ప్రాతూరి శాస్త్రి - 04.11.2020. ....           04-Nov-2020

 "2000 రోజుల అనుభవాలు ఫలితాలు"
  .........

మరింత మెరుగైన సమాజం కోసం కృషి చేసే సామాజిక కార్యకర్తల కోసం ఈ టపా పెడుతున్నాను.

మా స్వచ్చ సుందర చల్లపల్లి ఉద్యమం 2000* రోజుల అనుభవాలను, ఫలితాలను ఈ క్రింది వ్యాసంలో పొందుపరిచాను.

స్వచ్చ సుందర చల్లపల్లి గ్రామస్తులకు అభినందనలు 

 2000 రోజుల స్వచ్చ సుందర చల్లపల్లి ఉద్యమ ప్రస్థాన విశేషాలు.

గ్రామ పరిశుభ్రత, పచ్చదనం, సుందరీకరణ అనే మూడు ఆశయాలతో స్వచ్చ సుందర చల్లపల్లి ఉద్యమం నవంబర్ 12, 2014 వేకువజామున 15 మంది కార్యకర్తలతో మొదలైంది.

అప్పటి నుండి నేటి వరకు ప్రతి రోజు 30 – 40 – 50  మంది కార్యకర్తలతో ఒక్కరోజు కూడా ఆగకుండా ప్రతి రోజూ 2 గంటలకు పైగా స్వచ్చ సేవ కొనసాగుతూనే ఉన్నది. దీనికి మనకోసం మనం ట్రస్టు ఉద్యోగుల కృషి అదనం!

ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువుల వ్యతిరేక ప్రచారాన్ని 4 వ లక్ష్యంగా ప్రకటించుకున్నాం.

ఐదున్నర్ర సంవత్సరాలుగా సాగుతున్న ఈ స్వచ్చంద సేవ భారతదేశంలోనే ప్రత్యేకమైనదిగా (Unique) గుర్తింపబడింది.

13-02-2020 తేదీన ఐక్యరాజ్య సమితి సమావేశంలో 12 నిముషాల పాటు ప్రస్తావనార్హమైంది.  

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్తల తాత్త్వికత (ఫిలాసఫి) :

ఇది సేవ కాదు, ఒక సామాజిక బాధ్యతగా మాత్రమే ఈ కార్యక్రమం జరుగుతున్నది.

ఇందులో మనకొచ్చే ప్రతిఫలం కేవలం ఏరోజుకారోజు పొందే సంతోషం మాత్రమే!

పరిసరాల పరిశుభ్రత కోసం, ప్రజలలో స్వయం శ్రమజీవన సంస్కృతి కోసం ఇంకా – ఇంకా కృషి చెయ్యవలసిందే.

ఫలితాలు :

ప్రధాన రహదారులన్నీ పరిశుభ్రంగా ఉంటున్నాయి.

వార్డులలోని ప్రతి వీధిలోనూ రెండు రోజులకొకసారి తడి చెత్త, పొడి చెత్త విడివిడిగా సేకరించే వ్యవస్థ నెలకొల్పవలసిన అవసరం ఉంది.

స్వచ్చ కార్యకర్తల, మనకోసం మనం ట్రస్టుల కృషి వల్ల తడి చెత్త, పొడి చెత్త విడివిడిగా చెత్త బండికి అందించడానికి ప్రజలంతా ఎదురుచూస్తున్నారు.

ఇదొక అద్భుతమైన ఫలితం :

బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా చల్లపల్లి మూడు సంవత్సరాల క్రితమే (29.04.2017) అధికారికంగా ప్రకటింపబడింది.

గతం లో గంగులవారిపాలెం రోడ్డు,

బైపాస్ రోడ్డులోని బాలికల హాస్టల్ ప్రాంతం,

బందరు రోడ్డులోని చిన్న రాజా గారి ఇంటి ముందు,

భారత లక్ష్మీ రైస్ మిల్ బజారు,

రజక బజారు వంతెన - పెదకళ్లేపల్లి రోడ్డులోని వంతెన మధ్యన ఉన్న బండ్రేవు కోడు ఉత్తరపు గట్టు,

విజయవాడ రోడ్డులో 6 వ నెంబర్ కాల్వ వద్ద,

నాగాయలంక రోడ్డు,

పాగోలు రోడ్డు - బహిరంగ మల విసర్జనలతో ఎంత భీభత్సంగా ఉండేవో గుర్తు తెచ్చుకుంటే నిజంగా ఇది ఎంత అద్భుతమైన ఫలితమో కదా!

