ప్రాతూరి శాస్త్రి 13.09.2020. ....           13-Sep-2020

 అందాల బంధం శ్రమైక జీవనం.

ఆత్మీయరాగం వేకువసేవ

 

Drain cleaning

నీలో ఉన్న శక్తిని గుర్తించు. స్వశక్తిపై ఆధారపడిన వారు సాధించలేనిది లేదు.

నీ గమ్యాన్ని నిర్ణయించేవి అరచేతిలోని గీతలు కావు, నీ చేతులు.

స్వశక్తిపైనే విశ్వాసం గల స్వచ్చ చల్లపల్లి కార్యకర్తలు అందరూ కలసి సుందర చల్లపల్లిని తమదైన శైలిలో నిర్మాణం చేస్తున్నారు.

             కేవలం రోడ్లు ఊడ్చడం ఒక సంవత్సరం అనుకున్న రోజుల్లోనే డ్రైన్లపై కన్ను పడింది.

             సామగ్రి సమకూర్చుకున్నవారై మురుగుకాల్వల శుభ్రత చేపట్టారు.

             నిత్యాన్నదానం పధకం లాగా నిత్యము డ్రైన్లు శుభ్రంచేసేవారు. డ్రైన్లలో దిగి పూడిక తీసేవారు.

             తూము వెంకటేశ్వరరావు గారు తూములలో దూరి సిల్ట్ తీసేవారు. కాలక్రమేణా దాదాపు 10 మంది నిపుణులు తయారయ్యారు.

            అంజయ్య గారు, కస్తూరి విజయ్, నరసింహారావు, వాసు మాస్టారు, బృందావన్, బాబూరావు, రమణ, కస్తూరి శ్రీను, తూము వెంకటేశ్వరరావు, లక్ష్మణరావు డ్రైన్ శుభ్రత అనగానే డ్రైన్లలో దిగి శుభ్రం చేసేవారు.

            వీరి చేసే పనులకు ఉత్తేజితులై నల్లూరి రామారావు మాస్టారు కవిత వ్రాసారు. మురుగు వీర ప్రశంసయని.

            మన ప్రజా గాయకుడు నందేటి శ్రీనివాస్ గారితో పాడించి రోజూ వినిపించేవారు.

            ఎన్నెన్నో పాటలు వ్రాసినా మురుగు వీర ప్రశంస పాట కార్యకర్తలలో మరింత ఉత్సాహం పెరిగేది.

            వేకువనే డ్రైన్లపై బండలు తీసి మురుగు తోడి బయట పోసేవారు.

            తెల్లవారే సరికి మరల బండలు మూసేసేవారు. మరుసటిరోజు తీసిన సిల్ట్ ట్రాక్టర్ లో లోడుచేసి డంపింగ్ యార్డుకి తరలించేవారు.

            వర్షం కురిసిన రోజు డ్రైన్లు శుభ్రం చేసేవారు.

            మహిళా కార్యకర్తలు గూడా డ్రైన్లు శుభ్రం చేయడంలో సిద్ధహస్థులు.

            ధనలక్ష్మి, ముత్యాల లక్ష్మీ, ప్రశాంతమణి, భారతి, కృష్ణకుమారి గార్లు డ్రైన్లు శుభ్రం చేసేవారు.

            డా. పద్మావతి గారైతే డ్రైన్ పని పూర్తి అయ్యేవరకు అక్కడే వుండి సాయం చేసేవారు.      

            డాక్టరు గారైతే పనిముట్లు అందిస్తూ లైటు చూపిస్తూ తగు జాగ్రత్తలు చెప్పేవారు.

            బ్రహంగారి గుడికెదురు డ్రైన్, పోతురాజు గుడి పక్క సందు, కళ్లేపల్లి రోడ్డులో కళ్యాణమండపం బజారు మొదట్లో డ్రైన్, బైపాస్ రోడ్డులో డ్రైన్ సేవలు ఎలా మరిచిపోతాము.      

              గంగులవారిపాలెం మలుపులో బృందావన్ తూములో దూరి బండెడు సిల్ట్ తీసినరోజులు, డాక్టరుగారు, పంచాయతీ సెక్రటరీ ప్రసాదులు డ్రైన్ కిందకు దిగి లైట్లు చూపిస్తే తూము మొత్తం శుభ్రం చేయడం జరిగింది.

            సాగర్ టాకీస్ రోడ్డు డ్రైన్ శుభ్రత ఎన్నిసార్లు శుభ్రంచేసారో..

            చాలా కష్టేతరంగా చేసిన డ్రైన్ చంటి గారి హోటల్ బజారు నుండి ఇస్లాం నగర్ సెంటరులో డ్రైన్.

            రోడ్డు కింద నుండి వెళ్లిన డ్రైన్ పెద్ద వాసాలు తెచ్చి డ్రైన్ నుండీ రాళ్ళు తీస్తూ 3 రోజులు కష్ట పడితే గానీ శుభ్రం కాలేదు.          

మరో మహత్తర సంఘటన.

            బస్టాండు నుండి వెళ్ళే డ్రైన్ కళ్లేపల్లి రోడ్డులో తిరిగి బండ్రేవు కోడులో కలుస్తుంది. 5 రోజులు శ్రమజేశారు. టీ దుకాణాల కిందనుండి వెళ్తోంది మురుగు కాలువ. బండలు తీశారు.

            మురుగు తోడారు. కళ్లేపల్లి రోడ్డులో షాపుల వెనకనుండి వెళ్లే డ్రైన్ శుభ్రపడింది.

            చల్లపల్లి లో భూగర్భ డ్రైనేజీ ఆసుపత్రి రోడ్డులోను, కమ్యూనిస్టు బజారులోను ఏర్పాటయింది.

            డాక్టర్ గారు మినిస్టర్ గారిని అడగగా యం డీ ఓ ఆఫీస్ నుండి బాలికల హాస్టల్ వరకు ఉన్న డ్రైన్ భూగర్భ డ్రైన్ గా చేయిస్తామన్నారు. కానీ కారణాంతరాల వల్ల ఆగిపోయింది.

            10 మంది డ్రైన్ నిపుణులున్నా కార్యక్రమం జేయవలసి వస్తే ప్రతి కార్యకర్తా అన్ని పనులు చేయగలరు.

            సన్ ఫ్లవర్ కాలనీ లో డ్రైన్ నెల రోజులపాటు శుభ్రం చేశారు. నరసింహారావు బృందం కాలనీ నుండి రజకబజారు చివర పెద్ద డ్రైన్ లో కలిసేటంత వరకు శుభ్రంచేశారు.

                                               *...*

డ్రైన్ శుభ్రం చేస్తున్న కార్యకర్తల గురించి మన సీనియర్ కార్యకర్త రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీ నల్లూరి రామారావు గారు రాసిన పాట

చుళుకీకృత మురుగునీటి శోభిత నరసింహుడు

గ్రామ మురుగు చెత్త రాళ్ళపై పోరున విజయుడు

మురుగు పరమ వీరచక్రబిరుదాంకిత మోహనుడు

మురుగు సముద్రాలు ఈదు మొనగాడీ రమణుడు

 

పాపకూప చల్లపల్లి పావనుడట అంజిబాబు

బళ్లకొద్ది మురుగు తోడు పల్లనాటి రాజబాబు

చల్లపల్లి మురుగు సింహస్వప్నం గద శివబాబు

మురికి పనులకాద్యుడు ఆల్ రౌండర్ బృందావనుడు

 

మురుగునకాగర్భ శత్రువు బి.ఎస్.ఎన్.ఎల్. బాబూరావు

మురుగుసంఘ అధ్యక్షుడు కస్తూరి శ్రీనుడు

మురుగుపైన తిరగబడే మొనగాడొక లక్ష్మణుడు

తూము మురుగు స్పెషలిస్టు తూము వేంకటేశ్వరుదు

మురుగుకు యముడే ఈ భోగాది వాసుదేవుడు

 

పేరుకున్న మురుగు లాగు వీర వనిత ధనలక్ష్మి

భారతి ముత్యాల లక్ష్మి ప్రశాంతమణి అన్నపూర్ణ

రమణీమణులిరుగో మన గ్రామ మురుగు తుడిచి పెట్టి

గ్రామస్తుల తమ పిల్లలుగా సంరక్షించు తల్లులు!

 

అసలు సిసలు కర్మవీరులంటే వీళ్ళే కదా!

స్వచ్ఛ సైనికుల సేవకు సదా నామనస్సు ఫిదా!

వెయ్యేళ్ళైన చల్లపల్లి వీళ్ళ ఋణం తీర్చునా?

జనం వీళ్ళ స్ఫూర్తి పొంది జాగృతమై నడచునా!

-నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

                                             *....*

 

 సీఎం గారి పర్యటనతో డ్రైన్ శుభ్రం చేసే యంత్రము స్వచ్చాంధ్ర కమీషన్ వారు పంచాయతీ వారికి ఇచ్చారు.

అప్పటినుండి పంచాయతీ వారు రోజుకొక చోట డ్రైన్ శుభ్రం చేస్తున్నారు.     

 

- ప్రాతూరి శాస్త్రి

13.09.2020.