కొర్రపాటి వీరసింహుడు....           19-Jun-2020

 2000 దినాల స్వచ్చోద్యమ చల్లపల్లి సేవా తరంగాలు -  

కార్యకర్తల స్వానుభవ జ్ఞాపకాల పరంపర – 43

 

2000 దినాల శ్రమదాన సందడి చల్లపల్లి స్వచ్చ శుభ్రతలు ఇబ్బడి ముబ్బడి.

 

            నా మూలాలు చల్లపల్లి లో కాదు గాని, ఈ ఊరితో అవినాభావ సంబంధం! అసలు ఊరు కృష్ణ ఒడ్డున రాముడుపాలెం. పేరు కొర్రపాటి వీరసింహుడు. కాస్త ఒడ్డూ – పొడుగుతో అట్టహాసంగా పేరుకు తగ్గట్టుగా ఉండే మాట నిజమే గాని, చల్లపల్లి లో ప్రతి దిన వేకువ 2047 రోజుల శ్రమదానంలో మాత్రం వీరాధివీర సింహుడిని కానే కాదు. 65 ఏళ్ల వయసు. చల్లపల్లి లో చదువు, చాలా కాలంగా ఇక్కడే నివాసం. నడకుదురు మునసబుగా, పంచాయతీ గ్రామ కార్యకర్తగా, చివరికి సెక్రటరీగా 2013 లో ఉద్యోగ విరమణ.

 

            దాదాపు అప్పుడే మొదలైన స్వచ్చ చల్లపల్లి ఉద్యమం గురించి చూచాయగా తెలిసినా, నా వీధిలో కూడ ఆ సందడి వినిపించినా, 900 రోజుల దాక కొంత మెచ్చుకోవడమే తప్ప స్వయంగా పాల్గొనలేదు. నా రొటేరియన్ మిత్రుడు శివబాబు మరొకసారి కూడ చెప్పాక – 960 వ నాడనుకొంటా - ఇందులోకి వచ్చాను. వీధి పారిశుధ్యం కోసం చీపురు పట్టి, రహదార్ల మెరుగుదల కోసం దంతెలు వాడి, శ్మశాన సౌందర్యం కోసం మిగతా కార్యకర్తలతో చేయి కలిపి, సామూహిక శ్రమదానం విలువ ఏమిటో గ్రహించాను. ఉమ్మడి ఆశయ సాధన కోసం సమైక్య ప్రయత్నం పాత్ర ఎలాంటిదో తెలిసి వచ్చింది! నిస్వార్ధంగా జరిగే ఉమ్మడి ఉద్యమం ప్రభావంతో ఊరు క్రమంగా ఎలా మారిపోయిందో కళ్ళారా చూశాను. పత్రికలు, దేశ విదేశీ ప్రముఖులు, పరిశీలకులు అరుదైన ఈ ఉద్యమాన్ని అభినందించడం విన్నాను.

 

            స్వచ్చ కార్యకర్తలతో కలిసి, ఎన్నో యాత్రలు కూడ చేశాను. ఐతే ఆరోగ్య రీత్యాను, రాముడుపాలెం లో కొంత సొంత వ్యవసాయ కారణంగాను, అక్కడే ఉంటున్న మా అమ్మ గారి దగ్గర గడపడం వల్లనూ ఈ ఉషోదయ శ్రమదాన హాజరీలో చాల బ్రేకులు పడుతుంటాయి. పాల్గొన్న నాటి ఉత్సాహాన్నీ – కుదరక దూరంగా ఉన్నప్పటి వెలితినీ అనుభవిస్తూనే ఉంటాను. నా పిల్లల పుట్టిన రోజుకో – ఇతరత్రానో కొద్దిపాటి చందాలు మనకోసం మనం ట్రస్టుకిచ్చిన తృప్తి కూడ ఉన్నది.

 

            నైజీరియా నుండి నా కుమారుడు పంపిన టీ షర్టులను, టోపీలను స్వచ్చ కార్యకర్తలకు పంచిన అనుభవమూ ఉన్నది.

 

            ఇప్పటికే మన స్వచ్చ చల్లపల్లి ఉద్యమం ప్రపంచ ప్రసిద్ధమైపోయింది. ఇది మరిన్ని రాష్ట్రాలకు, ఊళ్ళకు, ప్రజల మనస్సులకు సోకి, విశ్వవ్యాప్తంగా స్వచ్చ – సౌందర్యాలు శాశ్వత ప్రాతిపదికతో వెల్లివిరియాలనేదే నా కోరిక! మన ఉద్యమం అంతటి శక్తివంతమైనదనే నా నమ్మకం.

 

            యధాశక్తిగా ఈ ఉద్యమం లో పాల్గొంటూ ఉండాలనే నా ఆశయం!

 

- కొర్రపాటి వీరసింహుడు – (మునసబు వీధి) చల్లపల్లి

   19.06.2020.