పబ్లిక్ టాయిలెట్లు :        

చల్లపల్లి గ్రామ పంచాయితీ సహకారంతో NTR పార్కులోనూ, పాగోలు గ్రామ పంచాయితీ సహకారంతో నాగాయలంక రోడ్డులోనూ స్వచ్చ సుందర పబ్లిక్ టాయిలెట్లను “మనకోసం మనం” ట్రస్టు నిర్మించి నిర్వహిస్తున్నది.

సంత వ్యాపారుల సహకారంతో సంతలో పబ్లిక్ టాయిలెట్లను నిర్మించి అప్పజెప్పాము.       

మన అభ్యర్ధన మేరకు RTC వారు బస్టాండులో అందమైన ఆధునిక టాయిలెట్ కాంప్లెక్స్ ను నిర్మించారు.    

తరిగోపుల ప్రాంగణం లో మరొక ఆధునిక టాయిలెట్ కాంప్లెక్స్ ను నిర్మిస్తున్నాము. 

హరిత చల్లపల్లి :

విజయవాడ, నడకుదురు, నాగాయలంక, పాగోలు , శివరామపురం, గంగులవారిపాలెం, బైపాస్ రోడ్లకు రెండు వైపులా శుభ్రం చేసి, నీడనిచ్చే వేలాది మొక్కలను, పూల మొక్కలను కిలో మీటర్ల కొద్దీ నాటి రక్షించి పెంచి పోషిస్తున్నాము.

ఈ 7 రహదారులు పరిశుభ్రంగానే కాక నీడనిచ్చే మొక్కలతోనూ ఎంతో అందంగా ఉండి గ్రామానికే హరిత సుందర ప్రత్యేకతను తెస్తున్నాయి!  

రహదారి వనాలు :

పద్మావతి ఆసుపత్రి రోడ్డుకు ఇరువైపులా, SRYSP జూనియర్ కళాశాల ముందు, కర్మల భవనం వద్ద, బైపాస్ రోడ్డులోని బాలికల హాస్టల్ వద్ద, సాగర్ ధియేటర్ ప్రక్కన, సాగర్ టాకీస్ నుండి విజయవాడ రోడ్డు వరకు ఉత్తరపు వైపున, విజయవాడ రోడ్డులో శ్రీమంతు క్లబ్ మూల వద్ద, దాని ఎదురుగా అగ్రహారం వైపు కస్తూరి మామ్మ గారి పేరుతోనూ, నాగాయలంక రోడ్డులోని పెట్రోల్ బంక్ ముందునాగాయలంక రోడ్డులో టాయిలెట్స్ వద్ద రోడ్డుకు ఇరువైపులా, బండ్రేవు కోడు దాటిన తరువాత నాగాయలంక రోడ్డుకు తూర్పు భాగంలో రైస్ మిల్ కు రోడ్డుకు మధ్య - పూల మొక్కలను నాటి మొత్తం 13 రహదారి వనాలు తయారు చేసి నిర్వహిస్తున్నాము.

మన ప్రోద్భలంతో బందర్ రోడ్డులో మూల్పూరి వేంకటేశ్వరరావు గారు తమ బంధువుల స్ధలానికి ముందు, డా. పింగళి మధుసూదనరావు గారు తమ ఆసుపత్రి ముందు రహదారి వనాలను రూపొందించుకున్నారు.  

కీర్తిశేషులు వాసిరెడ్డి కోటేశ్వరరావు మాష్టారు భారత లక్ష్మీ రైస్ మిల్ రోడ్డు ప్రాంతాన్ని ఒంటి చేత్తో శుభ్రం చేసి, రహదారి వనాన్ని తయారుచేశారు.  

