ప్రాతూరి శాస్త్రి 19.08.2020. ....           19-Aug-2020

 600 నుండి 800 రోజులు


ఈ సమయంలో గ్రామంలో చాలా మార్పులు. గంగులవారిపాలెం రోడ్డు పడింది. డాక్టరు గారు తమ స్వంత ఖర్చుతో ఆసుపత్రి రోడ్డు  భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పరచి, దానిపై ఉద్యానవనం నిర్మించారు. రోడ్డుకు ఇరువైపులా పేవర్ టైల్స్ వేయించారు. ఇరువైపులా చక్కనైన పూలమొక్కలతో, రోడ్డు మధ్య కాట్ ఐ లు ఏర్పరిచారు.

గ్రామంలో పెళ్ళి జరిగితే పెళ్లి వారు, అప్పుడప్పుడు ప్రేమికులకు ఫోటోస్పాట్ అయింది.

కళ్లేపల్లి రోడ్డు : 

విజయవాడ, నాగాయలంక రోడ్ల శుభ్రతకు కళ్లేపల్లి రోడ్డు శుభ్రతకు చాలా వ్యత్యాసం ఉంది. రోడ్డుకిరుపక్కల ఒకమీటరు లోపలకు పిచ్చి చెట్లు, ముళ్ళకంప, చిన్న బోదెలలో బురద. వేకువ చీకటి సమయాన దాదాపు 2 గం పైన శుభ్రత చేసేవారు. అదే రోడ్డులోని కొత్తూరు, శివరాంపురం వాస్తవ్యులు కూడా పాల్గొనేవారు.

వారి అభ్యర్ధన వింటే "మేము మోపిదేవి మండలం వారం. అయినా చల్లపల్లి వారితోనే కలుస్తాము. భవిష్యత్తులో స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలు గా ఉంటాం." అందుచే కళ్లేపల్లి రోడ్డులో వెంకటాపురం సరిహద్దుల వరకు శుభ్రం చేశారు.

శివరాంపురం రోడ్డులో మొక్కలు నాటుటకు డిగ్రీ కాలేజీ విద్యార్థులు గూడా భాగస్వామ్యం వహించారు. 

డాక్టర్ పద్మావతి గారి ఆలోచనతో కార్యకర్తలు కోలాటం నేర్చుకున్నారు.
       
శివారాంపురం 100 రోజుల పండుగ నాడు వైభవంగా కోలాటం వేసి ప్రశంసలు పొందారు.

          ఈనాటికీ కళ్లేపల్లి రోడ్డు శుభ్రత అంటే కనీసం నెలరోజులు చేస్తారు.

ఈరోజుల్లోనే మరో ముఖ్యసంఘటన :

            డా. పద్మావతి, డా. డీ.ఆర్కే ప్రసాదుగారి ఆలోచనలు విద్యార్థులకు సేవాభావం కలగజేయడం ఎలా.

            సేవ గురించి చెపితే ఏ విద్యార్థి వింటాడు.

అప్పుడే ఆవిర్భవించింది ఆనంద ఆదివారం.
వివేకానంద డిగ్రీ కాలేజీ విద్యార్థులతో మొదలయ్యింది మొదటి ఆనందఆదివారం. ఉదయం 6 గం నుండి 9గం వరకు. అశేష ప్రజానీకం, గ్రామాధికారులు, గ్రామ పెద్దలు విచ్చేసి నృత్యాల మధ్య సేవాభావం గురించి చెప్పేవారు.

            దీనికి ప్రభావితులై వివేకానంద డిగ్రీ కాలేజీ విద్యార్ధులను ప్రతి శనివారం మధ్యాహ్నం 3 గం నుండీ 5 గం వరకు పంపుటకు యాజమాన్యం అంగీకరించారు.

            ఆనాటి నుండి ఈనాటి వరకు విద్యార్థులు సేవచేస్తున్నారు.

            ఆనంద ఆదివారాలు జనరంజకమయ్యాయి.. కార్యకర్తలు గూడా ఓ నృత్య ప్రదర్శన ఇవ్వడం పరిపాటి అయింది.

మరో ముఖ్య ఘటన : 

            ప్రారంభ దినాలలో మలవిసర్జన ప్రాంతాలు శుభ్రం చేసి మరల రాకుండా చేయుటకు జడ్ పి టీ సీ కృష్ణకుమారి, లాయర్ మురళి సహకరాలతో 1, 2 వార్డులో టాయిలెట్ సౌకర్యాలు పర్యవేక్షించి కట్టుకునేవారికి డాక్టర్ గార్లు ధనసాయం చేసేవారు.

కార్యకర్తలు గూడా వార్డులో తిరిగి టాయిలెట్ కట్టుకోలేని వారి జాబితా తీసికొని సాయం చేసేవారు. ట్రస్ట్ నుండి చాలామందికి సహకరించారు.
            
