ప్రాతూరి శాస్త్రి - 17.09.2020. ....           17-Sep-2020

 సుందరబృంద చిత్రకళా విశేషాలు:

            సుందరబృందము నేర్పాటుజేసినది ఎవరో

            చిత్రలేఖనం మొదలిడినది ఎవరో

            నిదురవదిలి చిత్రరూపాలు వేసినది ఎవరో

            తెలతెలవారేలోగా రంగులిడినది ఎవరో

            పద్మాభిరామి డా. పద్మావతిగాక మరెవ్వరూ           

            2017 జూన్ లో పోలీస్ క్వార్టర్స్ గోడలకు రంగులేసి భిన్న భిన్న చిత్రాలు వేశారు.

            జూన్ చివరనుండి జులై వరకు సంతబజారు, రైతు బజార్ లలో గోడలకు రంగులేసి కూరగాయల చిత్రాల నుండి ఎన్నో చిత్రాలు వేశారు.

 

విశేషం.

            కార్యకర్తలందరూ నెల రోజులు అందరూ సంత బజారులోనే సేవ చేశారు. కొంతమంది గోడలకు ప్రైమరీ వేశారు. కొంతమంది పరిసరాలు శుభ్రం చేశారు. కొంతమంది డిజైన్లు వేశారు. సంత బజారు – రైతు బజారు లో దుబాయి లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న స్నేహ, కుమార్ గార్లు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం చిత్రాలకు రంగులు వేశారు. మనకోసం మనం ట్రస్టుకి 2 లక్షల రూపాయల విరాళం అందజేశారు.

            స్వచ్చంద కార్మికుల ఉత్సాహభరిత శుభ్ర సుందరీకరణ కృషితో చల్లపల్లి సంత, దాని ముందు బజారు ధన్యమైనవి.

- నెల రోజుల నుండి సంతకు రాని, రైతు బజారు చూడని వారు ఇప్పుడా రెండింటిని అదాటుగా చూస్తే గుర్తు పట్టక, సంభ్రమాశ్చర్యాలలో మునిగేంతగా ఆ ప్రాంతం పరిణతి చెందింది. దారి ప్రక్క రంగు రాళ్ళతో, పూల కుండీలతో, 5.26 కే విచ్చేసిన శాసనసభ్యులు సింహాద్రి రమేష్ గారిని, నరసింహారావు గారిని, తదితరులను ఆ వీధి, రైతు బజారు, వార సంత స్వాగతించాయి.

- గత 26 రోజుల – 35 మందికి తగ్గకుండా స్వచ్చ కార్మికుల – 1600 గంటల స్వచ్చ - శుభ్ర సుందరీకృత వార సంతను ఆవిష్కరించిన M.L.A. గారు, ఇతర ప్రముఖులు ఆ ప్రాంగణాన్ని, గోడల మీది చిత్రలేఖన సందేశాలను పరిశీలించి, చల్లపల్లి స్వచ్చోద్యమకారుల నిర్విరామ కృషికి ఉబ్బితబ్బిబ్బైపోయారు. ప్రకృతి సైతం తన హర్షామోదాలను 6.00 నుండి 7.25 దాక వర్ష రూపంలో ప్రకటిస్తూనే ఉంది.

- డాక్టర్ పద్మావతి గారు స్వచ్చోద్యమ చల్లపల్లి పూర్వాపరాలను, ఈ ఉద్యమ మూల విరాట్టైన D.R.K. ప్రసాదు గారి స్వచ్చ సంకల్ప మూలాలను సవివరంగా ప్రస్తావించి, సుందరీకరణలోని సాధక బాధకాలను, వ్యయప్రయాసలను వివరించారు.

- డాక్టర్ రామకృష్ణ ప్రసాదు గారు చల్లపల్లి స్వచ్చ సైనికుల సమయ శ్రమదానాలకు ప్రణమల్లి, గ్రామ ఆరోగ్యసుఖ శాంతులకోసం కొన్ని ప్రణాళికలను, వాటి పరిపూర్తి కోసం M.L.A. గారి సహకారాన్ని అభ్యర్ధించారు.

- సంత అందాలకు తోడు పచ్చదనాన్ని పెంపొందించే 3 సంవత్సరాల వయసున్న మామిడి చెట్టును నాటిన సింహాద్రి రమేష్ గారు ఆద్యంతం జోరువానలో కూడ తన ప్రసంగాన్ని సావధాన చిత్తులై వింటున్న కార్యకర్తలను మెచ్చుకుంటూ ఆత్మీయ ప్రసంగం చేశారు. ఈ కార్యకర్తల త్యాగం, శ్రమ తానెప్పుడూ ఎక్కడా కనీ వినీ ఉండలేదనీ, చల్లపల్లి గ్రామం అవసరాలకూ, స్వచ్చోద్యమానికీ తన చేతనైన సమస్త కృషీ చేయగలననీ చెప్పారు.

 

- ప్రాతూరి శాస్త్రి

17.09.2020.