ఒక్క RTC బస్టాండులోనే ఐదు పూల తోటలను తయారుచేశాము.  

డంపింగ్ యార్డ్, శ్మశానాలలో కూడా నీడనిచ్చే మొక్కలను, పూల మొక్కలను వేలాదిగా నాటాము.    

ఈ మొక్కలను, రహదారి వనాలను మనకోసం మనం” ట్రస్టు కార్మికులు పోషిస్తున్నారు. ట్యాంకర్లతో ప్రతిరోజూ వాటికి నీళ్ళను అందజేస్తున్నారు.  

సుందరీకరణ :  

1. గ్రామ ప్రధాన కూడలిలోనూ, ప్రధాన రహదారులలోనూ, గంగులవారిపాలెం రోడ్డులోనూ, బందర్ రోడ్డులో SRYSP కాలేజీ ముందు, రిజిస్ట్రార్ ఆఫీస్ ముందు, మూల్పూరి వెంకట రత్నం గారి వనము ముందు, డా. మధుసూదనరావు గారి ఆసుపత్రి ముందు, కర్మల భవనం ముందు, మునసబ్ గారి రోడ్డు, 1 వ వార్డు ముఖద్వారముల వద్ద, సంత బజారులో CI గారి ఆఫీస్ వద్ద నుండి సంత వరకు, ATM కేంద్రం లోను, 3 రోడ్ల ప్రధాన గ్రామ కూడలిలోను, అధిక వ్యయ ప్రయాసలతో రంగు రాళ్ళు (Paver Tiles) పరిచి పూల కుండీలు పెట్టి నిర్వహిస్తున్నాము.

2. రహదారులన్నీ పూల మొక్కలతో, నీడ మొక్కలతో అందంగా కనిపిస్తున్నాయి.

3. సంతలోనూ, రైతు బజారు లోనూ, CI గారి ఆఫీస్ నుండి సంత వరకు గోడలను శుభ్రం చేసి, రంగులు వేసి, అందమైన బొమ్మలను వేసి, స్వచ్చ – శుభ్ర – స్ఫూర్తిదాయక నినాదాలు, కార్టూన్లు వ్రాసి అలంకరించాము.  

4. NTR పార్కులోని, నాగాయలంక రోడ్డులోని పబ్లిక్ టాయిలెట్లకు మంచి డిజైన్లు వేసి సుందరీకరించాము. బస్ ప్రాంగణం లోని కోట కుఢ్య చిత్రం నిత్యం వేలాది ప్రయాణికులను ఆకర్షిస్తున్నది.

5. పోస్టర్లతో మురికిగా ఉండే చిన్న రాజా వారి వైజయంతం ప్రహరీ గోడకు వారి అనుమతితో శుభ్రం చేసి, రంగులు వేసి, రకరకాల డిజైన్లతో, నినాదాలతో చూడముచ్చటగా తయారుచేశాము.  

6. బైపాస్ రోడ్డులో, కమ్యూనిస్ట్ బజారులో కూడా ఇంటి యాజమానుల అనుమతితో వారి ప్రహరీ గోడలకు రంగులు వేసి, బొమ్మలు చిత్రించి, సుందరీకరించాము.

7. RTC బస్టాండ్ కు రంగులు వేసి, ఖాళీ ఆవరణ అంతా శుభ్రం చేసి ఐదు తోటలను తయారుచేసి సుందరీకరించి ఆలోచనాత్మక నినాదాలు వ్రాసి గానగంధర్వుడు SP బాలసుబ్రహ్మణ్యం గారితో ఆవిష్కరింపజేశాము.

8. పంచాయితీ వారి అనుమతితో శ్మశానాన్ని నెలలతరబడీ శుభ్రపరచి అనేకమొక్కలను పెట్టడమే కాక ఆర్కిటెక్ట్ తో శ్మశానం ముందు భాగాన్ని అందంగా డిజైన్ చేయించాము.

9. డా. దుగ్గిరాల శివప్రసాదు గారు తమ భార్య సంస్మరణార్ధం “దహనవాటిక” ను నిర్మించగా, వారి కుమార్తె దహనవాటిక ముందు వేచి ఉండుటకు ఒక అందమైన షెడ్డును తయారుచేయించారు.  

