ఉస్మాన్ షరీఫ్....           22-Jun-2020

 2000 దినాల స్వచ్చోద్యమ చల్లపల్లి సేవా తరంగాలు -

కార్యకర్తల స్వానుభవ జ్ఞాపకాల పరంపర – 46

2050 దినాల స్వచ్చ చల్లపల్లిలో-

నా ప్రవేశం నా ప్రమేయం.

 

            అందరూ నడిచే రహదారి మీద నడవడం ఎంత సులభమో - కొత్తగా బాట వేసుకుంటూ - నడుస్తూ పోవటం ఎంత కష్టమో అందరికీ తెలుసు. జనం ఎటు మొగ్గుతారో కూడ ఊహించవచ్చు. చల్లపల్లి వంటి ఒక పెద్ద పురాతన గ్రామంలో 90% వీధుల్లో, పరిసరాల్లో బొత్తిగా పారిశుధ్యమే లేక - జనానికసలు ఆ స్పృహ లేక- బహిరంగ మల విసర్జనలతోనూ ముందుకే కదలని మురుగు కాల్వల తోను, ఊరంతా కళ తప్పిన సమయంలో ఆ పరిస్థితులు మార్చబూనటం సాహసమే కదా! ఆ సాహసాన్ని 2013 లో చేసింది జనవిజ్ఞాన వేదిక, డాక్టర్ DRK గారు. గంగులవారిపాలెం దారినే బాగు చేసుకొని, సంపాదించిన అనుభవంతో 2014 నవంబరులో ఇక మిగిలిన ఊరి సంగతి చూడడం మొదలు పెట్టారు.

 

            ఇప్పుడు - ఆరేడేళ్ళ తర్వాత ఆ ఉద్యమం చల్లారనే లేదు సరి కదా- రోజు రోజుకూ రాటు తేలుతూనే ఉన్నది. ఆ స్ఫూర్తి ఒక్కో ఊరికి తగులుకొని, 30 కి పైగా ఊళ్లలో స్వచ్చ జెండాలు ఎగురుతూనే ఉన్నాయి. రోజులు గడిచే కొద్దీ అది స్వచ్చ- సుందర ఉద్యమంగా మారిపోయింది. చిన్న కుదుపులు, ఆటుపోటులు ఉన్నా 2050 రోజులుగా ఈ ఉద్యమానిది ముందు నడకే!

 

            ద్విచక్ర వాహన మరమత్తు దారుడైన ఈ ఉస్మాన్ షరీఫ్ - నిరంజన్, సతీష్, మధు, రవి, బాలు వంటి మిత్రులతో కలిసి 30 వ రోజు నుండి చల్లపల్లి స్వచ్చ ఉద్యమంలోకి చేరి పోయాడు. మా ఏడెనిమిది మంది కుర్రాళ్లతో ఒక దశలో స్వచ్చ చల్లపల్లి శ్రమదాన కార్యక్రమం భలే సందడిగా కళకళ లాడింది. వేకువ స్వచ్చంద బాధ్యతలలో మేము చేయనివి లేవు. వయసు మళ్లిన అనుభవజ్ఞులతో, జ్ఞాన వృద్ధులతో, గృహిణులతో, విద్యార్థులతో, డాక్టర్లు - టీచర్లు - లాయర్లతో ఈ కార్యక్రమం చాలా వైవిధ్యంగా మారింది. ఈ అందరితో నాకు ఎన్నెన్ని అనుబంధాలో! ఇన్ని రోజులుగా ఎన్నిన్ని జ్ఞాపకాలో! ఎన్ని క్రొత్త చోట్లకు ఇంతమంది నిస్వార్థ పరులతో మా ప్రయాణాలో!

 

            సుధీర్ఘమైన - వైవిధ్య భరితమైన ఇన్ని వేల దినాల ఈ స్వచ్చోద్యమం లో ప్రతి  అనుభవమూ ప్రత్యేకమే గాని, వాటిలో మరీ ముఖ్యంగా సాగర్ టాకీస్ బైపాస్ రోడ్డు కిలో మీటరు పైగా బహిరంగ మల విసర్జనను మాన్పి, బాలికల హాస్టల్ దగ్గరి నరకాన్ని స్వర్గాన్నిగా మార్చి, అలనాడు అశోకుడు స్తూపాలు వేయించినట్లు కమలాలు మొలిపించి, చెట్లు నాటి, పూల సువాసనలు నింపి, గోడలమీద స్వచ్చ స్ఫూర్తిని పంచి ఇంత కాలంగా అంకితభావంతో చేసిన కృషి ఎంత అద్భుతమో అని ఇప్పుడనిపిస్తున్నది!

 

            అందుకే ఈ అత్యద్భుత- క్షేమదాయక ఉద్యమంలో మరింత మంది గ్రామస్తులు కలిసి రావాలని, మరీ ముఖ్యంగా యువకులు, విద్యార్థులు, మహిళలు కలిసి రావాలని కోరుకొంటూ - ఇకపై నా హాజరును కూడ పెంచగలనని మనవి చేసుకొంటూ....

 

- ఉస్మాన్ షరీఫ్

   చల్లపల్లి - 22.06.2020.