ప్రాతూరి శాస్త్రి 09.11.2020. ....           09-Nov-2020

 స్వచ్ఛ సుందర చల్లపల్లి లో దాదాపుగా కార్యకర్తలు అందరూall rounders.            

 సీనియర్ సిటిజెన్ విభాగము నుండి శ్రీ మాలెంపాటి గోపాలకృష్ణయ్య.

 వీరిని గురించి రిటైర్డ్ ప్రిన్సిపాల్, శ్రీ నల్లూరి రామారావు గారు ఇలా వచించారు.

 అమాయకుడా, కార్యసాధకుడా అది చెప్పుట కష్టం-

డా. మాలెంపాటి గోపాలకృష్ణయ్య, B.V.Sc.

నిమ్మగడ్డలో జననం చల్లపల్లి నివాసం

అతనికీ స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమానికీ అభేదం.

 

స్వార్థపదమున కర్ధమెరుగని స్వచ్ఛ సుందర కార్యకర్త

తిండి, నిద్రలు మరచి ఊరుని తీర్చిదిద్దే స్వచ్ఛ శాస్త

వయసనారోగ్యాలు పట్టక స్వచ్ఛగ్రామం పట్ల తృష్ణ

స్వచ్ఛ భటుడో నిత్య బాలుడో వెటర్నరి గోపాలకృష్ణ!

 

పెద్దకాలం బ్రతికినామా, పెత్తనం వెలిగించినామా,

సొంతవాళ్ళకు, కుటుంబానికి సొత్తులను సమకూర్చినామా...

అనే ధోరణి వదలి ప్రజలకు స్వచ్ఛవిందులు పంచుటే

ధ్యేయమనుకొను వృద్ధబాలుడు మా గోపాలకృష్ణుడే!

 

వాన వచ్చిన-మంచు హెచ్చిన-మండుటెండలు రెచ్చిపోయిన

ఎన్ని ఆటంకాలు చుట్టిన ఇతడు భయపడడెందుకో!

నాటి అర్జును దృష్టి సర్వం పక్షి కంటిని కూల్చుటే- మరి

నేటి గోపాలుని ప్రయత్నం స్వచ్ఛ సుందర చల్లపల్లే!

        ఏ పని చేద్దామన్నా ముందంజవేసి కార్యక్రమం విజయవంతం చేయుటలో ఘనుడు.

        అందుకే ఈ డా.గోపాలకృష్ణయ్య గారు ఓ ఆల్రౌండర్.

                                            ***

స్వచ్ఛ సుందర చల్లపల్లి లో జూనియర్ విభాగంలో మరో ఆల్ రౌండర్ మన బృందావన్.

        పద్మావతీ ఆసుపత్రిలో కాంపౌండర్ గా పనిచేస్తున్నాడు.

         చేరినా దాదాపుగా స్వచ్ఛ చల్లపల్లి కె అంకితం.

          ఏ పనిచెప్పినా కాదనకుండా పని చేయడం ఈయన ప్రత్యేకత.

శ్రీ నల్లూరి రామారావు , రిటైర్డ్ ప్రిన్సిపాల్ గారు గంధం బృందావన్ గూర్చి ఆయన చేసే పనులను వివరించుచు కవితా రూపమిచ్చారు.

గంధం బృందావన్

(ఇతనిది చిరువోల్లంక ఇతని భార్య లక్ష్మణ

ఉంటున్నది సాయినగర్ ఉద్యోగాలు హాస్పిటల్

ఇతని అసలు ఉద్యోగం స్వచ్ఛ చల్లపల్లి సేవ

వీళ్ళ ఋణం చల్లపల్లి ఏనాడైన తీర్చగలద?)

ఎవరికెవరు సాటి?

బృందావనమందరిదీఅనుట పాత పాట

అందరి సేవ బృందావనాని దనుట క్రొత్త మాట

ఆసుపత్రి కాంపౌండర్ సేవలలో ఆల్ రౌండర్

అతనికతడె సాటి స్వచ్ఛ చల్లపల్లి సాధనలో!

ట్రీ గార్డుల డొనేషన్లు ముళ్ళకంప నరుకుళ్ళు

కడవల కొద్ది చెమట నీళ్ళు కత్తులు, గొడ్డళ్ళు

స్వచ్ఛ చల్లపల్లి పనిలొ అరుపులు ఉరుకులు పరుగులు

ఆ లెక్కన బృందావనం స్వచ్ఛసేవల హైజాకర్!

ఆసుపత్రి నర్సమ్మ ఈ గంధం లక్ష్మణ

గ్రామ ప్రజారోగ్యానికి కల్పించిన రక్షణ

చల్లపల్లి స్వచ్ఛ పనికి చిరకాల నిరీక్షణ

ఆగలేక అప్పుడపుడు హాజరీ సమర్పణ!

బృందావన్ మాటలలో సుందర చల్లపల్లి.

    మనం ప్రతి పనిలో పరిశుభ్రత పాటిస్తే

ఎదుటివారు గూడా అనుకరించడానికి సాయపడిన వారమౌతాము.

డాక్టర్ గారి సలహా మేరకు కోళ్లఫారాల నుండి డబ్బాలు తెచ్చి

ఊరంతా చెత్త డబ్బాలు పంచినపుడు,

డాక్టర్ గార్ల అనుమతితో చెట్టు దుంగలను సోఫాగా మార్చినపుడు, అమెరికా లోని నాదెళ్ల సురేష్ గారు పంపిన cutting machine తో పెరిగిన కొమ్మలు నరికినపుడు  చాలా ఆనందం వేసింది. స్వచ్ఛ చల్లపల్లి లో ఏ పండుగ వచ్చినా, ఆనంద ఆదివారాల్లో, అల్పాహారాల ఏర్పాట్లలో receptionist లక్ష్మీ సెల్వం అక్కతో కలిసి పనిచేస్తాం.

ప్రాతూరి శాస్త్రి

09.11.2020