10. శ్మశానంలో అందమైన టాయిలెట్ కాంప్లెక్స్ ను డా. పద్మావతి గారు నిర్మిస్తున్నారు.

11. డంపింగ్ యార్డును కూడా శుభ్రపరచి చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని నిర్మించి, పచ్చిక బయళ్లతో, చెట్లతో, పూల - వెదురు మొక్కలతో సుందరీకరించి, పంచాయితీ వారికి అందజేశాము. 

12. గత సంవత్సరం మన అభ్యర్ధన తో శ్మశానంలో అప్పటి కలెక్టర్ గారు సిమెంట్ రోడ్డు వేయించారు. ఈ సంవత్సరం డంపింగ్ యార్డులో మిగిలిన భాగంలో వేయవలసిన సిమెంట్ రోడ్ ను మన MLA గారు మంజూరు చేయగా ఎంతో ప్రయోజనకరమైన ఆ దారి పూర్తి కావడం ముదావహం.

13. స్వచ్చ కార్యకర్తలు, మనకోసం మనం ట్రస్టు, డా. పద్మావతి గారు ప్రత్యేక శ్రద్ధతో ఈ శ్మశానం, డంపింగ్ యార్డు ప్రాంతాన్ని అభివృద్ధి చేసి, ఎంతో అందంగా తయారుచేసి పంచాయితీ వారి అనుమతితో ఆ ప్రాంతాన్ని “తరిగోపుల ప్రాంగణం” గా పేరు పెట్టడమయినది.  

14. విజయవాడ లోని ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. పోతినేని రమేశ్ బాబు గారు వారి శ్రీమతి మహాలక్ష్మీ గార్ల భూరి వితరణతో సౌకర్యవంతమైన వీడుకోలు (మహా ప్రస్థానం) వాహనాన్ని ఏర్పాటు చేయడమైనది. ఇది చల్లపల్లి వాసులకు చాలా ఉపయోగంగా ఉంది.

భూగర్భ మురుగు పారుదల వ్యవస్థ :

          పంచాయితీ వారి అనుమతితో గంగులవారిపాలెం రోడ్డులో మనకోసం మనం ట్రస్టు వారు, కమ్యూనిస్ట్ బజార్ లో స్థానికులందరూ కలిసి తమ సొంత ఖర్చుతో ఆదర్శప్రాయమైన భూగర్భ మురుగు పారుదల వ్యవస్థను ఏర్పాటు చేసుకొనడం గొప్ప విశేషం.

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వ్యతిరేక ప్రచారం :

- పర్యావరణ పరిరక్షణ కోసం Reduce - Reuse - Recycle  (తగ్గించు – పునరుపయోగించు – పునరుత్పాదించు) సూత్రాలను కార్యకర్తలు తాము ఆచరిస్తూ ప్రచారం చేస్తున్నారు.

- క్యారీ బ్యాగులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ప్రతి సోమవారం జరిగే సంతలో మళ్ళీ మళ్ళీ వాడగలిగే 30 వేలకు పైగా సంచులను సబ్సిడీ రేట్లపై రెండు సంవత్సరములకు పైగా అమ్మడం జరిగింది.

- మూడు సంవత్సరాల క్రితమే చల్లపల్లి లో ఉన్న 5000 ఇళ్ళకు వెళ్ళి ప్రతి కుటుంబానికి ఒక సంచి చొప్పున బహుకరించి,  చైతన్యపరచడం జరిగింది.  

హరిత వేడుకలను ప్రోత్సహించడం :

చల్లపల్లి లో జరిగే వివిధ వేడుకలను ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువలనేమీ వాడకుండా జరిగే హరిత వేడుకలుగా జరిగేటట్లు ప్రోత్సహిస్తున్నాము. ఈ విషయంలో మంచి పురోగతే ఉన్నది.

ఫ్లెక్సీ షేమ్ ఉద్యమం :          

స్వీడన్ లో పర్యావరణ వేత్త కుమారి గ్రేటాథన్ బర్గ్ మొదలుపెట్టిన ఫ్లైట్ షేమ్ ఉద్యమం స్ఫూర్తిగా మేము ఫ్లెక్సీ షేమ్ ఉద్యమం మొదలుపెట్టాము.