కళ్లేపల్లి రోడ్డు సేవ చేస్తున్న రోజుల్లో : 

            శ్రీ బుద్ధప్రసాద్ గారు సేవాకార్యక్రమం చేస్తున్న గ్రామాల స్వచ్ఛ కార్యకర్తలతో కరకట్ట పై నున్న పిచ్చిచేట్లు శుభ్రం చేయించాలని తలపెట్టారు. పోలీసులు గూడా ఇందులో పాల్గొంటారని తెలిపారు.

ఆదివారం ఉదయం యధావిధిగా 4.30 కు చల్లపల్లి, ఘంటసాల, నాదెళ్లవారిపాలెం కార్యకర్తలు నడకుదురు కట్టవద్ద కలిసి సేవాకార్యక్రమం మొదలెట్టారు. పోలీసువారు 6 గం కు మాతో కలిసి శుభ్రాతాకార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 100 మంది పైన సేవ చేశారు

చూడ రెండుకళ్ళు చాలవు. అలా 8 ఆదివారాలు శుభ్రం చేసాము. ఫేస్ బుక్ లో చూడ రెండు కాళ్ళు చాలవు. కరకట్ట సేవలో పాల్గొనండి అని వ్రాసిన దానికి ఉత్తేజితులై గుడిసేవ విష్ణుప్రసాద్ గారు, అసావారి కిట్టు గారితో ఒక ఆదివారం
విచ్చేసారు. 300 మీ దూరంలో పనిచేసిస్తున్న వారిని చూచి ఆనందించారు.
మన చల్లపల్లిపై ఒక పాటను పాడారు. ఈనాటికీ వింటూనే ఉన్నాము.

            ఈ స్వచ్ఛంద సేవచేసే రోజుల్లో అరటి తోటలు, బంతిపూల తోటలు, లాకుల వద్ద అందమైన ఫోటోలు దిగారు. దగ్గర దగ్గర వెలివోలు సమీపం వరకు శుభ్రంచేశారు.

600 వ రోజున డంపింగ్ యార్డు నుండి పాదయాత్ర బుద్ధప్రసాద్ గారితో గ్రామాధికారులు కార్యకర్తలు కలసి చేశారు.
 
          యన్ టీ ఆర్ పార్కు ఎదురుగా పెట్రోలుబంకు ఆవరణలో డా.పద్మావతి, డా.డీ ఆర్కే ప్రసాదు గార్ల బృందం అశేష ప్రజానీకం చూస్తుండగా కోలాటం వేశారు.
            ప్రభాకరరావు గారు వారి విద్యార్థులతో డప్పు మోగించారు.

వారందరూ ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు.
            
నాకు చాలా ఆనందం కలిగించింది. ఆ విద్యార్థులకు సాయంచేదలచి డాక్టర్ గారికి చెప్పాను. సమయానికి నా వద్ద డబ్బులు లేవు. ఇంతలో గోపాలకృష్ణ క్లాత్ స్టోర్స్ సాంబశివరావు గారిని అడగగానే 5,000రు తెప్పించి ఇచ్చారు. విద్యార్థులకు రు5,000లు బుద్ధప్రసాద్ గారి ద్వారా అందజేయడం జరిగింది.

            కొంతమంది విరాళాలు ఇస్తుంటే మా పెద్దబ్బాయి విద్యాసాగర్ మనం కూడా ఇద్దామా అన్నాడు. నాకు పెన్షన్ వస్తోంది. ప్రతినెలా రూ5,000లు ఇస్తే. స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమాలు చాలా వైభవంగా జరుగుతున్నాయి. నేనూ ఉడతా సాయం చేస్తే, అనా ఆలోచన డాక్టర్ గారికి చెబితే ససేమిరా వద్దు అన్నారు.

            కానీ మనసు మాట వినదు గదా. విద్యార్థులకు ఇచ్చేటప్పుడే బుద్ధప్రసాద్ గారికి చెప్పి అందరి సమక్షంలో చెప్పగా నాకు చాలా తృప్తి అనిపించింది.

            డా. గోపాలకృష్ణయ్య గారు వారి కుమార్తెలు ఒక ట్రాక్టర్ ట్రస్టుకు విరాళంగా ఇచ్చారు. దీనితో పారిశుధ్య కార్యక్రమాలకు ఎంతో సాయం కలిగినట్లైనది.

తొలి రోజుల్లో నాటిన మొక్కలకు నీరు పోయాలంటే లాగుడు రిక్షాలో చిన్న నీళ్ల ట్యాంకర్ పెట్టి నీరు అందించేవారు.
మరల గోపాలకృష్ణయ్య గారి కుమార్తెలు నీటి ట్యాంకర్ విరాళంగా ఇచ్చారు. డంపింగ్ యార్డులో మొదట్లో బోరువేశారు.
 
కాలం కలిసి వస్తే నడిచే కొడుకు పుడతాడని సామెత.
            
మరో కవి సిరి దా వచ్చిన వచ్చును నారికెళ సలిలము భంగి, అన్నారు.
- తరువాయి భాగం రేపటి సంచికలో... 

-ప్రాతూరి శాస్త్రి,  
19.08.2020.