డా. గోపాళం శివన్నారాయణ గారు....           21-Jun-2020

 2000 దినాల స్వచ్చోద్యమ చల్లపల్లి సేవా తరంగాలు -

కార్యకర్తల స్వానుభవ జ్ఞాపకాల పరంపర – 45

స్వచ్చ చల్లపల్లి @2000.

 

            చల్లపల్లి గురించి, స్వచ్చ - సుందర - చల్లపల్లి గురించి వ్రాయాలంటే,  నాకున్న ఆవేశానికి కొన్ని వందల పేజీలు వ్రాయవల్సి వస్తుంది. నాగరికత అంటే, అభివృద్ధి అంటే సామాజిక స్పృహ అంటే, సంఘ జీవనం అంటే, జ్ఞానం అంటే ఒక మాటలో ఎవరికైనా అర్ధం అయ్యేలా చెప్పాలంటే అదే స్వచ్చ చల్లపల్లి.

 

          ఇంకా, ఇంకా చాలా చాలా ఉదాత్తమైన మానవ అభివృద్ధి సూచికలకు అది ఒక అద్భుత సామాజిక ప్రయోగం.

 

          మన కంటికి కనిపించని గుదిబండే “స్వార్ధం”. కనిపించని సంకెళ్లే “పిరికితనం”. ఎవరైతే వీటిని ఛేదించుకొని బతకగలుగుతారో వారే చనిపోయి కూడా మిట్ట మధ్యాహ్నం సూర్యుడు లాగ చరిత్రలో నిలిచిపోతారు. ఈ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నంత కాలం జనం గుండెల్లో వారు చిరస్తాయిగా నిలుస్తారు. మహనీయులందరూ ఈ కోవకు చెందినవారే!

 

          అలాగే - స్వచ్చ చల్లపల్లి శ్రమదానంలో పాల్గొనె ప్రతి ఒక్క కార్యకర్త కూడ ఇదే కోవకు చెందుతారు. ఎవరు ఎంత స్వార్ధాన్ని, పిరికితనాన్ని జయించారు దానిని బట్టి వారి వరుస క్రమం వుంటుంది.

 

          అలాంటి వరసలో మొదటి వాడు - మన వాడు “డా. D.R.K. ప్రసాదు!” రైలుకు ఇంజను లాంటి వాడతను. ఈ DRK గురించి చెప్పాలంటే - 1977 నుండి నా పరిచయం, స్నేహం, అభిమానం, గౌరవం ఆరాధన ఇంకా చాల వాటిని రంగరించి చెప్పాల్సి వుంటుంది. చాలా కష్టమైన పని.

 

          ఒక మనిషికి ఉండదగిన మంచి బుద్ధి, ప్రవర్తన, క్రమశిక్షణ, ఎలా జీవించాలి, ఇంకా ఇలాంటి అనేక సున్నిత మానవ లక్షణాలు ఉన్న - మన మధ్య తిరుగాడుతున్న ఒక గొప్ప సంఘ జీవి – DRK.

 

          రైలు పెద్దదిగా ఉన్నప్పుడు, కొండ మార్గాల్లో ప్రయాణం చేసేటప్పుడు, రైలుకు రెండో ఇంజను అవసరమవుతుంది. ఆ రెండో ఇంజనే, మన “డా. పద్మావతి”. పద్మావతి గారు నా క్లాస్ మేటే ఐనా, DRK కంటె నాకు కొంచెం తక్కువ పరిచయం. కాని, చల్లపల్లి క్యాంపు 2003 లో మొదలు పెట్టిన తరువాత గాని, నా క్లాస్ మేట్ లోని గొప్ప మానవీయ కోణాలు నా దృష్టికి రాలేదు. ఆడవాళ్ళలో అరుదైన గొప్ప వ్యక్తిత్వం! అటు DRK కి, మన చల్లపల్లికి, చుట్టు ప్రక్కల ప్రజలందరికి ఒక అద్భుత బహుమతి, మన “పద్మావతి”.

 

          ఈ ఉభయుల తల్లి తండ్రులకు, స్వచ్చ చల్లపల్లి కార్యకర్తల తల్లితండ్రులకు నా శిరస్సు వంచి పాదాభివందనాలు.

 

          ఎందుకంటే - పంది కడుపున పంది, నంది కడుపున నందే పుడతాయి.

 

          నా ఉద్దేశంలో ఈ విధంగా, స్వచ్చ సుందర చల్లపల్లి ఉద్యమంలో పాల్గొనే ప్రతి ఒక్కరు నందులే! వారి తాత ముత్తాతలందరు నందులే ఐఉంటారు.

 

          ఇలాగ ఎవరైతే వారి పూర్వీకులకు మంచి పేరు తేగలుగుతారో, వారే నిజమైన మానవులు.

 

          ఈ చల్లపల్లి కార్యకర్తల గురించి ఎంతో వ్రాయాలని వుంది కాని, ఈ మధ్య తెలుగు వ్రాయడం అలవాటు తప్పింది, బద్దకం అనే భూతం ఆవహించింది. లేకపోతే స్వచ్చ చల్లపల్లి కార్యకర్తలందరి గురించి, నా అంత బాగా ఎవరూ వ్రాయలేరు అనే నమ్మకం నాకుంది. పైగా, ఏ ఒక్కరిని గురించి వర్ణించాలన్నా ఒక పుస్తకమే అవుతుంది కూడా.

 

          వందలాది ఈ మహనీయ కార్యకర్తలలో ఒకరి పేరు వ్రాసి, ఇంకొకరిని వ్రాయకపోతే, ఆ స్వచ్చ కార్యకర్తకి ఎంతో ద్రోహం చేసిన వాడినవుతాను. ఈ మహా స్వచ్చోద్యమంలోని ప్రతి కార్యకర్త, నా గుండెల్లో చోటు చేసుకొని వున్నాడు, అని మాత్రం నిక్కచ్చిగా చెప్పగలను. ఈ చల్లపల్లి స్వచ్చ – సుందర మహోద్యమానికి ఇంజన్లైన డా. డి. ఆర్. కె, పద్మావతు ల ప్రమేయం ఒక వేళ లేకపోయినా సరే – ఈ కార్యకర్తలలో ఏ ఒక్కరైనా రైలు ఇంజను గా మారి, ఈ స్వచ్చ శకటాన్ని విజయవంతంగా గమ్యానికి చేర్చగలరనడంలో నాకేమాత్రం సందేహం లేదు.     

 

          ఆఖరుగా                     –        పనిని బట్టి “గౌరవం”

                                                    గుణం బట్టి “కులం”       

                                                    బాధ్యత ను బట్టి “విలువ”

 

          మానవత్వం, సమానత్వం, సంస్కారం, దేశభక్తి, ధర్మం – వీటన్నిటి సమ్మేళనమే నాగరికత, సోష లిజం, కమ్యూనిజం.

 

- మీ

  డా. శివన్నారాయణ.