పర్యావరణానికి ప్రమాదకరమైన ఫ్లెక్సీ లను వాడటానికి సిగ్గు పడాలి అనే ఉద్దేశంతో ఈ ఉద్యమానికి ఈ పేరు పెట్టాము.

హైకోర్ట్ నిషేధించినప్పటికీ రాష్ట్రమంతటా ఈ ఫ్లెక్సీలను విస్తృతంగా వాడుతునే ఉన్నారు. చల్లపల్లి లో

మాత్రం మా ప్రచారం వలన వీటి వాడకం బాగానే తగ్గింది. అంతేగాక విజయవాడ వంటి

ప్రముఖనగరంలో జరిగే కొన్ని పెద్ద వేడుకలు స్వచ్చ చల్లపల్లి స్ఫూర్తితో ఫ్లెక్సీలు లేకుండా హరిత

వేడుకలుగా జరగడం సంతోషకరమైన పరిణామం.

మరి ఈ అద్భుతం ఎలా సాధ్యమయింది?

కృష్ణాజిల్లాలో పెడగా ఉండే ఒక గ్రామంలో 2000 దినాల సుదీర్ఘ సమయంలో – లక్షల కొద్దీ పని గంట

నిస్వార్ధ శ్రమదాన ఉద్యమం ఎలా విజయవంతమయింది?

ఆరేళ్ల నాటి చల్లపల్లి రూపురేకలతో, అత్యధిక గ్రామస్తుల ఆలోచనలలో అభ్యుదయకరమైన –

సానుకూలమైన ఈ శుభపరిణామానికి మూలమేమిటని ఆలోచిస్తే – ఒకే ఒక్క కారణంతోస్తున్నది.

ఈ స్వచ్చోద్యమ విజయానికి, గ్రామంలోని మంచి మార్పుకు కారణం స్వచ్చ కార్యకర్తల అకుంఠిత

దీక్ష, పట్టుదల, త్యాగం, శ్రమ జీవనతత్త్వం తప్ప మరేదీ కాదని చెప్పగలను.

అందిన అందరి సహకారం :

గ్రామ పంచాయితీ, ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ, మండల ప్రజా పరిషత్, పోలీసు డిపార్ట్మెంట్, అన్ని శాఖల ఇంజనీరింగ్ అధికారులు, గ్రామస్తులు, అన్ని రాజకీయ పార్టీలు మనస్పూర్తిగా స్వచ్చ చల్లపల్లి ఉద్యమానికి సహకరించబట్టే ఈ విజయాలు సాధ్యమయ్యాయి.

తలా ఒక చెయ్యి వేయడమనే నానుడికి ఇక్కడ రెండు విషయాలు ప్రస్తావించాలి.

ప్రభుత్వ ఉన్నత పాఠశాల ముందు భాగంలోని పింగళి వేంకయ్య, జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాల ఏర్పాటులో, NTR పార్కును ఎంతో శ్రమతో గ్రామ ప్రయోజనకరంగా అభివృద్ధి చేయడంలో ఆనాటి శాసనసభ్యుని, మండల ప్రజాపరిషత్ అధ్యక్షుని, గ్రామ ఉపసర్పంచ్ గారి కార్యదీక్షలు ఎంతో ఉన్న విషయం గమనార్హం.

స్వచ్చ చల్లపల్లి ఉద్యమం నేడు దేశవిదేశాలలో ఇంతగా గుర్తింపబడడానికి ఒకే కారణం మన పాత్రికేయ మిత్రులు.

వీరందరికీ అనేక నమస్కారములు.

స్వచ్చ సుందర చల్లపల్లి కోసం ఇంకా ఏం చెయ్యాలి :

1. గ్రామంలో కనీసం మరి రెండుచోట్ల - సెంటర్ లోనూ, రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలి.  కనీసం యూరినల్స్ అయినా నిర్మించాలి. 

