ప్రాతూరి శాస్త్రి - 11.11.2020....           11-Nov-2020

 The Respirator

(He, the man, not only Respirator but the great booster)

ఎవరు వీరు అనుకుంటున్నారా:

ఎవరి రాకకై కార్యకర్తలు ఎదురుచూస్తుంటారో,

ఎవరి మాటలకు కార్యకర్తలు ఉత్తేజితులౌతారో,

ఎవరు ప్రసంగిస్తే కార్యకర్తలు కదలక

చెవులు రిక్కించి వింటారో,

ఎవరి పలుకులకు కార్యకర్తలు ప్రభావితులై కార్యన్వితులౌతారో,

            వారే

డా. గోపాళం శివన్నారాయణ గారు.

                      ....

స్వచ్ఛ కార్యక్రమాలకి ఉదయం 4-30 గంటలకే డా. శివన్నారాయణ గారు రావడం చాలా సంతోషం. రాగానే కార్యకర్తలందరినీ పలకరిస్తారు. డిసెంబర్ 25  ఆయన పుట్టినరోజు. తన పుట్టిన రోజుని స్వచ్ఛ కార్యకర్తలందరి మధ్య జరుపుకోవాలని తెల్లవారుఝామునే చల్లపల్లి వచ్చేస్తారు. కార్యక్రమానంతరం స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేస్తారు.

డా. శివన్నారాయణ గారి ఒక ప్రసంగం.....

ప్రపంచంలో రెండు రకాల మనుషులుంటారు.

మొదటిరకం పుడతారు సంపాదించి పోగు చేస్తారు దాచుకుంటారు గిడతారు’. ఇది అనాగరికం.

రెండవరకం పుడతారు సంపాదిస్తారు పంచుతారు వెళ్ళిపోతారు’. ఇది నాగరీకులు చేసే పని.

స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలంతా రెండవరకం మనుషులే. ఆస్తులను పంచటానికి ఒక పరిమితి ఉంటుంది. ఎంత ఉంటే అంతే పంచగలం. కానీ మీరు ఒక మంచి భావజాలాన్ని పంచుతున్నారు. మహాత్మా గాంధీ అహింసను ఎలా పంచారో అలానే మీరు కూడా కనిపించని రెండో తల్లిఅయిన సమాజంకోసం మీ బాధ్యతని నిర్వర్తిస్తున్నారు. ఇది సేవ అనుకుంటే చప్పట్లకో, దండలకో, మెచ్చుకోళ్ళ కోసమో ఎదురు చూస్తారు. తరువాత నా అంతవారు లేరు అనే గర్వం వస్తుంది. కానీ మీరెవ్వరూ సేవఅనుకోవడం లేదు. సమాజం పట్ల మీ బాధ్యతఅని నిర్వర్తిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రపంచంలో ఇంతకాలం క్రమం తప్పకుండా ఇటువంటి కార్యక్రమం చేయటం అరుదుగా జరుగుతుంది.

మా తాతగారు చాలా నిజాయితీపరుడు, చాలా నిక్కచ్చి మనిషి. ఆయన చనిపోయే వరకు ఊరికి సర్పంచ్ గా పనిచేశారు. కుటుంబసభ్యుల వల్లనైనా సరే ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే సహించేవారు కారు. ఆయన జీన్స్ నాకు వచ్చాయనుకుంటాను. గోపాళం రామస్వామి, భ్రమరాంబ (తాతగారు నాయనమ్మ) గార్ల పేరుతో నేను ఒక ట్రస్ట్ నడుపుతూ షుగర్, బి.పి., పక్షవాతం, ఫిట్స్ రోగులకు 35 క్యాంపులు నడుపుతున్నాను.

మీలో ఉన్న మంచి జీన్స్ మీ పిల్లలు, మనవళ్ళలో కొంతమందికి తప్పకుండా వస్తాయి. నేను మా తాత గురించి చెప్పుకున్నట్లే మీరు చేసే మంచిపనుల వలన ముందు ముందు మీ మనవళ్ళు కూడా 'మా తాత స్వచ్ఛ చల్లపల్లి కోసం బాగా కష్టపడ్డాడ'ని తప్పక చెప్పుకుంటారు.

నాగరీకులైన మీ అందరి ముందూ నా పుట్టినరోజుని జరుపుకోవటం ఎంతో సంతోషంగా ఉంది”. - డా. గోపాళం శివన్నారాయణ

నా విజ్ఞప్తి:

అత్యంత సామాజిక స్పృహ ఉన్న డా. శివన్నారాయణ గారి లాంటి వ్యక్తి నుండి ఇటువంటి ప్రశంసను పొందగలగటం గొప్ప విషయం. మన బాధ్యత ఇప్పుడు మరింత పెరిగింది. మనందరం నిస్వార్థంగా (ధనము, హోదా, కీర్తి వగైరాలు ఆశించకుండా) ఇప్పటిలానే సామాజిక కృషిని కొనసాగిద్దాం. సంతోషాన్ని పొందుదాం.

- డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

మీ సహచర స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

25-12-2017

కోమలి సహకారంతో గోపాళం నారాయణుడు

గోపాళం ప్రోత్సాహంతో కోమలి చెలరేగుచుండు 

ఈ ఉభయుల సమిష్టి కృషితో వేలాదిగ అస్వస్తులు

స్వస్తులు సంతృప్తులుగా బ్రతికిపోవుచుందురు!

 

గంగ పారునెపుడు కదలని గతితోడ

నిండునదులు పారు నిల్చి గంభీరమై

ఈ సజ్జనుండు పల్కు మధురముగాను

పరిమళములు తెచ్చు వచ్చినప్పుడెల్ల.

వీరుగాక మరెవ్వరు శివన్నారాయణుడే.

 

- ప్రాతూరి శాస్త్రి

   11.11.2020.