నందేటి శ్రీనివాసరావు....           02-May-2020

 2000 దినాల స్వచ్చోద్యమ చల్లపల్లి సేవా తరంగాలు –

కార్యకర్తల స్వానుభవ జ్ఞాపకాల పరంపర - 1 

స్వచ్చ చల్లపల్లి ఉద్యమ పరిచయం :  

          శ్రీ మంతు రాజ వంశీయుల పాలనలో శతాబ్దాలుగా ఉండి, 130 సంవత్సరాలు పైబడిన గ్రామ పంచాయితీగా ఘన చరిత్ర కలిగి కూడా అపరిశుభ్రతకు నిలయమై , దుర్గంధ భరితమైన మురుగు నీటి పారుదల వ్యవస్థతో - దుమ్ము దూళి సగ భాగాన్ని కప్పిన రహదారులతో కళావిహీనంగా, నిస్సహాయంగా అంటువ్యాధులు అనారోగ్యాలతో జత కట్టిన చల్లపల్లికి రాబోయే ప్రమాదాన్ని పసిగట్టి రేపటి గ్రామ సమాజ హితమే ముఖ్యమని భావించే వైద్యదంపతుల – జనవిజ్ఞాన వేదికల ఆలోచనల నుండి పురుడు పోసుకున్నదే ఈ “స్వచ్చ చల్లపల్లి” ఉద్యమం.

స్వచ్చ చల్లపల్లి ఉద్యమంతో ప్రజాగాయకుడిగా నా ప్రయాణం – అనుభవాలు : 

          నేటికి 2000 రోజులుగా జరుగుచున్న నిస్వార్ధ నిరంతర స్వచ్చ సేవలలో నేను నా వంతు పాత్రను కొంత పోషిస్తూ స్వచ్చ కార్యకర్తగా పిలవబడటం నాకు మాత్రమే కాదు నా కుటుంబానికి కూడా గర్వకారణమే. ఈ 2000 రోజుల పాటు జరిగిన శ్రమదాన సౌందర్యం లో ప్రజా కళాకారుడిగా నా అనుభవాలను ఒక్కసారి మననం చేసుకుంటే :

          100 రోజుల స్వచ్చ చల్లపల్లి ఉద్యమం స్వతహాగా ప్రజాగాయకుడినైన నాలో స్ఫూర్తిని రగిల్చి -

“కదలి రండి కలిసి రండి స్వచ్చ చల్లపల్లికి – శ్రమ శక్తే మూలధనం ఆరోగ్యమే దాని ఫలం” అని రాయించి, పాడించింది. ఆ తరువాత సంవత్సర కాలం నిరంతరాయంగా సాగుతున్న ఉద్యమాన్ని దగ్గరగా గమనించిన నేను “గాంధీజీ బ్రతికుంటే మీ గడప కొచ్చేను ఘనమైన మీ పోరు చూసి గర్వించేను” అని కూడ గళం విప్పవలసి వచ్చింది. మొక్కలు పెంచాలని జొన్నవిత్తుల గారు రాసిన పాట ఆయన రాకకంటే - 500 రోజులు ముందుగానే చల్లపల్లి లో ఉత్సాహం ఉరకలు వేయిస్తూ పెట్టు రావి చెట్టు గంగరావి చెట్టు – దాని వెంట వేప చెట్టు మరి గానుగ చెట్టు” అంటూ పాడించి స్వచ్చ ఉద్యమకారులతో కేరింతలు కొట్టించింది. రోడ్లపై చెత్త చెదారాలు, దుర్గంధ భరిత డ్రైనేజి వ్యవస్థ, బహిరంగ మలవిసర్జన, ప్లాస్టిక్ క్యారీబ్యాగుల నిషేధం లాంటివి స్వచ్చ సైనికుల కఠోర శ్రమతో దాదాపు ప్రక్షాళన దిశగా సాగుతుండగా స్వచ్చ ఉద్యమ సారధుల్లో ఒకరైన డాక్టర్ పద్మావతి మేడమ్  గారి సృజనాత్మకతతో స్వచ్చ సైనికులు అభ్యంగన స్నానం చేయించిన చల్లపల్లి అనే యువతికి చీరకట్టి, బొట్టు పెట్టి, రంగులుదిద్దే సుందరీకరణ కార్యక్రమంతో స్వచ్చ చల్లపల్లి ఉద్యమం కాస్తా స్వచ్చ సుందర చల్లపల్లి ఉద్యమంగా రూపాంతరం చెంది, గల్లీ నుండి డిల్లీ దాక పాకి ఆ నోటా ఈ నోటా అందరూ అనుకుంటున్న మాటే ఆరోజు నాతో “మన ఊరందం చూడు మామయ్యో – తళ తళ మెరిసే దారులు చూడు, దారి ప్రక్కన మొక్కలు చూడు, మొక్కల పూల గుత్తులు చూడు – స్వచ్చ సైనికుల శ్రమలో ఒదిగిన సుందర చల్లపల్లిని చూడు ” అనే హుషారైన గీతాన్ని వ్రాయించి, పాడించింది.