2. గ్రామంలోని మిగిలిన డ్రైన్లన్నిటిని (భూగర్భ మురుగు వ్యవస్థ) Under Ground Drainage

లేదా Covered Drainage (మూత మురుగు వ్యవస్థ) గా మార్చాలి. తెరచి ఉన్న మురుగు కాల్వల్లో

ప్లాస్టిక్ గ్లాసులు, టీ కప్పులు, వాటర్ బాటిల్స్, క్యారీ బ్యాగులు, ఖాళీ మద్యం సీసాలు పడవేయాలనిపిస్తుంది.

మురుగు నడవదు. ఈగలు, దోమలు చేరి ప్రజల సౌకర్యానికి, ఆరోగ్యానికి ప్రమాదం తెస్తాయి.    

3. రోడ్డు మీద నీళ్ళు నిలిస్తే రోడ్డు పాడైపోతుంది కనుక ఆ నీరు డ్రైన్ లోకి వెళ్లిపోతూ ఉండాలి. అందుకోసం రోడ్డు మార్జిన్ నుండి డ్రైన్ వరకు ఎక్కడా ఎత్తు లేకుండా చూడాలి.

4. డ్రైన్ పైన ఆక్రమణలు ఉంటే లోపల ఉన్న సిల్టును తీయడం సాధ్యం కాదు. కనుక ఉన్న  ఆక్రమణలు తొలగించాలి, కొత్తవి రాకుండా నివారించాలి.  

5. రోడ్ల మీద చెత్త వేస్తే పంచాయితీ వారు జరిమానాలు వెయ్యాలి. 

6. టీ షాపుల వారు పేపర్ కప్పులలో టీ అందిస్తున్నారు. తాగిన తరువాత ఈ కప్పులను రోడ్డు ప్రక్కల గాని, డ్రైన్లలో గాని పడవేస్తున్నారు. ఇలా పడవేసిన వారికి, షాపుల వారికి పంచాయితీ వారు జరిమానాలు విధిస్తేనే ఈ అలవాటు మాన్పగలం.      

గాజు గ్లాసులలో మాత్రమే టీ, కాఫీ లు సప్లై చెయ్యాలనే నిబంధన పెడితే మరీ మంచిది. ఇలా ఒక పట్టణం లో చేస్తున్నారని వార్తాపత్రికలలో ఆ ఆమధ్యన చదివాం. గ్లాసులను వేడి నీళ్లల్లో కడిగి శుభ్రంగా ఇస్తే జనం కూడా అంగీకరిస్తారు. గతంలో మనం, మన పూర్వులు గాజు స్టీలు గ్లాసుల్లోనే త్రాగేవారం కదా!

7. గ్రామంలో అన్ని రకాల ఫ్లెక్సీలను నిషేధించాలి. అనుమతి లేకుండా పెట్టిన వారికి జరిమానాలు విధించాలి.

8. ప్రహరీ గోడల గేటులు లోపలకి మాత్రమే తెరుచుకోవాలి. రోడ్డు వైపు తెరుచుకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇది చట్టరీత్యానేరం కూడా. పంచాయితీ వారు ఈ నిబంధన అమలు జరిగేట్లు చూడాలి.    

9. Liquid Waste management – అపార్ట్మెంట్ల నుండీ, ఇళ్ల నుండీ వచ్చే మురుగును భూగర్భంలోకి పోకుండా చెయ్యడం అత్యంత అవసరం లేకుంటే భూగర్భ జలాలు కలుషిత మై ఊహించలేని ప్రజారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఈ మురుగు డ్రైన్లలోనికి మాత్రమే పారేటట్లు చూడాలి. అలా అయితేనే పంచాయితీ వారు భవన నిర్మాణానికి అనుమతినివ్వాలి. కోమలానగర్ వంటి చోట్ల ఇది ఒక ప్రత్యేకమైన సమస్య. 

రాబోయే పంచాయతీ పాలకవర్గం పైన చెప్పినవన్నీ అమలుపరిచి చల్లపల్లిని దేశంలో ఒక ఆదర్శ గ్రామంగా తయారుచేయగలరని స్వచ్చ కార్యకర్తలందరూ ఆశిస్తున్నారు.

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు