అన్యధాశరణం నాస్తి – త్వమేవ శరణం మమ...” అని దేశమంతా అనివార్యంగా (చల్లపల్లి) స్వచ్చోద్యమ బాటలోకి ఏదో ఒక సమయానికి రాబోతున్నదంటే – అందుకు ఏకైక కారణం మాత్రం - ఏ కుల మత ప్రాంత వర్గ వైషమ్యాలూ పట్టని స్వచ్చ సైన్య నిరంతర నిశ్చల ఉషోదయ శ్రమదానమనేది జగమెరిగిన సత్యమే!

 

            ఎందరెందరో కవులు – కళాకారులు – గాయకులు – దేశాధినేతలు, సామాజిక వేత్తలు, గాంధీ గారి మనుమలు చల్లపల్లిని దర్శిస్తున్నా రంటే – అందుకు మూలకారణం స్వచ్చ కార్యకర్తల నిరాడంబర నిస్వార్ధ ఆదర్శ శ్రమదానం కాక మరేమిటి? 80 ఏళ్ళు దాటిన కార్యకర్తల నిబద్ధతకు, ఐక్యరాజ్యసమితిని కూడ ఆలోచింపజేసిన నాదెళ్ల సురేష్ భగీరధ ప్రయత్నానికి, ఎన్నిన్ని అవార్డులు - రివార్డులు తప్పనిసరై స్వీకరిస్తున్నా వినయవినమితులయ్యే కార్యకర్తలకు, నేను నా గ్రామం ఏమిచ్చి ఋణంతీర్చుకోవాలి? 28 రాష్ట్రాలలో - 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇలాంటి ఉద్యమాన్ని ఎవరైనా - ఎక్కడైనా చూశారా, విన్నారా? ఆరోగ్యంలో ఒక పెద్ద కుదుపు వచ్చి నేను ప్రస్తుతం ఈ స్వచ్చంద శ్రమదాన వైభవానికి దూరమయ్యాను. మరలా త్వరలోనే – రెండు కత్తులతో – రెండు చీపుళ్లతో ఈ గురవయ్య పునఃప్రవేశం జరిగి తీరుతుంది.   

            “నీకోసం జీవిస్తే నీలోనే మిగులుతావ్

            జనం కోసం బ్రతికితే కాలాన్ని జయస్తావ్!”

            అహ్హహ్హహ్హ........

- అడపా గురవయ్య చల్లపల్లి

                18.06.2020.