ప్రాతూరి శాస్త్రి - 16.09.2020. ....           16-Sep-2020

స్వచ్ఛ సుందర చల్లపల్లి సాధనే కార్యకర్తల ఆశయం

 

సుందర చల్లపల్లి విశేషాలు

అందం అందం నీవెక్కడ అంటే

అడవిలా పెరిగిన పిచ్చి మొక్కలు నరికే చేతులలో

నిజమే...... కాదుకాదు

పారలతో చెక్కి చెత్త ఎత్తినవారి చేతులలో

నిజమా.......కాదుకాదు.....

కొమ్మలను కత్తిరించి చక్కంగా ఊడ్చిన వారి చేతులలో,

ఇదీ నిజమే ....... కాదుకాదు

వీటినన్నిటినీ కలిపి చేయగలిగే సుందరబృందం చేతులలో నిజంగానే ఉన్నానంటోంది.

ఈ అవస్థలన్నీ చేస్తున్న కార్యకర్తలకు జేజేలు.

 

కత్తి పట్టినగాని, గొర్రుపట్టితేనేమి

పారైననేమి, పలుగైననేమి

చెత్త లోడింగ్ అయిననేమి

అదే దీక్ష, అదే పట్టుదల అనేటి

స్వచ్ఛ మనస్కులు మా కార్యకర్తలు.

 

            సుందరీకరణ బృందం 1620 వ రోజు నాటికి సుందరబృందం గా మారింది.        

            పెద్ద పెద్ద నగరాల్లో గోడలకు మంచి డిజైనులు వేయడం చూచిన డా.పద్మావతి గారు మన గ్రామంలో మాసిన గోడలకు రంగు మనమే ఎందుకు వేయరాదు అన్న ఆలోచనతో పుట్టింది సుందరబృంద చిత్రకళ.

           ప్రధమంలో గోడలకు రంగు వేసి నినాదాలు వ్రాసేవారు. రానురాను డిజైనులు వేసేవారు.

           భారత లక్ష్మీ రైస్ మిల్ గోడపై, బందరు రోడ్డులో చిన్నారాజవారి గోడలు తరువాత ఉన్న 2 గోడలపై నినాదాలు వ్రాసారు.

 

తడిసిరి స్వేదముతో రెండుగంటల సేవజేసి

సోలుచుండ దృష్టికి వచ్చె నర్సరీలేని ప్రాంతము

విరామములేక, అలుపులేక, సింగంబువోలె దుమికిరి,

కార్యకర్తలందరూ వాహనమందు వేయ పెకలించిరి ఎరువుమట్టిని,

పారలు, పలుగులు, నక్కులు, చీపుళ్ళు

ఒక్కసారిగా పనిజేయు దృశ్యములు

సంభ్రమాశ్చర్యములుగలిగించె.

 

నోటి పలుకుల కన్న ఆచరణ గొప్ప

త్యాగనిరతిలో నిస్వార్ధమే గొప్ప

డా.పద్మావతీ ప్రసాదులకు కార్యకర్తలే గొప్ప

తెలిసి మెలుగుమయ్య ఓ కార్యకర్తా.

 

చీకట్లోని కార్యకర్తల సేవ తాజా

మంచులో గురవయ్య చేయు బాజా

తందాన యంచు వెంకట్ కేకల కాజా

సుందరీకరణ వారి సేవేమో ఎంతో మజా.

 

వర్ధిల్లు వర్ధిల్లు రేరాజువలె చల్లగాను,

వర్ధిల్లు వర్ధిల్లు దినపు దివాకరుని వలె ను

వర్ధిల్లు వర్థిల్లు స్వచ్చతేసేవయనుచు

జయము జయము నీకు ఓ స్వచ్చకార్యకర్తా.

 

            నడకుదురు రోడ్డులో మెహర్ రైస్ మిల్ గోడలకు రంగువేసి పూలచిత్రాలు, కల్వర్టుకు నినాదాలు వ్రాశారు.            

            తదుపరి కమ్యూనిస్టు బజారుకు ఉత్తరగోడ బైపాస్ రోడ్డులో నినాదాలు, చిత్రాలు వేశారు.

            సుందర బృందం రంగులు వేయువేళ మిగిలిన కార్యకర్తలందరూ పరిసరాలు పరిశుభ్రం చేసేవారు.

 

- ప్రాతూరి శాస్త్రి

16.09.2020.