ప్రాతూరి శాస్త్రి - 15.09.2020. ....           15-Sep-2020

సుందరీకరణ – మొక్కలు నాటుట

 

మన గ్రామం అందంగా ఉండాలి.

మనముండే ప్రాంతం స్వచ్ఛంగా ఉండాలి.

ఏ వీధికెళ్లినా చెడువాసన రాగూడదు.

ఎటుచూసినా ఆకుపచ్చదనంతో వెల్లివిరియాలి.

గ్రామంలో ఎటువెళ్లినా భిన్నభిన్న రంగుల పుష్పాలతో ఆహ్లాదకరంగా ఉండాలి.

 

ఎంత స్వార్ధమో గదా.

ఇటువంటి స్వార్ధమే ఉండాలి.

ఒక్కసారి అలవాటైతే పరిశుభ్రతకే పెద్దపీట వేస్తాం.

అందరికోసం బ్రతకడమే అదృష్టం.

 

పరిశుభ్రత, పచ్చదనం ఆదర్శంగా తీసికొని డా.డీ.ఆర్కే ప్రసాద్, డా.పద్మావతి గార్లు తమ కార్యకర్తలతో యుద్ధంలో సైనికులవలె శ్రమిస్తున్నారు.

            సుందరీకరణ విషయంలో అన్ని రహదారులలో బిళ్ళగన్నేరు, లాంటేనాలు నాటుటకు వచ్చిన వారిలో 10 మంది డా. పద్మావతి గారితో పాల్గొనేవారు. 

            కాలక్రమేణా కత్తి, గొర్రుల జోడీలు, లోడింగ్ వారు, మంచినీరందించేవారు, మొద్దుపనులు చేసేవారు, సుందరీకరణ వారుగా ఏర్పడి పనిచేసేవారు.           

            అలా ఏర్పడింది నలుగురితో సుందరీకరణ బృందం.

            మాధురీపద్మావతులు, దుర్గావాసులు.

శుభ్రం చేయ వెడల, నేల వారికి అనువుగా మారు

శుభ్రం చేసాక గడ్డిపరక మొలవ భయపడు

పార, గొర్రుల మేళవింపు నేలకు గిలిగింతలు పెట్టు

చూడరయ్య సుందరబృంద సేవావిన్యాసాలు.

 

గజఘీంకారాలతో పనిచేయు వేంకటేశ్వరుడు,

నిమ్మకునీరెత్తినట్లు పనిచేయు మెండువారు,

పనియందు మాటలయిష్టము సజ్జావారు,

నాపని నాదేయంచు చెత్తనెత్తు సూపర్వైజరు,

సేవల్మత్తులుగారె చల్లపల్లి సేవకులు. 

            ఏరోడ్డులో సేవచేసినా రోజూ 100 అడుగుల ప్రదేశం తీసికొని ఎంతో అందంగా చేసేవారు.

            వాకిలిముందు శుభ్రంగా ఊడ్చినట్లు, తళతళా మెరిసే తోమిన గిన్నెవలె, డాక్టర్ గారు ఓ ఆపరేషన్ చేస్తే ఎంత శుభ్రంగా ఉంటుందో, ఇక చెప్పనవసరం లేదనుకుంటా.

 

"వాసయ్య పలుగుతో తవ్వుడు

దుర్గయ్య పారతో నేల చెక్కుడు

డాక్టరమ్మ గొర్రుతో గుంజుడు

మాధురమ్మ చెత్త నెత్తుడు

కలబోసి జూడంగ చూడముచ్చటగ నుండు”

         ఇంత అందంగా నేల చదును చేసాక తాడుతో ఓ లైను మార్కింగ్ చేసికొని మొక్కలు నాటేవారు. 

"పూల మొక్కల నేర్చికూర్చే మాధురి

క్రమముగా ఇచ్చి నాటింపజేసే డా.పద్మావతి

ఓ రీతిన అందముగా నాటిరి ప్రసాద్వాసులు

నీరందించిరి నలుగురు కడు సంతసంబుగా”

 

నడకుదురు రోడ్డు శుభ్రత మొదలుపెట్టిన రోజునుండి వర్షాలే.

జోరు వానలో గూడా 1 వ మైలురాయి వరకు శుభ్రం చేశారు. నీడనిచ్చే మొక్కలు నాటారు. కేరింతలతో పూలమొక్కలు నాటారు.

 

"తవ్వుడు, చెక్కుడు, నక్కులతో కొట్టుడు

కింది కొమ్మల నరుకుడు, చేతులతో మట్టి తీసుడు

జోకులు పేల్చుడు, మొక్క మొదలు మట్టి తొయుడు

పాదులు చేసుడు, చూస్తురు కార్యకర్తల భంగిమలు” 

            వేకువ సేవాబాధ్యతలు ప్రారంభం కాగానే ఎవరి పనులు వారివే. పనిముట్లు తీసికొని వారివారి ప్రదేశాలకు సేవజేయ పయనమౌతారు.

 

            మొక్కలు పెడదామనుకున్న రోజున ట్యాంకర్ వచ్చి నేల తడిపి వెళ్తుంది.

 

"బిళ్ళగన్నేరులు, మధ్యమధ్య లాంటేనాలు

అక్కడక్కడ నాటిరి బోగన్ విలియాలు

కోరికమేర గుచ్చిరి పసుపు బంతులు

కార్యకర్తల సేవాసొగసు చూడతరమే.

 

పాదుల్జేసిరి బృందావనాంజయ్యలు,

లెస్సగా సొబగుల్ దిద్దిరి తాటిచెట్టుకు శ్రీను గురవయ్యలు,

సుందరీకరణ వారి శుభ్రతాసొగసు వర్ణించతరమా

వనితలేమో తలదీపాలతో చెత్తపోగుచేయ

మంచుపొగలోని సేవజూడ మానవ నేత్రలుచాలునే.

 

మెండుశీను చేస్తాడు రోజూ ఓ మూల

అంజయ్య చేస్తాడు ఫోటోలకు గోల

మహిళలంటారు మౌనంగా చేస్తే పోలా

సుందరబృందం చేస్తారు పరిశుభ్రంగా నేల

ఇదంతా రోజూ వుండే ఆనందహేల

 

- ప్రాతూరి శాస్త్రి

15.09.2020.