          ప్రజల ప్రధాన అవసరాలైన బస్టాండు ఆధునీకరణ, బైపాస్ రోడ్, సంత మార్కెట్ సుందరీకరణ, డంపింగ్ యార్డు, పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణాలు పార్కింగ్ టైల్స్  సదుపాయాలు - ఇలా ఎన్నో గ్రామ ప్రజలకు స్వచ్చ శుభ్ర సౌకర్యవంతమైన మౌలిక మార్పులకు శ్రీకారం చుట్టి ఆ మార్పులలో కొన్నాళ్లు జీవించిన మనిషి అంతిమ దశలో ముళ్ళ పొదలతో నిండిన మురుగు కాల్వ కట్టగా పిలవబడే శ్మశానవాటికకు చేరితే - స్వచ్చ కార్యకర్తల స్వేదజలంతో తడిసి పునీతమై, డాక్టర్ పద్మావతి మేడమ్ గారి కష్టార్జితంతో ఈ ఉద్యమానికి ఊతమిచ్చే కొంతమంది దాతల సహకారంతో అత్యంత శోభాయమానంగా రూపుదిద్దుకొన్న “తరిగోపుల ప్రాంగణం”తో నాలోని సాహిత్యాభిలాష కొత్త పుంతలు తొక్కి -

          “చల్లపల్లి ని స్వచ్చ చల్లపల్లి గ మార్చ – ప్రతినబూనిన కార్యకర్తలార.....”  అనే పద్యరూపం దాల్చి పాడించింది!

2000 రోజుల ఈ ఉద్యమంపై నా అభిప్రాయాలు :

1. మన కార్యకర్తల లక్షలాది పనిగంటల శ్రమదానంతో చల్లపల్లి లో వచ్చిన అనేక మార్పులను ప్రజలు గమనించారు., ఒప్పుకొంటున్నారు

2. ప్రజల ఆలోచనా విధానంలో మనం తీసుకొచ్చిన మార్పు వల్లే ఎంతసేపయినా చెత్త బండి కోసం ఎదురు చూస్తున్నారే కాని రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ పోయకపోవడం పంచాయితీ వారికి భయపడి కాదు; వారిలోని స్వచ్చ – శుభ్రతా స్పృహ వల్లనే!

3. మనం ఇంత చేసినా దురదృష్టవశాత్తూ ఈ పని చేయవలసిన పంచాయితీ పూర్తి స్థాయిలో ఇప్పటికీ పారిశుద్ధ్య స్వచ్చ – సుందర బాధ్యతలు నెరవేర్చి స్థితిలో లేకపోవడం.

4. కారణం తెలియదు కాని చల్లపల్లి లో ఉన్న సామాన్య జనం మన సేవల విలువను గుర్తించక, ఇది వారి బాధ్యత కూడా అని భావించకపోవడం.

5. సంపన్న వర్గాలు మన సేవలను గమనించి కొనియాడి - ఆర్ధిక, ఆర్ధి కేతర సహకార మందించడం లో కొంత వెనుకంజలూ ఉండడం.

6. అడుగడుగున అడ్డంకులు ఎదురైనా వడి వడిగా మును ముందుకు పోతూ మనం నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరేవరకు దీనిని కొనసాగించడమే మన ముందున్న కర్తవ్యమని నా అభిప్రాయం.

చివరగా :      

* స్వచ్చ చల్లపల్లికి కార్యకర్తగా ఉండడమే నాకు గుర్తింపు కానీ ... నా వలన స్వచ్చ చల్లపల్లి ఉద్యమానికి గుర్తింపు రాదని తెలియజేసుకుంటూ -

* “మనకోసం మనం అనేది కావాలి ప్రతి ఒక్కరి నినాదం

          మన స్వచ్చ కార్యకర్తలందరిదీ ఒకే వసుధైక కుటుంబం

          చల్లపల్లి ప్రజలందరికీ అది కావాలి స్ఫూర్తిమంతం....”

- నందేటి శ్రీనివాసరావు

ప్రజాగాయకుడు, స్వచ్చ కార్యకర్త, ఘంటశాల.

02.05.2020.